Share News

50 Naxalites Arrested: 50 మంది నక్సల్స్‌ అరెస్టు

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:50 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేరోజు భారీసంఖ్యలో మావోయిస్టులు అరెస్టయ్యారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన మంగళవారమే కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 50 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడో దండకారణ్యంలో ఉండే మావోయిస్టుల దళం బెజవాడ సమీపాన మకాం వేసింది....

50 Naxalites Arrested: 50 మంది నక్సల్స్‌ అరెస్టు

  • ఒకేరోజు 5 జిల్లాల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • బెజవాడలో 32 మంది మావోయిస్టుల అరెస్టు

  • ఏలూరు, కొప్పవరం, అమలాపురంలో 18మంది

  • హిడ్మా ఎన్‌కౌంటర్‌ రోజునే కీలక పరిణామాలు

విజయవాడ/ఏలూరు, కుక్కునూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఒకేరోజు భారీసంఖ్యలో మావోయిస్టులు అరెస్టయ్యారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన మంగళవారమే కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 50 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడో దండకారణ్యంలో ఉండే మావోయిస్టుల దళం బెజవాడ సమీపాన మకాం వేసింది. వెంట ఆయుధాలను కూడా తెచ్చుకుంది. అనుమానం రాకుండా ఓ భారీ భవనంలో బసచేసింది. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న కానూరులో ఉన్న న్యూ ఆటోనగర్‌లో తలదాచుకున్న ఈ దళాన్ని గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి రెండు గంటల నుంచి మంగళవారం ఉదయం పది గంటల వరకు జరిగిన సైలెంట్‌ ఆపరేషన్‌లో మొత్తం 28 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరిలో 21 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. పట్టుబడినవారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ రక్షణ దళాధిపతి జ్యోతి కూడా ఉన్నట్లు సమాచారం.

కూలీలుగా వచ్చిన మావోయిస్టులు..?

అప్పలస్వామినాయుడు అనే ఆర్కిటెక్చర్‌ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఐదో అడ్డరోడ్డులో మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. గోడౌన్‌గా అద్దెకు ఇవ్వడానికి ఏడాది క్రితం దీనిని కట్టారు. అప్పలస్వామినాయుడు ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. భవనాన్ని చూసుకోవడానికి ఒక వాచ్‌మన్‌ను నియమించుకున్నారు. కొద్దిరోజుల క్రితం వాచ్‌మన్‌కు పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులు అతడి వద్దకు వచ్చారు. ఆ తర్వాత అతడు ఈ 28 మంది మావోయిస్టులకు మూడో అంతస్తులో ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారంతా పది రోజుల కిందటే ఇక్కడ దిగారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారికి ప్రతి రోజూ తెల్ల కారులో ఉదయం టీ, అల్పాహారం.. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనాలు వచ్చేవి. క్యాటరింగ్‌ చేసే వారి మాదిరిగా వాటిని తీసుకొచ్చేవారు. పెద్ద కెటిల్‌లో టీ, పెద్దపెద్ద క్యారేజీల్లో టిఫిన్లు, భోజనాలు వచ్చేవి. ఈ తతంగాన్ని పక్క భవనంలో ఉన్న వ్యక్తులు నాలుగు రోజుల క్రితం గమనించారు. వాచ్‌మన్‌ను పిలిచి భవనంలో ఉన్నవారెవరో కారులో వచ్చినవారిని అడిగి తెలుసుకోవాలని పురమాయించారు. అతడు అలాగే అడుగగా.. కూలీలు ఉన్నారని వారు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ భవనంలో ఎందుకున్నారని ప్రశ్నించగా.. పనులు ఇంకా దొరకలేదని, మంచి ఉపాధి దొరకగానే వెళ్లిపోతారని వారు బదులిచ్చినట్లు తెలియవచ్చింది. కాగా.. న్యూ ఆటోనగర్‌లో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల నుంచి మంగళవారం ఉదయం పది గంటల వరకు పోలీసుల ఆపరేషన్‌ సాగింది. బలగాలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాయి. ముందుగా భవనంవైపు ఉన్న రోడ్లన్నీ బారికేడ్లతో మూయించి.. భవనాన్ని చుట్ట్టుముట్టాయి. షట్టర్ల వద్ద అత్యాధునిక ఆయుధాలతో మాటు వేశాయి. పోలీసుల హెచ్చరికలు, సందేశాలను అర్థం చేసుకున్న మావోయిస్టులు లొంగిపోయారు. వారిని ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత డాగ్‌ స్క్వాడ్‌ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. తర్వాత బాంబ్‌ స్క్వాడ్‌ తుపాకులు, మారణాయుధాలు, పేలుడు పదార్ధాలను గుర్తించింది. వాటన్నిటినీ పోలీసులు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. అలాగే విజయవాడ పరిధిలోని రామవరప్పాడులో మరో నలుగురు నక్సల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.


ఏలూరులో 15 మంది..

ఏలూరు జిల్లాలో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టుచేశారు. మావోయిస్టులపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏలూరు మినీ బైపాస్‌ పక్కనే ఉన్న కేకేఆర్‌ గ్రీన్‌సిటీలోని ఒక భవనంలో నక్సల్స్‌ మకాం వేసినట్లు గుర్తించారు. డ్రోన్ల సాయంతో వారి కదలికలను పసిగట్టారు. ఉదయం 11 గంటల సమయంలో పోలీసులు మఫ్టీలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరోవైపు.. విజయవాడ నుంచి ప్రత్యేకంగా 30 మంది బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు ధరించిన గ్రేహౌండ్స్‌ సిబ్బంది వచ్చారు. ఒక్కసారిగా ఆ భవనంపై దాడి చేసి 14 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారు. 45 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ పూర్తయింది. వీరందరినీ ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీసు స్టేషన్‌ భవనంలో ఉంచారు. ఈ ఘటనపై ఏలూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం కాగా.. ఏలూరు సమీపంలోని వట్లూరు వేణుగోపాలస్వామి గుడి ఎదురుగా ఉన్న ఒక ప్రైవేటు హాస్టల్‌పై స్పెషల్‌ పార్టీ పోలీసులు దాడి చేసి ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతడు మావోయిస్టు అని తెలియడంతో విద్యార్థులంతా అవాక్కయ్యారు. పది రోజుల క్రితమే అతడు పేయింగ్‌ గెస్టుగా చేరాడు. అతడితో పాటు హాస్టల్‌ నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. కాకినాడ జిల్లా పోలీసులు ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. హిడ్మాకు గన్‌మెన్‌గా ఉన్న వీరిని మంగళవారం సామర్లకోట మండలం కొప్పవరంలో అరెస్టు చేసి.. ఏలూరు రేంజ్‌ పోలీసులకు అప్పగించారు. అలాగే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఓ మావోయిస్టును అరెస్టుచేశారు. కాగా.. పట్టుబడిన మావోయిస్టుల నుంచి సమాచారం సేకరించడానికి.. వారు మాట్లాడేదేంటో తెలుసుకోవడానికి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొత్తలంకాలపల్లి నుంచి పది మంది ఆదివాసీలను ఏలూరు తరలించినట్లు సమాచారం. 20 ఏళ్ల క్రితం ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చిన వీరంతా.. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో స్థిరపడ్డారు. వారిలో చాలా మంది తెలుగు మాట్లాడగలరు. ఈ క్రమంలోనే పట్టుబడిన నక్సల్స్‌ మాట్లాడే భాషను తెలుగులో చెప్పడానికి వారిని ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

ఫైరింగ్‌ ఎందుకు జరగలేదంటే!

మావోయిస్టులు, కూంబింగ్‌ దళాలు ఎదురుపడితే పరస్పర కాల్పులు తప్పవు. కానీ.. విజయవాడ కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్న భవనం వద్ద మాత్రం అలాంటిదేమీ జరుగలేదు. ఎందుకంటే.. భవనంలో నక్సల్స్‌ మకాం వేశారని ముందే తెలుసుకున్న పోలీసులు.. తొలుత కొంతమంది మావోయిస్టు సానుభూతిపరులను వారి వద్దకు పంపారు. భవనాన్ని బలగాలు చుట్ట్టుముట్టాయని.. ప్రతిఘటిస్తే కాల్చేస్తామని.. లొంగిపోవడమే మేలని సందేశం పంపారు. బాక్సుల్లో భద్రపరచిన ఆయుధాలను బయటకు తీసే అవకాశాన్ని బలగాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే మావోయిస్టులు ప్రతిఘటన లేకుండా లొంగిపోయారు. కాల్పులు లేకుండా సైలెంట్‌గా ఆపరేషన్‌ ముగిసింది.

Updated Date - Nov 19 , 2025 | 04:50 AM