Share News

Minister Sandhya Rani: షెడ్యూల్డ్‌ ఏరియాలోకి 496 గ్రామాలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:41 AM

రాష్ట్రంలో 496 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంతం పరిధిలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చాయని, 50 శాతం కంటే ఎక్కువ గిరిజనుల కలిగిన గ్రామాల వివరాలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోలు, కలెక్టర్లకు సూచించామని...

Minister Sandhya Rani: షెడ్యూల్డ్‌ ఏరియాలోకి 496 గ్రామాలు

ప్రతిపాదనలు సిద్ధం చేశాం: మంత్రి సంధ్యారాణి

రాష్ట్రంలో 496 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంతం పరిధిలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చాయని, 50 శాతం కంటే ఎక్కువ గిరిజనుల కలిగిన గ్రామాల వివరాలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోలు, కలెక్టర్లకు సూచించామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బండారు సత్యనారాయణమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని 9 గ్రామ పంచాయతీల్లోని 60 గ్రామాల్లో 25 వేలకు పైగా గిరిజన జనాభా ఉన్నట్లు గుర్తించామన్నారు. బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో 600 గిరిజన గ్రామాలు నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నాయని, దీంతో ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పారు. కోవూరు నియోజకవర్గంలోని 138 గిరిజన కాలనీలను షెడ్యూల్డ్‌ ఏరియాలోకి తీసుకోవాలని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. యానాదుల కార్పొరేషన్‌ ఏర్పాటు హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 58 గిరిజన గ్రామాలను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కోరారు. రోడ్ల పక్కన విద్యుత్‌ లైన్లకు అడ్డుగా ఉండే చెట్లను నరికేస్తున్నారా? వాటి రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని జనసేన ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ అడిగారు. చెట్ల కొమ్మలను మాత్రమే కత్తిరిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. ఇబ్రహీంపట్నంలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుంచి విడుదలయ్యే ప్లైయాష్‌ వల్ల కాలుష్యం ఏర్పడి, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారంటూ వసంత కృష్ణప్రసాద్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి సమాధానం చెప్పారు. థర్మల్‌ స్టేషన్‌ నుంచి వచ్చే ఫ్లైయాష్‌ నిర్వహణ వ్యవస్థల పటిష్టతకు ఏపీ జెన్‌కో చర్యలు చేపట్టిందని తెలిపారు.

Updated Date - Sep 23 , 2025 | 05:42 AM