45 Maoists Remanded in Courts: 45 మంది మావోయిస్టులకు రిమాండ్
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:16 AM
విజయవాడ, ఏలూరుల్లో పట్టుబడిన మావోయిస్టుల్లో 43 మందికి వేర్వేరు కోర్టులు రిమాండ్ విధించాయి. మరో నలుగురికి వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని న్యాయాధికారి ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు....
విజయవాడ/ఏలూరు క్రైం/కాకినాడ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): విజయవాడ, ఏలూరుల్లో పట్టుబడిన మావోయిస్టుల్లో 43 మందికి వేర్వేరు కోర్టులు రిమాండ్ విధించాయి. మరో నలుగురికి వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని న్యాయాధికారి ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. నిడమానూరులో పట్టుకున్న నలుగురినీ పటమట పోలీసులు నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. వారికి వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి యు. రామ్మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. వారిని నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. కొత్త ఆటోనగర్‌లో చిక్కిన 28 మందిని పెనమలూరు పోలీసులు ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వారిలో 24 మందికి డిసెంబరు 2 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి జి.లెనిన్‌బాబు ఆదేశాలు ఇచ్చారు. వారిని రెండు బస్సుల్లో రాజమండ్రి కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు.
పిల్లల్లా ఉన్నారే...!
కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన మావోయిస్టుల్లో మడకం హంగ(ఏ7), కుంజం రాంబు(ఏ9), దోడి వాకాడ్(ఏ10), మాధవి మహిని(ఏ26) పొట్టిగా ఉండటంతో వారి వయసుపై న్యాయాధికారి సందేహం వ్యక్తం చేశారు. నలుగురూ పిల్లల్లా ఉన్నారని వ్యాఖ్యానించారు. వారు కొండ ప్రాంతాల్లో ఉండటంతో ఆ విధంగా కనిపిస్తారని ఏపీపీ రాధిక వివరించారు. వయసు నిర్ధారణకు వైద్య పరీక్షలు చేయించాక గురువారం కోర్టులో హాజరుపరచాలని న్యాయాధికారి ఆదేశించారు. పెనమలూరు పోలీసులు 28మంది మావోయిస్టులను తీసుకురావడానికి ముందు కోర్టు హాలు న్యాయవాదులతో నిండిపోయింది. దీంతో కేసుతో సంబంధం లేని న్యాయవాదులు బయటకు వెళ్లిపోవాలని న్యాయాధికారి లెనిన్‌బాబు సూచించారు. దీనిపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మావోయిస్టుల రిమాండ్ వాదనలను ఇన్‌కెమెరా విధానంలో చేస్తున్నట్టు న్యాయాధికారి ఆర్డర్ ఇవ్వడంతో న్యాయవాదులంతా బయటకు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, ఏలూరులో అదుపులోకి తీసుకున్న 15మంది మావోయిస్టులను బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఏలూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. వారందరికీ వచ్చే నెల 3 వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఎన్ మేరీ ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో పట్టుబడిన ఇద్దరు మహిళా మావోయిస్టులను సామర్లకోట పోలీసులు బుధవారం సాయంత్రం ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి షేక్ షరీన్ 14 రోజులు రిమాండ్ విధించారు. వీరందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
రావులపాలెంలో హిడ్మా అనుచరుడు అరెస్టు
రావులపాలెం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో మావోయిస్టు హిడ్మా అనుచరుడు సరోజ్ మడివి అలియాస్ ఓండాను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. సఖినేటిపల్లిలో ఒక చేపల చెరువులో సరోజ్ పనికి కుదిరినట్లు సమాచారం. అతడి నుంచి తుపాకీతో పాటు పది తూటాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆ అంతస్తు అద్దె నెలకు రూ.లక్ష!
కృష్ణాజిల్లా కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న మారుతి బిల్డింగ్ మూడో అంతస్తుకు అద్దె నెలకు రూ.లక్ష. రోడ్డు పనులు చేసేందుకు వచ్చామని చెప్పి ఆ బిల్డింగ్‌లో దిగినట్లు ఆటోనగర్‌లోని పలువురు కార్మికులు చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను సెల్‌ఫోన్‌ల గోడౌన్‌కు అద్దెకు ఇచ్చారు. మిగిలిన అంతస్తులు నిర్మించిన నాటి నుంచి ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. 4 నెలలు ఉంటామని చెప్పి మావోయిస్టులు అద్దెకు దిగినట్టు సమాచారం. వీరు ఉన్న ఫ్లోర్ మొత్తం ఒకే హాలుగా ఉంటుంది. ఇక్కడే ఆయుధాలు, సామగ్రిని భద్రపర్చుకున్నారు.
లొంగిపోండి కామ్రేడ్స్: సోను విజ్ఞప్తి
గడ్చిరోలి: ఆయుధాలను ప్రభుత్వాలకు అప్పగించి లొంగిపోవాల్సిందిగా మావోయిస్టులకు ఆ పార్టీ మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు (సోను) మరోసారి విజ్ఞప్తి చేశారు. హిడ్మా, ఆయన సహచరుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన ఈ విన్నపం చేశారు. దానిని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులు వీడియో రూపంలో విడుదల చేశారు.