AP Govt Turns Waste into Power: గత ప్రభుత్వ చెత్తను ఊడ్చేశాం!
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:34 AM
గత సర్కార్ చెత్తపై కూడా పన్ను వసూలు చేసిందని, తమ ప్రభుత్వం చెత్తతో విద్యుత్ తయారీకి శ్రీకారం చుట్టిందని మున్సిపల్....
నాలుగు కేంద్రాల డెవలపర్స్‌తో డిస్కంల ఒప్పందం
ప్రతిరోజూ 7,500 టన్నుల చెత్త ప్రాసెసింగ్..
119 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఏర్పాట్లు
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): గత సర్కార్ చెత్తపై కూడా పన్ను వసూలు చేసిందని, తమ ప్రభుత్వం చెత్తతో విద్యుత్ తయారీకి శ్రీకారం చుట్టిందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న నాలుగు వేస్ట్ టు ఎనర్జీ (వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి) కేంద్రాల డెవలపర్స్‌తో ఏపీ డిస్కంలు మంగళవారం ఒప్పందం చేసుకున్నాయి. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్తను వదిలిపోయిందన్నారు. అక్టోబరు 2 నాటికి నిల్వ చెత్తను తొలగించాలని సీఎం ఆదేశించారని, లక్ష్యం కంటే ఎక్కువగానే 93 లక్షల టన్నుల చెత్తను అధికారులు తరలించారని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో రెండు కేంద్రాల నుంచి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలులో ఏర్పాటు చేసే నాలుగు ప్లాంట్లతో డిస్కంలు ఒప్పందాలు చేసుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 7,500 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్లను నెలకొల్పుతున్నామన్నారు. రెండేళ్లలోనే 6 కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. మున్సిపాలిటీల్లో పీపీపీ విధానంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జిందాల్, ఆంటోని లారా కంపెనీల ఆధ్వర్యంలో నిర్మాణాలు, నిర్వహణ జరుగుతాయన్నారు.
పదుల సంఖ్యలో మున్సిపాలిటీలు కవరయ్యేలా..
కాకినాడ (రామేశ్వరం)లో 21 మున్సిపాలిటీలు కవర్ అయ్యేలా 957 టన్నుల వ్యర్థ ప్రాసెసింగ్ సామర్థ్యంతో 15 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు, నెల్లూరు (దొంతాలి)లో 9 మున్సిపాలిటీలకు 604 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 12 మెగావాట్ల ప్రాజెక్టులను జిందాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కడప (కొలుములపల్లి)లో 18 మున్సిపాలిటీలకు 781 టన్నుల వ్యర్థ ప్రాసెసింగ్ సామర్థ్యంతో 15 మెగావాట్ల ప్రాజెక్టు, కర్నూలు (గార్వేయపురం)లో 13 మున్సిపాలిటీలకు 751 టన్నుల వ్యర్థ ప్రాసెసింగ్ సామర్థ్యంతో 15 మెగావాట్ల ప్రాజెక్టును ఆంటోని లారా కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నాలుగు ప్లాంట్లు ప్రతిరోజూ 3,093 టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేస్తాయన్నారు. టెండర్ల దశలో ఉన్న విజయవాడ, తిరుపతి ప్లాంట్లు 1,600 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయనున్నాయని తెలిపారు. ఇప్పటికే గుంటూరు, విశాఖలో నడుస్తున్న ప్లాంట్ల ద్వారా 2,800 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నారని, తద్వారా 35 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ ఎనిమిది ప్లాంట్లు కలిపి 7,493 టన్నుల చెత్తను విద్యుత్‌గా మారుస్తూ 119 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురే్‌షకుమార్, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్ చీఫ్ జీఎం డి.రాజేంద్రప్రసాద్, ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జీఎం బి.ఉమాపతి, ఈపీడీసీఎల్ చీఫ్ జీఎం ఎల్.మహేంద్రనాధ్, పీపీసీసీ జీఎం పి.ప్రభాకర్, జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అధ్యక్షుడు ఎంవీ చారి, ఆంటోని లారా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎన్.నారాయణరావు పాల్గొన్నారు.