AP Bar Policy: దరఖాస్తుల్లో ఇదేం ఫిటింగ్
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:14 AM
ఏదైనా టెండర్‌కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు రావాలనే నిబంధన సహజం. కానీ కచ్చితంగా నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన దేశంలో ఎక్కడా లేదు. అలాంటిది రాష్ట్ర బార్ పాలసీలో నిబంధన పెట్టారు.
4 దరఖాస్తులు వస్తేనే బార్‌కు లాటరీ
అంతకంటే తక్కువ వస్తే తీయరు
దరఖాస్తు రుసుం కూడా తిరిగివ్వరు
ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు
బార్ పాలసీపై వ్యాపారుల్లో నిరాసక్తత
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఏదైనా టెండర్‌కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు రావాలనే నిబంధన సహజం. కానీ కచ్చితంగా నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన దేశంలో ఎక్కడా లేదు. అలాంటిది రాష్ట్ర బార్ పాలసీలో నిబంధన పెట్టారు. 4దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామని పేర్కొన్నారు. దానికి మరొక మెలిక కూడా తగిలించారు. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీయకపోగా, ఆ దరఖాస్తుదారులకు డబ్బులు కూడా వెనక్కి ఇవ్వరు. ఉదాహరణకు ఆసక్తి ఉన్నవారు రూ.5లక్షలు వెచ్చించి ఒక బార్‌కు దరఖాస్తు సమర్పిస్తారు. కానీ 4 దరఖాస్తులు రాలేదనే కారణంతో ఆ బార్‌కు లాటరీ తీయరు. అలాంటప్పుడు దరఖాస్తుదారుకు రూ.5లక్షలు తిరిగి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ లాటరీ తీయకపోయినా డబ్బులు తిరిగి చెల్లించకూడదని నిర్ణయించారు. లాటరీ నిర్వహించని బార్‌కు కొన్ని రోజుల తర్వాత తిరిగి నోటిఫికేషన్ జారీచేసి, రెండోసారి దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్పుడు మొదట్లో దరఖాస్తు సమర్పించిన వ్యక్తిని తిరిగి దరఖాస్తుదారుగా పరిగణిస్తారు. అలా ఆ బార్‌కు లైసెన్స్ కేటాయించేవరకూ ఆ వ్యక్తి దరఖాస్తుదారుగా ఉంటారు తప్ప అతనికి రూ.5లక్షలు తిరిగివ్వరు. అయితే ఎన్ని నోటిఫికేషన్లు జారీచేసినా ఆ బార్‌కు లాటరీ నిర్వహించే పరిస్థితి రాకపోతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఒకసారి దరఖాస్తులు రాకపోతే ఆ బార్లకు డిమాండ్ తగ్గిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా బార్లు ఎవరూ తీసుకోకపోవడంతో మిగిలిపోయాయి. నూతన బార్ పాలసీపై వ్యాపారుల్లో అనాసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. 4దరఖాస్తులు, అదనపు ఏఆర్‌ఈటీ లాంటివి ఆర్థిక భారం అవుతాయనే కోణంలో దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఎవరైనా ముందుకొచ్చి రూ.5లక్షలు చెల్లించి దరఖాస్తు పెట్టుకుంటే, లాటరీ తీయకపోయినా ఆ నగదు వెనక్కి ఇవ్వరనే నిబంధన వ్యాపారులను నిరాసక్తికి గురిచేస్తోంది.
కాగా ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల కోసం నానా పాట్లు పడుతోంది. వ్యాపారులతో పదే పదే సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లాల అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో దరఖాస్తులు సమర్పించేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. గతంలో కల్లుగీత కులాలకు 340 మద్యం షాపులు కేటాయించిన సమయంలో గోప్యత పాటించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఇప్పుడు మాత్రం దరఖాస్తుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఏ బార్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలను అందరికీ అందుబాటులో ఉంచకుండా రహస్యం పాటిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఈ వివరాలకోసం ఎక్సైజ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో షాపుల పాలసీ సమయంలో వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచారని వ్యాపారులు చెబుతున్నారు.