Share News

AP Government: పంచాయతీల ప్రక్షాళన

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:03 AM

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ ప్రక్షాళన వేగం పుంజుకుంది. దీంతో గ్రామీణ ముఖచిత్రం సమూలంగా మారనుండడంతోపాటు సేవల్లో వేగం...

AP Government:  పంచాయతీల ప్రక్షాళన

  • మారనున్న గ్రామీణ ముఖచిత్రం

  • నాలుగు విభాగాలుగా గ్రామ పాలన

  • 359 రూర్బన్‌ పంచాయతీల ఏర్పాటు

  • రియల్‌ టైంలో గ్రామ పంచాయతీలలో సేవలు

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ ప్రక్షాళన వేగం పుంజుకుంది. దీంతో గ్రామీణ ముఖచిత్రం సమూలంగా మారనుండడంతోపాటు సేవల్లో వేగం, పారదర్శకత పెరగనుంది. పంచాయతీల ప్రక్షాళనలో భాగంగా ఆ శాఖ చేసిన మొదటి ప్రతిపాదనకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రక్షాళనలో మరో అడుగు పడింది. ఆ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో క్లస్టర్‌ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పంచాయతీలను 7,244 క్లస్టర్లుగా గుర్తించారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయంతో క్లస్టర్‌ వ్యవస్థ రద్దయి 13,351 గ్రామ పంచాయతీలు ఇకనుంచి స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా దేనికదే పాలన సాగించనున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పునర్విభజన కోసం నియమించిన కమిటీ 13,351 గ్రామ పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజించింది. రూర్బన్‌ పంచాయతీ, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. అధిక జనాభా, ఆదాయం కలిగిన 359 రూర్బన్‌ గ్రామ పంచాయతీలను గుర్తించి, వాటిలో గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పించి ప్రత్యేక అధికారులుగా నియమిస్తారు. ఇక నుంచి పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)గా పిలవనున్నారు. రూర్బన్‌ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో కేడర్‌ అధికారులను నియమిస్తారు. ప్రస్తుతం 6 గ్రేడ్‌లుగా ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలు పోను మిగిలిన వాటిని గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 పంచాయతీలుగా విభజిస్తారు. 359 పంచాయతీల్లో ఉన్న 1,097 జూనియర్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ బిల్‌ కలెక్టర్లలో సీనియారిటీని బట్టి పదోన్నతులు కల్పించి వారిని రూర్బన్‌ పంచాయతీల్లో సీనియర్‌అసిస్టెంట్లుగానియమిస్తారు.


మున్సిపాలిటీల తరహాలో..

మున్సిపాలిటీ తరహాలో గ్రామ పంచాయతీల్లో పలు విభాగాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధిలైట్లు, ఇంజనీరింగ్‌, రెవెన్యూ విభాగాలుగా విభజించనున్నారు. వీటి ద్వారా సేవలందించేందుకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమిస్తారు. వారికి గ్రామ పంచాయతీల నిధుల నుంచి జీతాలు చెల్లిస్తారు. గ్రామ పంచాయతీల్లో అదనంగా ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లను ఇక నుంచి గ్రామ పంచాయతీల్లో ప్లానింగ్‌ అసిస్టెంట్లుగా పేర్కొంటారు. వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో భవనాలు, లేఅవుట్‌ రూల్స్‌ అమలు చేస్తారు.

ప్రత్యేక ఐటీ విభాగం

పంచాయతీరాజ్‌లో ప్రత్యేకమైన ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అదనంగా ఉన్న డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇతర అర్హత ఉన్న సిబ్బందిని వినియోగించి గ్రామ పంచాయతీల్లో డిజిటల్‌ విభాగాన్ని అభివృద్ధి చేస్తారు. గ్రామ పంచాయతీల్లో రికార్డులు డిజిటలైజ్‌చేసి రియల్‌టైంలో గ్రామ పంచాయతీల ద్వారా సర్వీసులు అందించేందుకు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.

Updated Date - Nov 05 , 2025 | 05:03 AM