Visakhapatnam: ఒకేరోజు 34 విభాగాల ప్రైవేటీకరణ
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:09 AM
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటనలు చేస్తూనే, మరో వైపు దశలవారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు...
విశాఖ ఉక్కు యాజమాన్యం తాజా నోటిఫికేషన్ జారీ
కీలక విభాగాలు అప్పగించే యోచన.. కార్మికుల ఆగ్రహం
ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?: సంఘాల మండిపాటు
ఉక్కుటౌన్‌షిప్(విశాఖపట్నం), ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటనలు చేస్తూనే, మరో వైపు దశలవారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కర్మాగారంలో కీలకమైన 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ఉక్కు యాజమాన్యం ఆదివారం నోటిఫికేషన్ జారీచేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం విషయంలో యాజమాన్యం గోప్యత పాటిస్తూ రోజుకో నిర్ణయం తీసుకుంటోందని అంటున్నారు. మరోవైపు.. ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రకటన జారీ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు కర్మాగారంలో విభిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక పక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నా.. మరోవైపు ప్లాంట్‌లో ఒక్కో విభాగం ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం ప్రణాళికాయుతంగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు కొన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు వరుసగా నోటిఫికేషన్‌లు జారీ చేయగా, తాజాగా ఒకేసారి 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఓ పక్క ప్లాంట్‌కు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న యాజమాన్యం.. ఇలా అన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్‌లు జారీచేస్తూ ద్వంద్వ విధానాలు పాటిస్తోందనే వాదన వినిపిస్తోంది. అసలు ప్లాంట్‌లో ఏం జరుగుతోందో తెలియడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
వీటికే నోటిఫికేషన్!
క్యాప్టివ్ పవర్‌ప్లాంట్, వేస్ట్ హీట్ రికవరీ థర్మల్ పవర్‌ప్లాంట్, క్యాప్టివ్ పవర్‌ప్లాంట్-2, వైర్‌రాడ్ మిల్, బ్లాస్ట్‌ఫర్నేస్ -1, 2, 3 విభాగాలు, స్టీల్ మెల్ట్‌షాప్, రోల్‌షాప్ అండ్ రిపేర్‌షాప్, ఈఎస్అండ్‌ఎఫ్ (ఫౌండ్రీ), మిల్స్, స్ట్రక్చరల్ బార్ మిల్(ఎ్‌సబీఎం), ఈ అండ్ ఈఎన్‌ఎండీ, మాదారం డోలమైట్ మైన్, స్పెషల్ బార్‌మిల్స్, రోల్‌షాప్ ఏరియా, గ్యాస్ క్లీనింగ్ ప్లాంట్, స్పెషల్ బార్ మిల్స్ షిప్పింగ్ ఏరియా, ఎంఎంఎ్‌సఎం, కంటిన్యూ కాస్టింగ్ డివిజన్(సీసీడీ).