30 Years Dream Fulfilled: బడి వచ్చిందోచ్
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:30 AM
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం రామాంజనేయపురం బడి కల ఎట్టకేలకు తీరింది. రెండు రోజుల్లో పాఠశాలను గ్రామంలో తెరుస్తామని కలెక్టర్ అరుణ్‌బాబు ప్రకటించారు. నిజానికి, తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు కోసం 3 దశాబ్దాలుగా...
ఎట్టకేలకు నెరవేరిన 30 ఏళ్ల రామాంజనేయపురం కల
2 రోజుల్లో గ్రామంలో బడి ప్రారంభం
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక
గ్రామాన్ని సందర్శించిన పల్నాడు కలెక్టర్
లోకేశ్‌కు గ్రామస్థుల కృతజ్ఞతలు
బెల్లంకొండ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం రామాంజనేయపురం బడి కల ఎట్టకేలకు తీరింది. రెండు రోజుల్లో పాఠశాలను గ్రామంలో తెరుస్తామని కలెక్టర్ అరుణ్‌బాబు ప్రకటించారు. నిజానికి, తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు కోసం 3 దశాబ్దాలుగా ఊరి జనం పోరాడుతూనే ఉన్నారు. పిల్లలు చదువుల కోసం అడవిబాటలో 6 కిమీ నడిచి పొరుగూరుకు వెళుతున్న వైనం.. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్న తీరును ‘చదువు వారికి సాహసమే’ అనే శీర్షికన ఈ నెల 16న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఈ కథనం అధికారులను, స్థానిక నాయకులను కదిలించింది. రామాంజనేయపురంలో పాఠశాల ఏర్పాటు చేయిస్తానంటూ ఈ కథనంపై అప్పట్లోనే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పందించారు. అన్నట్టే రామాంజనేయపురం సమస్యను విద్యా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో తాజాగా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నిర్మించి ఖాళీగా వదిలేసిన పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలను ప్రారంభించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయం తెలియగానే.. ఊరి జనం సంబరాలు చేసుకున్నారు. మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే ప్రవీణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.