AP Cotton Market: రాష్ట్రంలో 30 పత్తి కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:50 AM
రాష్ట్రవ్యాప్తంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చర్యలు చేపట్టింది.
ఏర్పాటుకు చర్యలు చేపట్టిన సీసీఐ
సీసీఐ, జిన్నర్ల మధ్య కుదిరిన సయోధ్య
గుంటూరు సిటీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిన్నర్ల నుంచి తాజాగా మరోమారు టెండర్లు ఆహ్వానించింది. అక్టోబరు 10న టెండర్లు దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించింది. గత రెండు నెలలుగా సీసీఐ, జిన్నర్లకు (పత్తి మిల్లుల యజమానులు) మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు సూచనతో మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత సీసీఐ, జిన్నర్ల మధ్య ఏర్పడిన వివాద పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాతో ఏపీ కాటన్ టీఎంసీ కన్సార్టియం అధ్యక్షుడు ఇక్కుర్తి శివప్రసాద్, కార్యదర్శి హెచ్.వెంకట్రామిరెడ్డి, సంయుక్త కార్యదర్శి మన్నవ హరినాథ్ బాబు మరోసారి వర్చువల్‌గా కూడా చర్చలు జరిపారు. ఆయన హామీతో సంతృప్తి చెందిన జిన్నర్లు టెండర్ల ప్రక్రియలో పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. సోమవారం కొందరు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం.
సీఎం యాప్ ద్వారానే కొనుగోళ్లు చేయాలి
సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకు సీఎం యాప్ వినియోగిస్తున్నారు. ఈ యాప్ అందుబాటులోకొచ్చిన తర్వాత కొనుగోలు వ్యవహారంలో దళారులు, వ్యాపారులకు అడ్డుకట్ట పడింది. అయితే ఈ ఏడాది నుంచి అన్ని రాష్ర్టాల్లో కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తామని సీసీఐ టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. రైతులు మాత్రం సీఎం యాప్ ద్వారా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 మధ్య మాత్రమే ఉండాలని సీసీఐ విధించిన నిబంధన కూడా రైతులకు నష్టం కలిగించేదేనని అంటున్నారు.