AP Govt: ఎలీప్‌కు 30 ఎకరాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:35 AM
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీలను కూడా ప్రకటిస్తూ...
ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయింపు
జేఎస్‌డబ్ల్యూ పార్క్‌కు ఆమోదం
పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీలను కూడా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముసడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, ఎం.బి.వారా, కిల్తంపాలెం గ్రామాల్లో 1,166.43 ఎకరాల విస్తీర్ణంలో రూ.531.36 కోట్ల పెట్టుబడితో మెగా ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసి, 45వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జేఎ్‌సడబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ యాజమాన్యం ప్రతిపాదనలు సమర్పించింది. ఏపీ ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల పాలసీ 4.0 కింద జేఎ్‌సడబ్ల్యు మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అల్యూమినియం రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి ఎంఎస్ఎంఈ పార్క్, ఇతర పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన 985.70 ఎకరాల భూమిలోకి కార్యకలాపాలను మార్చడానికి జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది. ఆ కంపెనీ పేరును జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్‌గా మార్చడానికి అంగీకరించింది. ప్రైవేట్ పార్క్స్ పాలసీ మార్గదర్శకాల ప్రకారం ఎకరానికి రూ.3లక్షల మూలధన రాయితీ చెల్లిస్తారు. వీఎంఆర్‌డీఏ ద్వారా లే-అవుట్ ఆప్రూవల్స్, ల్యాండ్ కన్వర్షన్ చార్జీల పూర్తి మినహాయింపు తదితర ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని గుర్రంపాలెంలో రూ.319.75 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు కోసం అవంతి వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. ఎకరానికి రూ.80 లక్షల రాయితీ ధరతో దశల వారీగా మొత్తం 20 ఎకరాలు కేటాయించడానికి ఆమోదం తెలిపింది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో మహిళా శక్తి భవన్ స్థాపన, మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్) అభివృద్ధి కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) సంస్థకు ఎకరం రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయించింది. రూ.36.35 కోట్ల పెట్టుబడితో 3వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎలీప్ ప్రతిపాదనలు సమర్పించింది.
డ్రోన్లు, సెన్సార్లు, ఐవోటీ గేట్‌వేలు, నోడ్‌లు మొదలైన వాటి తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం యాక్సెల్ ఈఎస్‌జీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో ఎకరం రూ.లక్ష చొప్పున 80 ఎకరాలు కేటాయించింది. దాదాపు రూ.75 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉపాధి కల్పిస్తామని, ఇందుకు గాను సుమారు 200 ఎకరాలు కేటాయించాలని కోరుతూ యాక్సెల్ సంస్థ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం మొదటి దశలో 80 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగర్లపాడు, ఇనుపరాజుపల్లె గ్రామాల్లో రూ.2,260 కోట్ల పెట్టుబడితో క్యాపిటివ్ సోలార్ పవర్ ప్లాంట్‌తో సహా ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును చేపట్టి 350 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చిన శ్రీ సిమెంట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించిం ది. ప్రాజెక్టు స్థిర మూలధన పెట్టుబడిలో 39 శాతం సబ్సిడీని పదేళ్లలో అందించనుంది. ఏడేళ్ల పాటు యూనిట్‌కు రూపాయి చొప్పున మొత్తం రూ.86.55 కోట్ల వరకు విద్యుత్తు సుంకం మినహాయింపు లభిస్తుంది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.33.50 కోట్ల పెట్టుబడితో పుట్టగొడుగుల యూనిట్‌ను నెలకొల్పనున్న ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవే ట్ లిమిటెడ్ సంస్థకు, కర్నూలు జిల్లాలోనే రూ.758 కోట్ల పెట్టుబడితో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్న ఆర్‌సీపీఎల్‌కు, చిత్తూ రు జిల్లాలో రూ.201.98 కోట్ల పెట్టుబడితో రి ఫైన్డ్ ఆయిల్స్, సోయా మిల్క్ తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్న ఎస్‌వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు, ఏలూరు జిల్లాలో రూ.208.77 కోట్ల పెట్టుబడితో క్రూడ్ పామ్ కర్నెల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్‌ను నెలకొల్పనున్న గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థలకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది.