Maoists Arrested: పక్కా సమాచారంతో పట్టుకున్నాం
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:46 AM
నిఘా విభాగం నుంచి వచ్చిన పక్కా సమాచారంతోనే కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తఆటోనగర్‌లో ఆశ్రయం పొందుతున్న 28 మంది మావోయిస్టులను చాకచక్యంగా....
కొద్దిరోజులుగా నక్సల్స్ కదలికలపై నిఘా
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడి వెల్లడి
విజయవాడ సిటీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిఘా విభాగం నుంచి వచ్చిన పక్కా సమాచారంతోనే కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తఆటోనగర్‌లో ఆశ్రయం పొందుతున్న 28 మంది మావోయిస్టులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. వారిని అరెస్టు చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలను గత కొన్ని రోజులుగా నిశితంగా పరిశీలిస్తున్నామని, మావోలపై పోలీసులు పెద్దఎత్తున దృష్టి సారించడంతో కొందరు కొత్తఆటోనగర్‌లో ఆశ్రయం పొందేందుకు వచ్చారనే విశ్వసనీయ సమాచారం తమకు అందిందన్నారు. దీంతో లా అండ్ ఆర్డర్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ విభాగాలతో జాయింట్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. అరెస్టుచేసిన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సంరక్షకులు 9 మంది, హిడ్మా బెటాలియన్ సభ్యులు 19 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఛత్తీ్‌సగఢ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారని, ఈ పరిసరాల్లో, అమరావతిలో హింసాత్మక, విధ్వంసక ఘటనలకు పాల్పడేందుకు ప్రణాళిక రచిస్తున్నారనే సమాచారం ఉందన్నారు. విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చిన భవనం యజమానిని ఫోన్‌లో విచారించినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మా ఇక్కడి నుంచే ఆపరేషన్స్ జరిపారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వరుస ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగానే విజయవాడ, పరిసర ప్రాంతాల్లో విధ్వంసానికి ఈ ప్రాంతంలో తిష్ఠ వేశారనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. నక్సల్స్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న గన్నవరం సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.