Share News

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం..27 మందిపై కేసు

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:11 AM

కర్నూలు జిల్లా ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 27 మందిపై కేసు నమోదు చేశారు.

 Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం..27 మందిపై కేసు

  • ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ,వైసీపీ సోషల్‌ మీడియాపై నమోదు

  • బెల్ట్‌ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదమంటూ తప్పుడు పోస్టులు

  • ప్రజలను తప్పుదారి పట్టించి, అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతోనేనని ఫిర్యాదు

కర్నూలు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 27 మందిపై కేసు నమోదు చేశారు. బెల్ట్‌ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదం జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టారనే ఫిర్యాదుపై శుక్రవారం కర్నూలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ జాబితాలో వైసీపీ సోషల్‌ మీడియాతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. కర్నూలు రూరల్‌ మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన పేరపోగు వేణుములయ్య ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడంతో పాటు అశాంతిని సృష్టించాలనే దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టి వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 352, 353(1), 196(1), 61(2) బీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తేజోమూర్తి వెల్లడించారు.


ఇదీ జరిగింది..

గత నెల 24న తెల్లవారుజాము మూడు గంటల సమయంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44పై ప్రైవేటు బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డుపై పడి ఉన్న పల్సర్‌ బైక్‌ను వి.కావేరి ట్రావెల్స్‌ బస్సు తోసుకొని వెళ్లడం, ఆ వెంటనే మంటలు చెలరేగి బస్సు కాలిపోయిన ఘటనలో 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. అంతకుముందు స్నేహితులు శివశంకర్‌, ఎర్రిస్వామిలు పల్సర్‌ బైక్‌పై డోన్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి 2:45 గంటల సమయంలో డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైకర్‌ శివశంకర్‌ అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డివైడర్‌ను ఢీకొని రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌పై ప్రైవేటు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా వెళ్లడం వల్ల మంటలు చెలరేగాయి. ప్రమాదం జరగడానికి ముందు బైకర్‌ శివశంకర్‌, ఎర్రిస్వామిలు 23వ తేదీ గురువారం రాత్రి పెద్దటేకూరు గ్రామంలో ప్రభుత్వ లైసెన్స్‌డ్‌ శ్రీరేణుక ఎల్లమ్మ వైన్స్‌ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగారు. వారు మద్యం కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజీలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు విడుదల చేశారు. ఇది జరిగిన సంఘటన. అయితే బెల్ట్‌ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదం జరిగిందని, జాతీయ రహదారి వెంబడి విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు అక్రమంగా ఏర్పాటు చేశారంటూ ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని 27 మందిపై పేరపోగు వేణుములయ్య ఫిర్యాదు చేశారు. రాజకీయ, సామాజికవర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే దురుద్దేశంతోనే ఈ పోస్టులు పెట్టారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు.


వీరిపైనే కేసు..

సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ, ఆరే శ్యామల (వైసీపీ అధికార ప్రతినిధి), వైసీపీ అఫీషియల్‌ పేజీ, నవీన్‌ వైఎ్‌సజే వైజాగ్‌, వెంకీ వెంకీ, యూట్యూబ్‌ చానల్‌ యువ టీవీ, కుమార్‌రెడ్డి ఆవుల, డాక్టర్‌ చిరంజీవి, జగనన్న కనెక్ట్స్‌, రాహుల్‌, దర్శన్‌, రామ్‌, శ్రీధర్‌రెడ్డి అవుతు, బిలాల్‌ వైసీపీ, తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, కరుమూరి వెంకటరెడ్డి, నారాయణ పోతుల, వారియర్స్‌ వైఎస్‌ జగన్‌, మీడియా పేజీ తెలుగు ఎన్‌ఆర్‌ఐ బులిటెన్‌ బోర్డు, ధరణి, ఏపీ పాలిటిక్స్‌, మకిధ, కాటసాని అభిమాని రాఘవేంద్రరెడ్డి, సత్తిబాబు వైసీపీ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 03:13 AM