Tirumala: వైకుంఠద్వార దర్శనం కోసం 24.05 లక్షల రిజిస్ర్టేషన్లు
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:31 AM
తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ ద్వారా 24.05 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
1.76 లక్షల మందికే అవకాశం.. నేటి మధ్యాహ్నం ఈ-డిప్
తిరుమల, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ ద్వారా 24.05 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్నాయి. గత ఏడాది జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో కౌంటర్ల ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో ఈ-డిప్ విధానంలో తొలి మూడు రోజులు అంటే, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తేదీకి సంబంధించిన టోకెన్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబరు 27 ఉదయం 10 గంటలకు ఈ-డిప్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు నమోదుకు గడువు ముగిసే సమయానికి 24,05,237 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా 9,28,608 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొబైల్ యాప్ ద్వారా 13,29,112 మంది, ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1,45,517 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఈ మూడు రోజులకు 1.76 లక్షల మందికి మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మంగళవారం డిప్‌లో ఎంపికైన భక్తులకు మధ్యాహ్నం 2గంటల తర్వాత సెల్‌ఫోన్ నంబరు, ఈ-మెయిల్‌కు సమాచారం పంపనున్నారు.
5న శ్రీవాణి, రూ.300 టికెట్ల విడుదల
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనాలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. రోజుకు వెయ్యి చొప్పున ఏడు రోజులకు 7 వేల టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లనూ విడుదల చేస్తారు. రోజుకు 15 వేల చొప్పున 1.05 లక్షల టికెట్లను జారీ చేయనున్నారు. ఇవి పూర్తిగా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తారు.