Share News

Sri Krishnadevaraya University: విశ్వవిద్యా వనం

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:42 AM

విశ్వవిద్యాలయం ఏదైనా ఉన్నత బోధన, పరిశోధన కేంద్రాలు, లైబ్రరీ, హాస్టళ్లతో సందడి సందడిగా ఉంటుంది. క్యాంపస్‌లో ఏళ్ల నాటి చెట్లూ కనిపిస్తాయి.

 Sri Krishnadevaraya University: విశ్వవిద్యా వనం

  • శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో 22 వేల మొక్కలు, చెట్లు

  • 12 ఎకరాల్లో 900 జాతుల మొక్కలు

  • బొటానిక్‌ గార్డెన్‌ పేరిట విస్తృతంగా పెంపకం

  • ఇందులో ఔషధ, పూలు, పండ్ల మొక్కలు

  • మియావాకి విధానంలో వృక్షజాతికి జీవం

  • ఇతర ప్రాంతాలకూ మొక్కల పంపిణీ

  • సత్ఫలితాలిస్తున్న ప్రొఫెసర్ల ప్రయోగం

విశ్వవిద్యాలయం ఏదైనా ఉన్నత బోధన, పరిశోధన కేంద్రాలు, లైబ్రరీ, హాస్టళ్లతో సందడి సందడిగా ఉంటుంది. క్యాంపస్‌లో ఏళ్ల నాటి చెట్లూ కనిపిస్తాయి. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మరింత ప్రత్యేకం. ఇక్కడి అధ్యాపకులు వర్సిటీలోనే ఓ అడవిని సృష్టించారు. అంతరించిపోతున్న అరుదైన వృక్షజాతికి జీవం పోస్తున్నారు. ప్రస్తుతం వర్సిటీ ప్రాంగణంలో మొక్కలు, చెట్లు కలిపి దాదాపు 22 వేలు ఉన్నాయి. ప్రొఫెసర్ల కృషితో వర్సిటీలోని 12 ఎకరాల్లో 900 రకాల వృక్ష జాతులు ప్రాణం పోసుకుంటున్నాయి. ప్రభుత్వ సహకారం, సంస్థల సౌజన్యంతో మియావాకి విధానంలో అడవిని అభివృద్ధి చేస్తున్నారు. నక్షత్రవనం, శీలావనం, రాక్‌ గార్డెన్‌.. ఇలా వివిధ పేర్లతో ఎకరం, అర ఎకరం ప్రాంతంలో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. అంతేగాక ఇతర ప్రాంతాలకూ మొక్కలను పంపిణీ చేస్తున్నారు.


26 సెక్టార్లుగా విభజన..

బొటానిక్‌ గార్డెన్‌ను 26 సెక్టార్లుగా విభజించి మొక్కలు పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మర్రి జాతుల ఫైక్టోరియం ఏర్పాటు చేశారు. ఇందులో 35 రకాల మర్రిజాతుల మొక్కలను నాటారు. ఇక్కడ రాష్ట్రంలోని 25 వన్య జాతులు ఉండటం విశేషం. హైదరాబాద్‌ ప్రగతి సుధామి సంస్థ ద్వారా శాస్త్రీయంగా నక్షత్రవనాన్ని నెలకొల్పారు. 9 గ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలకు గుర్తుగా ప్రాచీన కాలంలో గుర్తింపు పొందిన మొక్కలు నాటారు. ఖగోళ ఆకృతితో 360 డిగ్రీలలో వనాన్ని ఏర్పాటు చేశారు. అన్ని ఔషధ విలువలు కలిగిన మొక్కలు నాటారు. ఉదాహరణకు సూర్యుడికి ప్రతీకగా ఆర్కా(తెల్లజిల్లెడు) వంటి మొక్కలను నాటారు. ఇతర ప్రాజెక్టుల ద్వారా నర్సరీలను ఏర్పాటు చేసి విశిష్ఠమైన జాతులను పెంచుతున్నారు. గార్డెన్‌లో చెట్లతో నిండి ఉండే ఐదు ఆర్బోరిటాలను ఏర్పాటు చేశారు. వనంగా పెరిగే అలంకరణ మొక్కలు, వివిధ రకాల పూలమొక్కల ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. సగానికి పైగా పూలు, పండ్ల మొక్కలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎర్రచందం, తెల్లచందం, గాలి బుడగ, వెర్రిచల్ల, కొండ సాంబ్రాణి, పేశీత, రాతి జావ్వి, బిల్లుడు వంటి అనేక రకాల వృక్ష జాతులను పెంచుతున్నారు. 2016లో సహజ సిద్ధంగా పెరుగుతున్న ఆస్పరగేసే కుటుంబానికి చెందిన డిప్‌కాడి జాతిని శ్రీకృష్ణదేవరాయ పేరుతో ఆవిష్కరించారు.


మియావాకి వనం

విద్యాలయంలోని బొటానిక్‌ గార్డెన్‌లో అతి ముఖ్యమైనది మియావాకి వనం. ఇది జపాన్‌ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా అభివృద్ధి చేసిన అటవీ పద్ధతి. ఈ పద్ధతిలో దట్టమైన అడవులను సృష్టించారు. ఈ పద్ధతిలో మొక్కలు, పొదలను దగ్గర దగ్గరగా నాటుతారు. ఇదే తరహాలో వర్సిటీ గార్డెన్‌లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చదనం-సుందరీకరణ సంస్థ ఆధ్వర్యంలో 2018లో మియావాకి వనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ స్వల్ప మార్పులు చేశారు. చెట్లకు ఒక మీటరు దూరం ఉండేలా 2019 నవంబరులో 152 రకాల వృక్ష జాతులకు సంబంధించిన 1500 మొక్కలను నాటారు. ఫ్రొఫెసర్‌ రవిప్రసాద్‌రావు నేతృత్వంలో మొక్కల పర్యవేక్షణ చేపట్టారు. మొక్కల్లో పోటీతత్వం, నీడ వంటి ఇతరత్రా కారణాలతో 30 జాతులు అంతరించిపోయినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో మరో 25 జాతుల మొక్కలను తిరిగి నాటారు. మొదటి రెండేళ్లు వనంలోని మొక్కల పెంపకానికి అవస్థలు పడినట్లు అధికారులు చెబుతున్నారు. స్థానికంగా లభిస్తున్న నీటితోనే డ్రిప్‌ పద్ధతిలో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 145 రకాల జాతుల మొక్కలు, చెట్లతో దట్టమైన వనంగా రూపొందింది.


వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా..

అనంతపురం జిల్లా పరిస్థితులు విభిన్నమైనవి. ఇక్కడ నీటి కష్టాలు నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలో మొక్కల పెంపకం చేపట్టారు. వర్షపునీరు వృథా పోకుండా కుంటలను ఏర్పాటు చేశారు. వర్సిటీలో కురిసిన వర్షపు నీరు కుంటల్లోకి వెళ్లేలా చేశారు. గార్డెన్‌ కోసం ప్రత్యేకంగా సంపును ఏర్పాటు చేశారు. వేసవికాలంలో మొక్కలు, చెట్లకు డ్రిప్‌ పద్ధతి ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. దీంతో మొక్కలు, చెట్లతో వర్సిటీ అడవిని తలపిస్తోంది. మంచి ఆహ్లాదాన్ని పంచుతోంది. పక్షులను ఆకర్షిస్తోంది.


జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా..

విశ్వవిద్యాలయంలోని బొటానిక్‌ గార్డెన్‌ను జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేశాం. మొక్కల జాతులను విద్యార్థులు, వృక్ష ప్రేమికులు అధ్యాయనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాం. గార్డెన్‌లో 300 టన్నులకు పైగా కర్బన్‌శోషణం జరిగింది. భూతాపాన్ని తగ్గించే విధంగా ఈ పచ్చదనాన్ని వృద్ధి చేస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో రకాల పక్షులు, జంతుజాలానికి వసతి, ఆహారాన్ని అందిస్తున్నాం.

- ఆచార్య రవి ప్రసాద్‌రావు,

బొటానిక్‌ గార్డెన్‌ డైరెక్టర్‌, ఎస్కే యూనివర్సిటీ


హెర్బల్‌ గార్డెన్‌కు ప్రతిపాదనలు

ఎస్కే యూనివర్సిటీలో 25 శాతం భూమి పచ్చదనంతో నిండి ఉంది. బొటానిక్‌ గార్డెన్‌ ప్రారంభం నుంచి ప్రతి వీసీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేను వీసీగా పనిచేసిన ఈ ఏడాది కాలంలో వర్సిటీలో 1200 మొక్కలు నాటించి సంరక్షిస్తున్నాం. వర్సిటీ నుంచి గార్డెన్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో హెర్బల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు కృషి చేస్తాం.

- ఆచార్య అనిత, వీసీ, ఎస్కే యూనివర్సిటీ


విశ్వవిద్యాలయం 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో దశాబం నుంచి మొక్కల పెంపకం విరివిగా సాగుతోంది. 2012 వరకు వర్సిటీ ప్రాంగణంలో ఏడు వేల మొక్కలు, చెట్లు ఉండేవి. గడిచిన పదేళ్లలో ఈ సంఖ్య 22 వేలకు చేరింది. ముఖ్యంగా బొటానిక్‌ గార్డెన్‌ పేరిట మొక్కల పెంపకం సాగుతోంది. 2013లో ఆంధ్రప్రదేశ్‌ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సౌజన్యంతో మోడల్‌ నర్సరీలో భాగంగా మూడెకరాల్లో బొటానిక్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో 1.5 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. వాటిని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఆ తరువాత 2018లో మరో మూడు ఎకరాలకు గార్డెన్‌ను విస్తరించి, వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టారు. 2021 నాటికి మరో ఆరు ఎకరాలను గార్డెన్‌కు కేటాయించడంతో పాటు మొక్కల పెంపకాన్ని మరింతగా చేపట్టారు.

అనంతపురం రూరల్, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Aug 24 , 2025 | 03:49 AM