Chief Secretary Vijayanand: 21 లక్షల బీసీల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:51 AM
రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు చెందిన 21లక్షల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్‌ను అమర్చనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ గృహాలు 7.48లక్షలు, 1.36లక్షల వ్యవసాయ పంపుసెట్లకూ..
అనంతలో అధికారులతో సీఎస్ విజయానంద్ సమీక్ష
అనంతపురం కలెక్టరేట్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు చెందిన 21లక్షల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్‌ను అమర్చనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్‌లో.. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం సహా అన్ని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ప్రాజెక్టులు, వివిధ పథకాలపై ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ శివశంకర్ లోతేటి, కలెక్టర్ ఆనంద్, ఇతర జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ‘పీఎం ఈ డ్రైవ్’ పథకం కింద వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను వేగంగా చేపట్టాలి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 7.48 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు వచ్చే ఏడాది మార్చిలోగా ఫీజిబిలిటీ ఉన్న గృహాలపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎం కుసుమ్ పథకం కింద 610 మెగావాట్ల సామర్థ్యంతో 1.36 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ పనులను పూర్తి చేయాలి. పీఎం సూర్యఘర్ కింద అనంతపురం జిల్లాలో 35.7 మెగావాట్ల సామర్థ్యంతో 17,870 గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాలి. ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలి’ అని అధికారులను ఆదేశించారు.