LPG Distributors State President: 2 కోట్ల దీపం సిలిండర్లు డోర్ డెలివరీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:02 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేసినట్లు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్..
అధికారులు అనవసర ఒత్తిళ్లు తేవద్దన్న ఎల్పీజీ పంపిణీదారులు
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకం కింద ఇప్పటి వరకు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేసినట్లు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1200 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లంతా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ తమ అసోసియేషన్ ముఖ్యనాయకులతో ప్రత్యేకంగా చర్చించారని, ఈ సందర్భంగా తమ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని శ్రీనాథ్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించడం, ఆ నివేదికల ఆధారంగా అన్ని జిల్లాల్లో అధికారులు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తెస్తుండటంతో మా వర్క్‌ఫోర్స్‌పై ప్రతికూల ప్రభావం పడుతోంది. జిల్లాల్లో అధికారుల ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ విధానం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. అప్పుడు వినియోగదారులే స్వయంగా గోడౌన్‌ల వద్దకు లేదా డెలివరీ ఆటోల వద్దకు వచ్చి సిలిండర్లను తీసుకువెళ్లాల్సి రావచ్చు. ప్రభుత్వం దయచేసి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి’ అని కోరారు. తమ సమస్యల పట్ల కమిషనర్ సానుకూలంగా స్పందించారని శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.