Share News

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 183 బార్‌లు

ABN , Publish Date - Aug 18 , 2025 | 01:13 AM

ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయబోయే బార్‌ల లెక్కను ఎక్సైజ్‌ అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఉన్న బార్‌ల లైసెన్స్‌ గడువు ఈనెలాఖరుతో ముగియడంతో కొత్త విధానం ప్రకారం బార్‌లకు అనుమతులు ఇవ్వబోతున్నారు. ఓపెన్‌ కేటగిరి, గీత కార్మికులకు కేటాయించిన బార్‌లు మొత్తం 183 ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ జిల్లాలో 140, కృష్ణాజిల్లాలో 43 బార్‌లు రాబోతున్నాయి. వాటిలో గీత కార్మికులకు 14 బార్‌లను కేటాయించారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 183 బార్‌లు

ఎన్టీఆర్‌ జిల్లాలో 140... కృష్ణాజిల్లాలో 43 ఏర్పాటు

గీత కార్మికులకు 14 బార్‌లు కేటాయింపు

20న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

గీత కార్మికుల దరఖాస్తుల స్వీకరణకు 29 తుది గడువు

ఓపెన్‌ కేటగిరి బార్‌ దరఖాస్తుల స్వీకరణకు 26 తుది గడువు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయబోయే బార్‌ల లెక్కను ఎక్సైజ్‌ అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఉన్న బార్‌ల లైసెన్స్‌ గడువు ఈనెలాఖరుతో ముగియడంతో కొత్త విధానం ప్రకారం బార్‌లకు అనుమతులు ఇవ్వబోతున్నారు. ఓపెన్‌ కేటగిరి, గీత కార్మికులకు కేటాయించిన బార్‌లు మొత్తం 183 ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ జిల్లాలో 140, కృష్ణాజిల్లాలో 43 బార్‌లు రాబోతున్నాయి. వాటిలో గీత కార్మికులకు 14 బార్‌లను కేటాయించారు. ఎన్టీఆర్‌ జిల్లా పది, కృష్ణా జిల్లాలో నాలుగు బార్‌లను గీత కార్మికులకు రిజర్వ్‌ చేశారు. ఈ బార్‌లను గౌడ, గౌడ్‌ ఉప కులాలకు కేటాయిస్తారు. ఏ బార్‌ ఏ ఉపకులానికి కేటాయిస్తారన్న విషయం సోమవారం తేలుతుంది. జిల్లా కలెక్టర్‌ లాటరీ ద్వారా గౌడ, గౌడ్‌ ఉప కులాలకు ఏయే నంబర్ల బార్‌లు కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 162 బార్‌లు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ జిల్లాలో 120, కృష్ణాజిల్లాలో 32 బార్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో పది స్టార్‌ హోటళ్లలో ఉన్నాయి. వాటి లైసెన్స్‌ గడువు ఈనెలాఖరుతో పూర్తవుతుంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం రూపొందించిన కొత్త బార్‌ విధానం ప్రకారం లైసెన్స్‌లను జారీ చేస్తారు.

ఎక్కడెక్కడంటే...

ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 130 బార్లను ఓపెన్‌ కేటగిరికి, పది బార్లను గీత కార్మికులకు కేటాయించారు. విజయవాడలో 117 బార్‌లు ఓపెన్‌ కేటగిరికి, తొమ్మిది బార్‌లు గీత కార్మికులకు రిజర్వ్‌ చేశారు. జగ్గయ్యపేటలో రెండు, నందిగామలో రెండు, తిరువూరులో ఒక బార్‌ను ఓపెన్‌ కేటగిరికి కేటాయించారు. కొండపల్లిలో ఎనిమిది బార్‌లను ఓపెన్‌ కేటగిరికి, ఒక బార్‌ను గీత కార్మికులకు రిజర్వ్‌ చేశారు. కృష్ణాజిల్లాలో 39 బార్లను ఓపెన్‌ కేటగిరికి, నాలుగు బార్‌లను రిజర్వేషన్‌ కేటగిరికి ఇచ్చారు. మచిలీపట్నంలో పది బార్‌లను ఓపెన్‌ కేటగిరికి, ఒక బార్‌ను రిజర్వేషన్‌లో ఉంచారు. పెడనలో ఒకటి, ఉయ్యూరులో ఒక బార్‌ ఏర్పాటు కాబోతున్నాయి. ఈ రెండింటిని ఓపెన్‌ కేటగిరికి కేటాయించారు. గుడివాడలో పది బార్‌లను ఓపెన్‌ కేటగిరికి, ఒక బార్‌ను గీత కార్మికులకు, తాడిగడపలో 14 బార్‌లను ఓపెన్‌ కేటగిరికి, రెండు బార్‌లను గీత కార్మికులకు కేటాయించారు. ఇవి కాకుండా పర్యాటక కేటగిరిలో మంగినపూడలో ఒకటి, అవనిగడ్డలో రెండు బార్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. లాటరీ ద్వారా ఎంపికైన బార్‌లకు 2028 ఆగస్టు 31 వరకు లైసెన్స్‌ను ఇస్తారు.

దరఖాస్తులు ఇలా

బార్‌ల లైసెన్స్‌లను పొందాలనుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దీంతోపాటు విజయవాడ, మచిలీపట్నంలోని ఈఎస్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అదే రోజున జిల్లా ఎక్సైజ్‌ అధికారులు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఓపెన్‌ కేటగిరీలో బార్‌లకు దరఖాస్తులు చేసుకునే వారికి 26వ తేదీ సాయంత్ర ఐదు గంటలకు తుది గడువు. ఆ బార్‌లకు 28వ తేదీన లాటరీ తీస్తారు. గీత కార్మికుల కోటాలో దరఖాస్తులు చేసుకునే వారికి 29వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తుది గడువు. 30వ తేదీన లాటరీ ద్వారా బార్‌లను కేటాయిస్తారు. అభ్యర్థులు దరఖాస్తుగా రూ.10వేలు, డిపాజిట్‌గా రూ.5లక్షలు చెల్లించాలి. ఇందులో రూ.5లక్షలకు వాపసు ఉండదని అధికారులు తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 01:13 AM