Swasth Nari Sashakt Parivar Abhiyan: 16 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:27 AM
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది మహిళలు, బాలికలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించామని...
ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది మహిళలు, బాలికలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8,050 వైద్య శిబిరాల ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించామని చెప్పారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు ఇతర స్ర్కీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందస్తు పరీక్షల ద్వారా అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించిన వారికి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా 34,460 మందికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన హెల్త్ కార్డులు జారీ చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉప ఆరోగ్య కేంద్రాలు, బోధనాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాలు వచ్చే నెల 2వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా దాదాపు కోటి మందికిపైగా ఆరోగ్య పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వీరపాండియన్ వివరించారు.