Share News

Health Department: 1,566 స్క్రబ్‌ టైఫస్‌ కేసులు

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:20 AM

ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్‌ టైఫస్‌ పాజటివ్‌ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ వెల్లడించారు.

Health Department: 1,566 స్క్రబ్‌ టైఫస్‌ కేసులు

  • ఆ లక్షణాలతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి

  • మరణాలకు కారణాలపై పరిశోధన చేయాలి

  • బోధనాస్పత్రులు, పీహెచ్‌సీల్లో నిర్ధారణ పరీక్షలు

  • ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేసులు తక్కువే

  • ఆరోగ్య శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ వెల్లడి

అమరావతి, సత్తెనపల్లి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్‌ టైఫస్‌ పాజటివ్‌ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ వెల్లడించారు. ఈ లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారని చెప్పారు. అయితే స్క్రబ్‌ టైఫస్‌ వల్లే ఈ మరణాలు సంభవించినట్టు ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ఆ మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయాల్సి ఉందన్నారు. దీనికి 2-3 నెలల సమయం పట్టొచ్చని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ కేసులే నమోదయ్యాయని తెలిపారు. 2025లో ఇప్పటివరకూ కర్ణాటకలో 1,870, తమిళనాడులో 7,308, తెలంగాణలో 309 కేసులు బయటపడగా.. ఏపీలో 1,566 పాజటివ్‌ కేసులు నమోదైనట్లు వివరించారు. రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, పీహెచ్‌సీల్లోనూ స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.


స్క్రబ్‌ టైఫ్‌సతో మరొకరు మృతి!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం కొమెరపూడి గ్రామానికి చెందిన బత్తుల లూర్దమ్మ (64) జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు కనిపించడంతో ఇక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాగా, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ఒకరిలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఓ వ్యక్తి ఈనెల 3న తీవ్ర అస్వస్థతకు గురికాగా వెనిగండ్ల పీహెచ్‌సీ వైద్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. స్క్రబ్‌ టైఫస్‌ సోకినట్టు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం ఆయన జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వెనిగండ్లలో ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 04:20 AM