150 ఎకరాలు.. నీటి పాలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:01 AM
గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)కి బ్యాక్ వాటర్ వస్తే ఎగువ ప్రాంత పట్టా పంట భూములు ముంపునకు గురవుతున్నాయి.
రూ.40లక్షలు పంట నష్టం
పరిహారం ఇచ్చిన దాఖలు లేవు
జీడీపీ బ్యాక్ వాటర్‌తో భూములు మునక
ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు
గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)కి బ్యాక్ వాటర్ వస్తే ఎగువ ప్రాంత పట్టా పంట భూములు ముంపునకు గురవుతున్నాయి. ఏళ్లు గడిచినా కష్టం తీరేదారి కనిపించడం లేదు. ఈప్రాజెక్టులో 377 మీటర్ల నీటిని నిలువ చేస్తే ఎగువ ప్రాంతంలో ఉన్న ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, గంజహళ్లి, దేవనకొండ మండలంలోని బీసెంటర్, బెల్లదొడ్డి, తోపాటు మరో రెండు గ్రామాలకు చెందిన పొలాలు వరద నీట మునిగిపోతున్నాయి. ఈ పొలాల మీదే ఆధార పడిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది సుమారు రూ.40లక్షలు నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
గోనెగండ్ల, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జీడీపీలో 376.80 మీటర్లకు నీరు వచ్చి చేరింది. వారం రోజుల నుంచి 150 ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. 20ఏళ్లుగా జీడీపీకి వరద వస్తే ఎగువ ప్రాంత రైతులకు ఇవే కష్టాలు. పంటలు నీటిలో మునిగి పోవడం నష్టపరిహరం అంటు రైతులు అధికారుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారిం ది. పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. జీడీపీ ఎగువ ప్రాంతంలో ఉన్న ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, గంజహళ్లి గ్రామాలకు చెందిన పట్టా భూములు జీడీపీ నీటిలో మునిగిపోయాయి. సాగు చేసిన పంటలు నీట మునగడంతో దాదాపు రూ. 40 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, గంజహళ్లి గ్రామాల రైతులకు చెందిన వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి, వరి, ఆముదాలు మొక్క జోన్న పంటలు ప్రాజెక్టు ఎగువ నీటిలో మునిగి పోయాయి. మాకు పంట నష్ట పరిహరం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి ఏడాది ఇదో పెద్ద సమస్య
గాజులదిన్నె ప్రాజెక్టులో 377 మీటర్ల నీటిని నిలువ చేస్తే ఎగువ ప్రాంతంలో ఉన్న ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, గంజహళ్లి, దేవనకొండ మండలంలోని బీసెంటర్, బెల్లదొడ్డి, తోపాటు మరో రెండు గ్రామాలకు చెందిన పంట పొలాలు వరద నీట మునిగి పోతున్నాయి. దీంతో ప్రతి ఏడాది ఈ గ్రామస్ధులకు ఇదో పెద్ద సమస్యగా మారింది. ప్రాజెక్టు నిర్మాణా సమయంలో అధికారుల ముందుచూపు లేకుండా ప్రాజెక్టును నిర్మించారని కొందరు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.
పూర్తిస్థాయిలో నీటిని నిల్వ..
ప్రాజెక్టులో పూర్తిస్ధాయిలో నీటిని నిల్వ చేయకపోతే రబీలో 12 నుంచి 15 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడం కష్టతరంగా మారుతుంది. డోన్, క్రిష్ణగిరి, బండగట్టు, కోడుమూరు, కర్నూలు, గూడురు, బెళగల్‌తో పాటు అవసరసమయంలో మరి కొన్ని గ్రామాలకు తాగునీటి పథకాలకు నీరు అందించాల్సి ఉంది. తప్పని సరిగా నీరు నిలువ చేయాల్సి ఉంటుంది. నీరు నిలువ పెడితే ఎగువ ప్రాంతంలోని రైతుల పొలాలు నీట మునుగుతున్నాయి. మరి ఈ సమస్యకు అధికారులు ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సిందే.
పంట నష్ట పరిహారమివ్వాలి
ప్రాజెక్ట్ వరద నీటిలో మునిగిపోయిన పంటకు ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వాలని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల గ్రామ రైతులు నజీర్‌సాహెబ్, గఫూర్, షెక్‌సాబ్, ఉప్పరి వెంకటేశ్వర్లు, జరినాబేగం, బజారి, పెద్దరాముడ, తాయమ్మ, మల్లికార్జున తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
వరదలో మునిగిపోయిన పంటలకు సంబంధించి అధికారులు సర్వేలు జరిపారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలి. ప్రభుత్వం తప్పని సరిగా పరిహారం అందజేయాలి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
ఫ నజీర్‌సాహెబ్, రైతు, ఐరన్‌బండ
మా సమస్యకు పరిష్కారం చూపండి
ప్రతి ఏడాది ప్రాజెక్టుకు వరద వచ్చి భూములు నీట మునుగుతున్నాయి. అప్పులే మిగులు తున్నాయి. పంటలు వరద నీటిలో మునిగిపోవడం సర్వసాధరణంగా మారింది. ఈ సమస్యకు అధికారులు ఎలాంటి పరిష్కారం చూపుతారో చెప్పాలి.
ఫ వెంకటేష్, రైతు, ఐరన్‌బండ.
నివేదిక ఉన్నతాధికారులకు పంపుతాం
ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని పొలాలు నీట మునిగాయి. పంట భూములను సర్వే చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెండు రోజులుగా జీడీపీ, రెవెన్యూ అధికారులు కలసి నీట మునిగిన పొలాల్లో సర్వేలు జరిపాం. ఈభూములు ప్రభుత్వందా లేక రైతుదా అని నిర్ధారణ చేసుకొని నివేదలు తయారు చేసి త్వరలో ఉన్నతాధికారులకు పంపుతాం.
ఫ మహుమ్మద్ ఆలీ, ఏఈ, జీడీపీ, గోనెగండ్ల