Share News

15 Years as CM: పదిహేనేళ్ల పరుగు

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:39 AM

ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు! తిరుపతికి కాస్తంత దూరంలో సరైన రోడ్డు కూడా లేని ఓ కుగ్రామంలో నడక మొదలు పెట్టారు. విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభించారు. ముఖ్యమంత్రి అయ్యారు.

15 Years as CM: పదిహేనేళ్ల పరుగు

  • సీఎంగా చంద్రబాబు అరుదైన రికార్డు

  • ప్రజా జీవితంలో 15 ఏళ్లు సీఎం హోదాలోనే

  • దక్షిణాదిలో కరుణానిధి, రంగస్వామికే ఈ ఘనత

  • నేటితో ఆ మైలురాయి దాటుతున్న చంద్రబాబు

  • ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం సీఎంగా ఉన్న ఘనత

  • నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు

‘నారా చంద్రబాబు నాయుడు’ అనే ఆయన ఒకప్పుడు సామాన్యుడు! కానీ... ఆయనది అసామాన్య ప్రస్థానం! ‘ఒక్క చాన్స్‌’ అని ప్రజలను వేడుకుని గద్దెనెక్కుతున్న రోజుల్లో... ఆయన ‘వన్స్‌మోర్‌’ అంటూ మళ్లీమళ్లీ సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల మార్కు దాటిన అసాధారణ నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి! ఎన్టీఆర్‌తో విభేదించి 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు. ఇప్పటిదాకా ఆయన పదవీకాలాన్ని లెక్కిస్తే.. నేటితో సీఎంగా ఆయన 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు! తిరుపతికి కాస్తంత దూరంలో సరైన రోడ్డు కూడా లేని ఓ కుగ్రామంలో నడక మొదలు పెట్టారు. విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభించారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే... చంద్రబాబు నాయుడు! తన ప్రజా రాజకీయ జీవితంలో ఆయన మరో మైలురాయి దాటనున్నారు. శుక్రవారంతో (అక్టోబరు 10) ముఖ్యమంత్రి పదవిలో ఆయన 15 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా చేసిన వారి జాబితా పెద్దదే ఉంటుంది. కానీ, దక్షిణ భారతంలో అలాంటి ఘనత కొందరికే దక్కింది. కరుణానిధి 18 ఏళ్ల 362 రోజులపాటు సీఎంగా పదవిలో ఉన్నారు. పుదుచ్చేరి సీఎంగా ఎన్‌.రంగస్వామి 16 ఏళ్లకుపైగా ఆ పదవిలో ఉన్నారు. వారిద్దరి తర్వాత ఇప్పుడు దక్షిణాదిలో చంద్రబాబు మాత్రమే ‘15 ఏళ్ల రికార్డు’ను అధిగమించారు.


ఎంజీ రామచంద్రన్‌, ఈకే నయనార్‌, జయలలిత, రామకృష్ణ హెగ్డే వంటి నాయకులు కూడా తమ జీవిత కాలంలో 15 ఏళ్లపాటు సీఎంగా కొనసాగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు కూడా చంద్రబాబు ఖాతాలోనే ఉంది. ఆయన ఉమ్మడి ఏపీకి 8 ఏళ్ల 255 రోజులు సీఎంగా చేశారు. నవ్యాంధ్ర సీఎంగా ఆయన పదవీకాలం నేటికి ఆరేళ్లా 110 రోజులు! వెరసి... 15 ఏళ్లపాటు సీఎంగా ఉన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.


సంస్కరణలకు ఆద్యుడు..

‘ప్రజలకు సుపరిపాలన అందించడం అంటే జనాకర్షక పథకాలు అందించినంత తేలిక కాదు. అది అత్యంత క్లిష్టమైన కర్తవ్యం’ అన్న సింగపూర్‌ వ్యవస్థాపక ప్రధాని లీక్వాన్‌యూ మాటలంటే చంద్రబాబుకు అత్యంత ఇష్టం. లీక్వాన్‌ యూ సింగపూర్‌ ప్రధాని అయ్యే నాటికి అది ఓ సంక్షుభిత దేశంగా ఉంది. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రజల ముందు ఆయన ఓ విజన్‌ ఉంచారు. దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేశారు. దాని ఫలితమే నేటి సింగపూర్‌. లీక్వాన్‌ యూలోని ఈ విజనే చంద్రబాబును ఆకర్షించింది. విజన్‌-2020.. విజన్‌ -2047 అలా రూపుదిద్దుకున్నవే. చంద్రబాబు సీఎంగా తీసుకునే నిర్ణయాలకు తొలుత తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వాటి ఫలాలు మాత్రం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని మళ్లీమళ్లీ రుజువవుతోంది. ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్‌ కాలేజీలు మంజూరు చేస్తున్నారని నాడు గగ్గోలు పెట్టారు. నేడు తెలుగునాట ఇంటికో ఇంజనీరు ఉన్నాడంటే అది బాబు చలువే అంటారు. హైదరాబాద్‌ నేడు ఐటీ హబ్‌గా లక్షల మందికి ఉపాధి చూపుతోందంటే... మాదాపూర్‌ కొండల్లో హైటెక్‌ సిటీకి చంద్రబాబు వేసిన పునాదే కారణం. 1999లో విద్యుత్తు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీనివల్ల రాజకీయంగా టీడీపీ నష్టపోయింది. కానీ... నాటి విద్యుత్తు సంస్కరణల ఫలితంగా కోతలు, ఓల్టేజీ సమస్యలు తెలియని రోజులు వచ్చాయి. నదుల అనుసంధానాన్ని చేపట్టి... గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపారు. ‘అమరావతి’ పేరుతో ఒక బృహత్‌ నగరాన్నే నిర్మిస్తున్నారు. ఇలాంటి పెద్ద కలలు కనడం... వాటిని సాకారం చేసేందుకు నిరంతరం కృషి చేయడం... సంపద సృష్టించడం... సంక్షేమం అమలు చేయడం! సీఎంగా చంద్రబాబు అనుసరిస్తున్న మార్గమిదే!


సంక్షోభాలే సోపానాలు..

సంక్షోభాలను ఎదుర్కోవడం... సంస్కరణలతో ముందుకు సాగడం! సీఎంగా చంద్రబాబు పంథా ఇదే! టీడీపీలో నెలకొన్న సంక్షోభాన్ని నిలువరించి పార్టీని.. పార్టీ క్యాడర్‌ను నిలబెట్టుకునేందుకు అనివార్య పరిస్థితుల్లో ఎన్టీఆర్‌తో విభేదించి 1995 సెప్టెంబరు1న చంద్రబాబు తొలిసారి సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. పెనుసంక్షోభం నుంచి పార్టీని నిలబెట్టారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత సుదీర్ఘకాలం అధికారానికి టీడీపీ దూరంగా ఉండిపోయింది. పదేళ్లపాటు అధికారంలో లేకున్నా... పార్టీని పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. 2014లో విభజిత నవ్యాంధ్రలో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక... గతంలో ఎన్నడూ చూడని నిర్బంధాన్ని టీడీపీ నాయకత్వం చూసింది. ఏకంగా చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారు. అలాంటి సంక్షోభాన్ని సైతం అధిగమించి 2024లో భారీ మెజార్టీతో కూటమితో కలిసి టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.

Updated Date - Oct 10 , 2025 | 06:59 AM