Share News

Organ Donation: 14 ఏళ్ల బాలుడికి.. 28 ఏళ్ల వ్యక్తి గుండె

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:48 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌కు గురైన 28 ఏళ్ల యువకుడి గుండె.. తిరుపతికి చెందిన 14 ఏళ్ల బాలుడికి పునర్జన్మనిచ్చింది.

Organ Donation: 14 ఏళ్ల బాలుడికి.. 28 ఏళ్ల వ్యక్తి గుండె

తిరుపతి (వైద్యం), అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌కు గురైన 28 ఏళ్ల యువకుడి గుండె.. తిరుపతికి చెందిన 14 ఏళ్ల బాలుడికి పునర్జన్మనిచ్చింది. గుంటూరుకు చెందిన పి.విజయకృష్ణ (28) రోడ్డు ప్రమాదానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను గుంటూరులోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించిన వైద్యులు ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించి అవయవదానంపై అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులు అంగీకరించారు. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతానికి చెందిన బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిమిత్తం జీవన్‌దాన్‌ పోర్టల్‌లో ఈ బాలుడి పేరు నమోదు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌కు గురై అవయవదానానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలుసుకున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి వారితో సంప్రదించి.. తన బృందంతో గుంటూరు చేరుకున్నారు. కిమ్స్‌ ఆస్పత్రి నిర్వాహకుల సూచనమేరకు ప్రభుత్వం ప్రత్యేక అంబులెన్సులు, ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో విజయకృష్ణ నుంచి గుండె సేకరించి గ్రీన్‌చానల్‌ ద్వారా ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి తిరుపతికి తరలించారు. దాదాపు 6 గంటలు శ్రమించిన వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 05:49 AM