1,30,000
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:19 AM
భవానీ దీక్షాధారుల రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. జై భవానీ.. జైజై భవానీ నామస్మరణతో మార్మోగింది. 1,30,000 భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి.
- రికార్డు స్థాయిలో దుర్గమ్మ దర్శనం
- మూడో రోజు పోటెత్తిన భక్తులు
- ఉత్తరాంధ్ర నుంచి భారీగా తరలి రాక
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
భవానీ దీక్షాధారుల రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. జై భవానీ.. జైజై భవానీ నామస్మరణతో మార్మోగింది. 1,30,000 భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారుగా లక్ష మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 50 వేల నుంచి 60వేల మంది వరకు గిరిప్రదక్షిణ పూర్తి చేసుకున్నారు. తెల్లవారు జామున మూడు నుంచి ఆరు గంటల మధ్య ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల లోపు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చారు. హోల్డింగ్ పాయింట్ల నుంచి క్యూలోకి వచ్చిన భక్తులకు దర్శన సమయం 17 నిమిషాలు పడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ మంది భవానీలు దీక్షల విరమణకు వచ్చారు. ఇరుముడులను గురుభవానీలో విప్పించుకున్న తర్వాత నెయ్యి, కొబ్బరి కాయలను కనకదుర్గానగర్‌లో ఏర్పాటు చేసిన మూడు హోమగుండాలలో భవానీలు వేశారు. తక్కువ సమయంలోనే అమ్మవారి దర్శనం పూర్తవ్వడంతో భవానీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.