AP Land Management Authority: లక్ష కోట్ల భూములు ఏమయ్యాయి
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:10 AM
భూమి అత్యంత ఖరీదైన సహజ వనరు. ఏటా జనాభా పెరుగుతుంది కానీ భూమి మాత్రం ఎప్పటికీ అంతే ఉంటుంది. అవసరాలకు తగినట్టు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంతగా ఫలితాలు ఉంటాయి.
13 ఏళ్లలో 1,82,270 ఎకరాలు కేటాయింపు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, రైల్వేకు
ఏపీఐఐసీ, నెడ్‌క్యా్‌పకే లక్ష ఎకరాలకు పైగా
విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు 42,084 ఎకరాలు
జగన్ ప్రభుత్వంలో కారుచౌకగా కేటాయింపులు
ఈ మొత్తం భూముల్లో సద్వినియోగం ఎంత?
దుర్వినియోగం ఎంతన్న దానిపై సర్కారు పరిశీలన
ఆ తర్వాత భూకేటాయింపు పాలసీలో మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత 13 ఏళ్లలో పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, సంస్థలు, వ్యక్తులకు 1,82,270 ఎకరాలు కేటాయించారు. వీటి విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలు. గత జగన్ ప్రభుత్వంలో అయితే కారుచౌకగా వేల ఎకరాలు కట్టబెట్టారు. ఈ మొత్తం భూముల్లో ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు? దుర్వినియోగం ఎంత? అన్నది పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భూమి అత్యంత ఖరీదైన సహజ వనరు. ఏటా జనాభా పెరుగుతుంది కానీ భూమి మాత్రం ఎప్పటికీ అంతే ఉంటుంది. అవసరాలకు తగినట్టు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంతగా ఫలితాలు ఉంటాయి. అలాంటి భూమిని నిర్దిష్ట ప్రయోజనాలను ఆశించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కేటాయించాక వాటి ఫలితాలు వచ్చాయా? లేదా దుర్వినియోగం జరిగిందా? అంటే.. ల్యాండ్ బ్యాంక్ తరిగిపోతోంది కానీ వాటి ఫలితాలు ఆచరణలో ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భూ కేటాయింపులు, వాటి ప్రయోజనాలు, దుర్వినియోగం వంటి అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ భూకేటాయింపు విధానం-2012 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది (ఆగస్టు) వరకు ఎంత మేర ప్రభుత్వం భూములు కేటాయించింది? వాటి విలువ ఎంత? భూకేటాయింపు ప్రయోజనాలు నెరవేరాయా ? అవి ఆచరణలో ప్రజలు, ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నాయా? లేక ఆ భూములను అడ్డం పెట్టుకొని కొందరు వ్యక్తులు లబ్ధిపొందుతున్నారా? దుర్వినియోగం జరిగితే అది ఏ స్థాయిలో ఉంది? ఇలాం టి అంశాలపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఇకపై భూ ములను మార్కెట్ ధరకు విక్రయించడం ఆపేసి, నిర్దిష్ట కాలపరిమితికి పూర్తిస్థాయిలో లీజు ప్రాతిపదిన ఇవ్వాలనుకుంటోంది. ప్రభుత్వ పరిశీలన కొలిక్కి వచ్చిన తర్వాత భూ కేటాయింపు విధానంలో మా ర్పులు తీసుకురావాలని భావిస్తోంది.
ఏపీఐఐసీ, నెడ్‌క్యా్‌పకు చౌకగా..
ఉమ్మడి ఏపీలో 2012లో ఆనాటి ప్రభుత్వం భూ కేటాయింపు విధానం తీసుకొచ్చింది. అమలు కోసం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) నేతృత్వాన ఏపీ భూ నిర్వహణా సంస్థ(ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ-ఏపీఎల్‌ఎమ్‌ఏ)ను ఏర్పాటు చే సింది. ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు, సంస్థలు, వ్య క్తులకు ఏపీఎల్‌ఎమ్‌ఏ ద్వారానే భూములు కేటాయిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి రూ.లక్ష కోట్ల విలువైన భూములను కేటాయించారు. కొన్ని భూములను మార్కెట్ ధరకు, మరి కొన్నింటిని నామమాత్రపు ఫీజుకు కేటాయించారు. ఇలా 13 ఏళ్ల వ్యవధిలో 1,82,270 ఎకరాల భూములు ఇచ్చా రు. 1,490 ప్రతిపాదనల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. భూ కేటాయింపుల్లో సింహభాగం ఏపీఐఐసీదే కోటా. పరిశ్రమలు, కంపెనీల స్థాపన, ల్యాండ్ బ్యాంక్ పేరిట ఇప్పటి వరకు ఏపీఐఐసీకి 64,788 ఎకరాలను కేటాయించారు. ఇందులో ఎక్కువ భాగం పరిశ్రమలను ప్రో త్సహించాలన్న ఆలోచనతో అతి తక్కువ ధరకే కేటాయించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇవికాకుం డా సోలార్, విండ్, ఇతర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల కోసం 42,084 ఎకరాలను కేటాయించారు. ఇందులో సింహభాగం జగన్ ప్రభుత్వంలోనే ఇచ్చారు. ఇటు ఏపీఐఐసీకి, అటు నెడ్‌క్యా్‌పకు కలిపి వేల ఎకరాలు జగన్ ప్రభుత్వ హయాంలోనే కారుచౌకగా కట్టబెట్టా రు. ఇందులో పంటలు పండే సాగు భూములు కూడా ఉన్నాయని గుర్తించారు. ఈ భూముల వాస్తవిక విలువ ఎంతన్నది మరోసారి నిశిత పరిశీలన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీఐఐసీ, నెడ్‌క్యా్‌పలకే 1.08 లక్షల ఎకరాలు ఇచ్చారు. కానీ వాటిపై ఆశించిన పెట్టుబడులు రాలేదు. ఈ నేపఽథ్యం లో ఈ భూములపై నిశిత పరిశీలన చేయాలనుకుంటోంది.
ప్రైవేటుకు 28,893 ఎకరాలు
పారిశ్రామికేతర అవసరాలు అంటే.. వ్యక్తు లు, సంస్థలు, ట్రస్ట్‌లు, విద్యాసంస్థలు, సామాజిక అవసరాలకు కలిపి ప్రైవేటు రంగంలోని వారికి గత 13 ఏళ్ల వ్యవధిలో 28,893 ఎకరాలపైనే కేటాయించారని గుర్తించారు. ఈ భూముల విలువ కనీసం పాతిక వేలకోట్లపైనే ఉంటుందని అంచనా. ఇందులో అత్యంత ఖరీదైన భూములున్నాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు వంటి నగరాలు, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని భూ ములను ప్రైవేటు సంస్థలు, సం ఘాలు, వ్యక్తులకు ఇచ్చారు. ఎక రం 5 కోట్లు ఉన్న భూమిని కూ డా ఏడాదికి రూ.వెయ్యి లీజు చొప్పున కేటాయించిన ఉదంతాలు అనేకం బయటకొస్తున్నాయి. ఇక మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, రాష్ట్రానికి పేరు తీసుకొస్తున్నారని వ్యక్తులకు ఇస్తున్న భూముల ఖరీదు కోట్లల్లో ఉంటుంది. ఇలా విశాఖలో ఇచ్చిన వందల కోట్ల విలువైన భూములు ఎన్నో పరాధీనం అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వేలకు కలిపి ఇప్పటి వరకు 8,985 ఎకరాలు కేటాయించారు. ఇందులో రైల్వే ప్రాజెక్టులకు 1,740 ఎకరాలు ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వ భూము లే. ప్రైవేటు భూములకు పరిహారం ఇచ్చారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం లేకుండానే ఇచ్చేసింది.
బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు
జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపులు, వాటి ధరలు, దక్కిన ప్రయోజనాలపై ప్రభుత్వం నివేదికలు కోరింది. జిల్లాల వారీగా ఏపీఐఐసీ మేనేజర్ల నుంచి నివేదికలు కోరినట్లు తెలిసింది. ఇండస్ట్రియల్ జోన్ల పరిధిలో ఎంతెంత భూములు ఇచ్చారు? వాటి వినియోగం ఎలా ఉంది? భూమి కేటాయించినప్పడు నిర్ణయించిన క్లాజుల అమలు పర్యవేక్షణ, స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై నివేదికలు కోరినట్లు సమాచారం. అయితే కొన్ని కంపెనీలు, సంస్థలు తీసుకున్న భూముల్లో కేవలం 30-60 శాతం వినియోగించి, మిగిలిన భూములను తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నట్లుగా గుర్తించారు. కొన్ని అయితే ఇచ్చిన మొత్తం భూమిని తనఖా పెట్టి రుణాలు పొందినట్లుగా గుర్తించారు. రుణాలను తిరిగి చెల్లించని పక్షంలో బ్యాంకులు ఆ భూములను వేలం వేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపఽథ్యంలో ఏపీఐఐసీ వద్ద ఉన్న ల్యాండ్‌బ్యాంక్ వినియోగంపై సమగ్ర సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇకపై పరిశ్రమలు, కంపెనీలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు, ట్రస్టులకు లీజు ప్రాతిపదికనే భూములు ఇవ్వాలనుకుంటోంది.