Cyber Scam Network Busted: కంబోడియా నుంచి సైబర్ వల..!
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:23 AM
తమ బ్యాంకు ఖాతా వివరాలను వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కంబోడియాలోని సైబర్ స్కామర్లకు అందించి.. అందుకు ప్రతిఫలంగా కమీషన్లు పొందుతున్న...
13 మంది భారతీయ స్కామర్లు అరెస్టు
రూ.42 లక్షలు, పాస్‌పోర్టులు స్వాధీనం
భీమవరం క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తమ బ్యాంకు ఖాతా వివరాలను వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కంబోడియాలోని సైబర్ స్కామర్లకు అందించి.. అందుకు ప్రతిఫలంగా కమీషన్లు పొందుతున్న 13 మందిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్‌కు కొద్ది రోజుల క్రితం తాము బెంగళూరు పోలీసులమంటూ ఫోన్ కాల్ వచ్చింది. మీపై క్రిమినల్ కేసులున్నాయని, మాఫీ చేయాలంటే తాము చెప్పిన అకౌంట్లకు డబ్బు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రొఫెసర్ తన నాలుగు బ్యాంకు ఖా తాల నుంచి పలు దఫా లుగా ఆర్టీజీఎస్ ద్వారా సొమ్ము పంపించారు. ఆ తర్వాత అనుమానం రావడంతో ఆ ప్రొఫెసర్ భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో ఏడు టీమ్‌లను ఏర్పాటు చేసి రిటైర్డ్ ప్రొఫెసర్ నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన రహతేజే నయ న్ వ్యక్తి సాయంతో కాంబోడియా ముఠాకు చేరిన బ్యాంకు ఖాతాలను ట్రాక్ చేశారు. అవన్నీ బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, ఖమ్మం, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన వారివిగా గుర్తించి 13 మందిని అరెస్ట్ చేశారు. రహతేజే నయిన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వారివద్ద నుంచి రూ.42 లక్షలతో పాటు అంతర్జాతీయ సిమ్ కార్డులతో కూడిన 15 మొబైళ్లు, బ్యాంకు డాక్యుమెంట్లు, పాస్‌పోర్టులు, ల్యాప్‌టా్‌పలు స్వాధీనం చేసుకున్నారు.