Tourism Development: పర్యటకంలో 12వేల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:56 AM
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.
పీపీపీ విధానంలో పర్యాటక రంగ అభివృద్ధి
టూరిస్ట్ సర్క్యూట్‌లతో స్థానిక ప్రాంతాల సందర్శన
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ విశాఖలో యాత్రీ నివాస్ ప్రారంభం
విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఇప్పటివరకూ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. విశాఖపట్నంలోని అప్పుఘర్ వద్ద రూ. 13.5 కోట్లతో అభివృద్ధి చేసిన హరిత రిసార్ట్ (యాత్రీ నివాస్)ను ఆయన శనివారం ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావులతో కలిసి ప్రారంభించారు. యాత్రీ నివాస్ గదులు, సమావేశ మందిరం పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని వైసీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఏపీటీడీసీకి చెందిన హోటళ్లు, రిసార్ట్స్‌ను ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అల్లూరి జిల్లాలోని తైడా, జంగిల్ బెల్స్ పనులు వేగవంతం చేశామన్నారు. విశాఖపట్నం వచ్చే పర్యాటకులు సింహాచలం, అనకాపల్లి, స్థానిక ప్రాంతాలు సందర్శించేలా టూరిస్ట్ సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని వెల్లడించారు. లంబసింగి, వంజంగి గ్రామాల్లో కేంద్ర సహకారంతో పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపటామన్నారు. వివిధ పథకాల కింద అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
సెప్టెంబరు 5 నుంచి ఫుడ్ ఫెస్టివల్: ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖలో హోటల్స్‌తో కలిసి పర్యాటక శాఖ ఫుడ్ ఫెస్టివల్‌ను సెప్టెంబరు 5 నుంచి 7 వరకు నిర్వహిస్తోందని ఎంపీ శ్రీభరత్ చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పర్యాటక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి దుర్గేశ్.. ఆర్‌కే బీచ్‌రోడ్డులో హాప్ ఆన్.. హాప్ ఆఫ్(డబుల్ డెక్కర్) బస్సుల టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ జగదీశ్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జయమాధవి పాల్గొన్నారు.