Share News

AP Govt: 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:15 AM

సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. జిల్లాల్లో అధికారుల పనితీరుతో పాటు అన్ని కోణాల్లో విచారించిన తర్వాత.. 26 జిల్లాలకు గాను 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.

AP Govt: 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

  • సుదీర్ఘ కసరత్తు తర్వాత నియామకం

  • పల్నాడుకు కృతికా శుక్లా.. ప్రకాశం-రాజాబాబు

  • నెల్లూరుకు హిమాన్షు శుక్లా.. కర్నూలు-సిరి

  • ప్రకాశం నుంచి గుంటూరుకు తమీమ్‌

  • అనంత నుంచి బాపట్లకు వినోద్‌ కుమార్‌

  • తూర్పుగోదావరి జిల్లాకు కీర్తి చేకూరి

  • 26 జిల్లాల్లో ఎనిమిదింటికి మహిళా కలెక్టర్లే

  • వారికి కీలక జిల్లాలు అప్పగింత

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. జిల్లాల్లో అధికారుల పనితీరుతో పాటు అన్ని కోణాల్లో విచారించిన తర్వాత.. 26 జిల్లాలకు గాను 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. పాత కలెక్టర్లలో కొంత మందిని సీనియారిటీ ఆధారంగా రాజధానికి తీసుకురాగా.. మరికొంత మంది పనితీరు సక్రమంగా లేకపోవడంతో కలెక్టర్లుగా తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించింది. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్‌గా ఉన్న కృత్తికా శుక్లాకు, సమాచార పౌరసంబంధాల కమిషనర్‌ హిమాన్షు శుక్లాకు మరోసారి కలెక్టర్లుగా అవకాశం కల్పించింది. ఇదివరకు కృత్తిక కాకినాడ కలెక్టర్‌గా, హిమాన్షు కోనసీమ కలెక్టర్‌గా పనిచేశారు. అలానే ఎప్పటినుంచో కలెక్టర్‌గా విధులు నిర్వహించాలని కోరుకుంటున్న రాజాబాబును ప్రకాశం జిల్లాకు, ప్రభాకర్‌రెడ్డిని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా, సిరిని కర్నూలు కలెక్టర్‌గా నియమించింది. రాజాబాబుకు గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన అనుభవం ఉంది. అలానే ప్రస్తుతం కలెక్టర్లుగా ఉన్న ఇద్దరు వేరే జిల్లాలకు బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ బాపట్ల కు, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. పార్వతీపురం మన్యం కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ను శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈసారి బదిలీల్లో 2016 బ్యాచ్‌లో ముగ్గురికి కలెక్టర్‌గా అవకాశం దక్కింది. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కీర్తి చేకూరిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఓ ఆనంద్‌ను అనంతపురం కలెక్టర్‌గా పంపారు. మొత్తంగా 2013 బ్యాచ్‌లో నలుగురికి, 2014 బ్యాచ్‌లో ఒక్కరికి, 2015 బ్యాచ్‌లో నలుగురికి కలెక్టర్లుగా అవకాశం దక్కింది.


30 శాతం మంది మహిళా కలెక్టర్లే

కూటమి ప్రభుత్వం మహిళా అధికారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం మరోసారి నిరూపితమైంది. కలెక్టర్ల నియామకంలోనూ వారికి పెద్దపీట వేసింది. ప్రస్తుతం 26 జిల్లాల్లో 8 కీలకమైన జిల్లాలకు మహిళలే కలెక్టర్లుగా ఉండడం గమనార్హం. ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా కె.విజయ, ఏలూరు-వెట్రిసెల్వి, పశ్చిమగోదావరి-సి.నాగరాణి, నంద్యాల జిల్లా కలెక్టర్‌గా జి.రాజకుమారి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం కొత్తగా మరో ముగ్గురు మహిళా అధికారులు కృత్తికా శుక్లా, ఎ.సిరి, కీర్తి చేకూరిని ప్రభుత్వం నియమించింది. రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం గుంటూరు జిల్లా పరిధిలోనే ఉండడంతో ఆ జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ను నియమించింది. పల్నాడు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలు కూడా రాజకీయంగా కీలకమైనవే. వాటి కలెక్టర్లుగానూ మహిళలే నియమితులయ్యారు. మరో మహిళా ఐఏఎస్‌ను కలెక్టర్‌గా నియమిస్తే 33 శాతం జిల్లాలకు మహిళలే సర్వాధికారులు అవుతారు.

Updated Date - Sep 12 , 2025 | 04:20 AM