Water Resources Department:115 ఇంజనీర్ పోస్టులు ఖాళీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:17 AM
లస్కర్ల నియామకాలకు జల వనరుల శాఖ దాదాపు చెక్ పెట్టేసింది. ఇంజనీరింగ్ అధికారుల పోస్టుల భర్తీని కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. వివిధ స్థాయుల్లో కలిపి మొత్తం 115 ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం.
లస్కర్ల నియామకమూ వదిలేశారు
మరి నీటి యాజమాన్య నిర్వహణ ఎలా?
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): లస్కర్ల నియామకాలకు జల వనరుల శాఖ దాదాపు చెక్ పెట్టేసింది. ఇంజనీరింగ్ అధికారుల పోస్టుల భర్తీని కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. వివిధ స్థాయుల్లో కలిపి మొత్తం 115 ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నీటి యాజమాన్య నిర్వహణ ఎలా చేయగలమని జలవనరుల శాఖ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ శాఖలో మూడు ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) పోస్టులకు గాను రెంటింటిని మాత్రమే అడ్‌హాక్ పేరిట పదోన్నతి కల్పించి భర్తీచేశారు. మరో పోస్టు ఖాళీగా ఉంచేశారు. రాష్ట్రంలో 19 చీఫ్ ఇంజనీర్ పోస్టులకు గాను 13 పోస్టులకు అడ్‌హాక్ పదోన్నతులు ఇచ్చారు. ఇంకా 6 ఖాళీగా ఉన్నాయి. సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులు 51ఉంటే.. వాటిలో 16 ఖాళీ. అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 267 ఉండగా.. ఏకంగా 92 ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు ఇదే ఆటంకంగా మారింది. దిగువ స్థాయిలో అసిస్టెంట్.. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ, డీఈఈ) పోస్టులు 600 దాకా ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్వహణలో అత్యంత ముఖ్యమైన లస్కర్ల నియామకాలూ జరగడం లేదు. కొన్ని ప్రాజెక్టుల్లో అవుట్ సోర్సింగ్ లో లస్కర్లను నియమించుకున్నట్లుగా ఖర్చు మాత్రమే చూపిస్తు న్నారన్న ఆరోపణలున్నాయి. లస్కర్లు లేకపోవడంతో పలు ప్రాజెక్టుల కాలువల్లోకి ఇంజనీర్లే స్వయంగా దిగి నీటి ప్రవాహానికి అంతరా యం లేకుండా చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఇంజనీర్లు, లస్కర్ల నియామకాలపై దృష్టి సారించి.. ఖాళీల భర్తీ చేపట్టాలని ఇంజనీరింగ్ అదికారులు డిమాండ్ చేస్తున్నారు.