AP State Finance Department: పోలవరం నిర్వాసితులకు 1,100 కోట్లు
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:33 AM
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శుభవార్త. వారికి సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.1,100 కోట్లు విడుదల చేసింది. కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో మిగిలి ఉన్న రూ.1,800 కోట్ల...
సహాయ పునరావాసానికి రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల
అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శుభవార్త. వారికి సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.1,100 కోట్లు విడుదల చేసింది. కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో మిగిలి ఉన్న రూ.1,800 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జమ చేసింది. ఈ డబ్బు ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులోని నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ఇంచుమించుగా సరిపోతుందని జల వనరుల శాఖ చెబుతోంది. మరో రూ.100 కోట్లు కూడా ఇస్తే పూర్తిగా నిధులు జమ చేసేయొచ్చని అధికారులు అంటున్నారు. గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాదాపు రూ.1,000 కోట్లను సహాయ పునరావాసం కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సంగతి తెలిసిందే. తమ ఖాతాల్లో డబ్బులు పడిన సమాచారం బ్యాంకుల నుంచి వచ్చిన మెసేజ్‌ల ద్వారా తెలుసుకుని వారు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు విడుదలైన రూ.1,100 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి ఆ డబ్బులు వేయడంతో పాటు.. నిర్వాసితులతో ఆనందం పంచుకుంటూ వారితో ఒక సభ నిర్వహించాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు యోచిస్తున్నారు.
కేంద్రం పదేపదే..
గత ఏడాది అధికార పగ్గాలు చేపట్టాక సీఎం చంద్రబాబు పదే పదే ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పలు దఫాలు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును వడివడిగా పూర్తిచేసేందుకు.. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా నిధులివ్వాలని సీఎం అభ్యర్థించడం.. ప్రధాని ఆమోదించడంతో కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటికే రూ.5,052 కోట్లు విడుదల చేసింది. నిధులున్నా నిర్వాసితులకు చెల్లింపులు చేయకపోవడంపై కేంద్రం పలుసార్లుగా ఒత్తిడి తెస్తూనే ఉంది. ఈ నెల మొదట్లో ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్‌సీ నరసింహమూర్తితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా హాజరయ్యారు. బడ్జెట్ కేటాయింపుల ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోతే.. మురిగిపోతాయని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. దీంతో త్వరగా నిర్వాసితులకు చెల్లింపులు చేయాలని పాటిల్ ఆదేశించారు. నిమ్మల, సాయిప్రసాద్ ఈసమాచారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.1,100 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది.