Intermediate admissions: టెన్త్ ఫలితాలకు ముందే ఇంటర్‌లో చేరొచ్చు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:46 AM
పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూడకుండానే ఇంటర్మీడియట్‌లో చేరే అవకాశాన్ని విద్యార్థులకు ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 23 వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించి, ఫలితాల అనంతరం పూర్తి అడ్మిషన్ల ప్రక్రియ చేపడతారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బ్రిడ్జి కోర్సు
గణితం, సైన్స్, ఆంగ్లంపై ప్రాథమిక బోధన
ఈ నెల 23 వరకు ఆ సబ్జెక్టులపై తరగతులు
ఫలితాలు వచ్చాక పూర్తిస్థాయిలో ప్రవేశాలు
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు రాశారా? ఇంటర్మీడియెట్‌లో చేరాలని అనుకుంటున్నారా? అయితే... ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పదో తరగతి ఫలితాలతో సంబంధం లేకుండా ఇంటర్ విద్యామండలి.. ఇంటర్మీడియెట్‌లో చేరే అవకాశాన్ని కల్పించింది. 2025-26 విద్యా సంవత్సరాన్ని ఈ ఏడాది నుంచి ఏప్రిల్‌లోనే ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థుల నమోదును పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరు నాటికి టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలవుతాయి. ఏటా జూన్‌లో కాలేజీలు ఉన్నందున ఫలితాలపై ఎలాంటి గందరగోళం లేదు. కానీ, ఈసారి ఫలితాల కంటే ముందే తరగతులు ప్రారంభించినందున విద్యార్థులందరినీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేర్చుకుంటున్నారు. ఆయా కాలేజీల్లో ఫస్టియర్‌లో చేరే విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుని బ్రిడ్జి కోర్సు ప్రారంభిస్తారు. ఈ నెల 23 వరకు బ్రిడ్జి కోర్సు కొనసాగుతుంది. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే టెన్త్ ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల్లో పూర్తిస్థాయి ప్రవేశాల(అడ్మిషన్ల) ప్రక్రియ చేపడతారు. టెన్త్ ఫలితాల తర్వాత చేపట్టే అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తారు. అయితే, ఈలోగా విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకుంటే వారు అక్కడే కొనసాగుతారని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
ప్రభుత్వ కాలేజీల్లోనూ బ్రిడ్జి కోర్సు
ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఇప్పుడు బ్రిడ్జి కోర్సు ప్రారంభిస్తున్నారు. గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టులపై ఇప్పటి నుంచి ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో ఇంటర్ సబ్జెక్టుల బోధన ప్రారంభిస్తారు. మరోవైపు.. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12 తర్వాత విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.