Share News

New PG Medical Seats: కొత్తగా 106 పీజీ వైద్య సీట్లు

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:14 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు...

New PG Medical Seats: కొత్తగా 106 పీజీ వైద్య సీట్లు

  • ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అదనపు కేటాయింపు

  • ఐదు కొత్త కళాశాలల్లో 60 సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి: సత్యకుమార్‌

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. గైనిక్‌, జనరల్‌ మెడిసిన్‌, ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతమున్న వాటికి అదనంగా 106 సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కొత్తగా ఆడ్మిషన్లు చేపట్టిన ఐదు కళాశాలల్లో 60 సీట్లు వచ్చాయని తెలిపారు. పీజీ వైద్య విద్యలో ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో 1,763 బ్రాడ్‌ స్పెషాలిటీ, నాలుగు డిప్లొమా కోర్సు సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదనపు సీట్ల కేటాయింపు విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాతో స్వయంగా చర్చించామన్నారు. పీజీ వైద్య విద్యలో అదనపు సీట్ల మంజూరు కోసం అనుమతి కోరుతూ కూటమి ప్రభుత్వం గతేడాది చివర్లో కళాశాలల వారీగా ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసిందని మంత్రి వివరించారు. ఈ మేరకు ఎన్‌ఎంసీ నుంచి తాజాగా వచ్చిన సమాచారంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి కొత్తగా 106 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. జనరల్‌ మెడిసిన్‌లో 20 సీట్లు, గైనిక్‌లో 20, పీడియాట్రిక్స్‌ విభాగంలో 26, ఎనస్థీషియాలో 12, రేడియాలజీలో 4 సీట్లతో పాటు మరికొన్ని విభాగాల్లో అదనపు సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో మచిలీపట్నం మెడికల్‌ కాలేజీకి 12, నంద్యాలకు 16, రాజమండ్రికి16, విజయనగరానికి12, ఏలూరుకాలేజీకి నాలుగుసీట్లు కేటాయించిందని వివరించారు. గుంటూరు మెడికల్‌ కాలేజీలో రేడియాలజీ 4, ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ 4, పీడియాట్రిక్‌లో 4 సీట్లు చొప్పున వచ్చాయి. అనంతపురం వైద్య కళాశాలకు 15, కడప 7, కర్నూలు 4, శ్రీకాకుళం 8 చొప్పున సీట్ల అదనంగా వచ్చాయి.

Updated Date - Oct 19 , 2025 | 03:14 AM