AP Health Services: 104లో రక్త పరీక్షలెప్పుడు..
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:41 AM
ఇంటి వద్దకే అన్నిరకాల వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 104 వాహనాలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 904 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జ్వరం, బీపీ, షుగర్ మందులకే పరిమితం
ప్రభుత్వ లక్ష్యానికి దూరంగా 104 వాహనాలు
‘ఇంటి వద్దకే వైద్యసేవలు’కుగ్రహణం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇంటి వద్దకే అన్నిరకాల వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 104 వాహనాలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 904 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ వాహనాలు రోజూ గ్రామాల్లోకి వెళ్లి.. ప్రజలకు వైద్య సేవలందించాలి. బీపీ, షుగర్, యూరిన్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతోపాటు కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్... ఇలా 47 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ.. ఉదయాన్నే డ్రైవర్, డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్)తో కలిసి గ్రామాల్లోకి వెళ్తున్న 104 వాహనాలు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. జ్వరానికి పారాసిటమాల్, వృద్ధులకు బీపీ, షుగర్ మందులు, గర్భిణులకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడానికి తప్ప ఈ వాహనాలు దేనికీ ఉపయోగపడడం లేదు.
పరీక్షలు లేకుండానే మందులు..
సీఎం చంద్రబాబు.. 104 వాహనాలను కేవలం మందులివ్వడానికే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన రక్తపరీక్షలు నిర్వహించేలా చూడాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కొత్తగా 104 వాహనాలను ప్రారంభించి ఐదు నెలలు పూర్తయింది. కానీ.. ఈ వాహనాలు గ్రామాల్లోకి వెళ్లి వృద్ధులు, గర్భిణులకు మందులిచ్చి రావడం తప్ప రక్తపరీక్షల ఊసే ఎత్తడం లేదు. పీహెచ్‌సీ డాక్టర్.. గర్భిణులకు కొన్ని సూచనలు ఇవ్వడం తప్ప వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం 104 వాహనాల్లో 47 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇవేమీ అందడం లేదు. 104 వాహనాల్లో రక్తపరీక్షలు చేయకుండానే, వారిలో సమస్య ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోకుండానే మందులు ఇచ్చేస్తున్నారు. మరోవైపు గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా మందులు కావాలంటే తాము పీహెచ్‌సీల్లో తీసుకుంటామని, తమకు రక్తపరీక్షలు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పైలట్ పూర్తయినా చర్యలేవీ
104 వాహనాల పర్యవేక్షణ బాధ్యత మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారుల పరిధిలో ఉంది. ఈ వాహనాల్లో రక్తపరీక్షలు కూడా చేపట్టాలని నిర్ణయించిన ట్రస్ట్ అధికారులు.. కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మూడేసి మండలాల చొప్పున ఎంచుకుని పైలట్ ప్రాజెక్టుగా రెండు నెలల పాటు రక్తపరీక్షలు నిర్వహించారు. ప్రతీ గ్రామంలో రోజూ సగటున 30 నుంచి 50 మంది వరకూ రక్తపరీక్షలు చేయించుకున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తయి నెల కావస్తున్నా మిగిలిన జిల్లాల్లో రక్తపరీక్షల నిర్వహణకు అధికారులు ముందడుగు వేయడం లేదు.
నేడు కుప్పంలో ‘సంజీవని’ పథకం ప్రారంభం
రాష్ట్రంలో ప్రజలందరికీ అవసరమైన రక్తపరీక్షలు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి, వారికి ఉన్న అనారోగ్య సమస్యల గురించి ముందస్తుగానే తెలియజేస్తే వారు జాగ్రత్తపడతారని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 30 ఏళ్లు దాటిన వారందరికీ సంజీవని పథకం కింద అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తొలుత కుప్పంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కుప్పం తర్వాత చిత్తూరు జిల్లావ్యాప్తంగా, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి తోడు 104 వాహనాల్లో కచ్చితంగా రక్తపరీక్షలు నిర్వహించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఈ వాహనాల్లో రక్తపరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించారు. కానీ.. ఇది అమలుకావడం లేదు. ఆరోగ్యశాఖ అధికారులు దీన్ని ఎప్పటినుంచి అమలులోకి తీసుకువస్తారో కూడా చెప్పలేని పరిస్థితి.