Power Sector Investments: 102 కొత్త ఇంధన ప్రాజెక్టులు
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:22 AM
రాష్ట్రవ్యాప్తంగా 102 ఇంధన ప్రాజెక్టులు రానున్నాయని, ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్ తెలిపారు.
21 సంస్థలు ఇప్పటికే ఏర్పాటు: సీఎస్
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 102 ఇంధన ప్రాజెక్టులు రానున్నాయని, ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్ తెలిపారు. ఆ ప్రాజెక్టుల విలువ రూ.6 లక్షల కోట్లని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. వీటిలో ఇప్పటికే 21 ప్రాజెక్టులు ఏర్పాటు కాగా మరో 16కు భూకేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకో 45 ప్రాజెక్టులకు భూసేకరణ జరుగుతోందని, మిగిలిన 20 ప్రాజెక్టులు డీపీఆర్, ఫీజిబిలిటీ అధ్యయన దశలో ఉన్నాయని వివరించారు. వీటి మొత్తం సామర్థ్యం 86,578 మెగావాట్లుగా పేర్కొన్నారు. వీటి ద్వారా 4.39 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు 6.85 లక్షల ఎకరాల భూమి కావాల్సి ఉండగా, 1,47,399 ఎకరాల రెవెన్యూ భూమి ఉందని, ఇప్పటికే 38 వేల ఎకరాలను కేటాయించారని తెలిపారు. విశాఖ సదస్సులో ఇంధనశాఖకు చెందిన 50 ప్రాజెక్టులకు ఎంవోయూలు చేసుకున్నట్టు తెలిపారు. వీటి విలువ రూ.4.54 లక్షల కోట్లని, 2.48 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ 45 రోజుల్లోగా గ్రౌండింగ్ చేయాలని సీఎం ఆదేశించారని, కలెక్టర్ల సహకారం తప్పనిసరని విజయానంద్ చెప్పారు.