Share News

Family Acquaintance in Konaseema: ఆ చిన్నారిది ఆత్మహత్య కాదు.. హత్య!

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:23 AM

కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బాలిక అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా విలేకరులకు....

 Family Acquaintance in Konaseema: ఆ చిన్నారిది ఆత్మహత్య కాదు.. హత్య!

  • పరిచయస్తుడైన ఎలక్ట్రీషియనే చంపేశాడు

రామచంద్రపురం(ద్రాక్షారామ), నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బాలిక అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. రామచంద్రపురం త్యాగరాజునగర్‌లో బాలిక రంజిత(10) కుటుంబం నివాసం ఉంటోంది. ఆ చిన్నారి స్థానికంగా ఐదో తరగతి చదువుతోంది. తండ్రి సిర్రా రాజు ముంబయిలోని షిప్‌యార్డులో పనిచేస్తుండగా, తల్లి సునీత స్థానిక ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం మండలం అంబికపల్లి అగ్రహారానికి చెందిన పెయ్యల శ్రీనివాస్‌ ఎలక్ర్టీషియన్‌గా వీరి కుటుంబానికి పరిచయమయ్యాడు. బాలిక తల్లిని అక్కా అని పిలిచేవాడు. ఇంటికి వచ్చివెళ్లే క్రమంలో బంగారు ఆభరణాలు, నగదు ఉండడం గమనించాడు. తనకున్న ఆర్థిక బాధలనుంచి గట్టెక్కడానికి వాటిని అపహరించాలని ప్లాన్‌ వేశాడు. ఈనెల 4న సాయంత్రం 5.20 సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. అప్పటికే స్కూల్‌ నుంచి వచ్చిన బాలిక.. ఎందుకొచ్చావని ప్రశ్నించగా, ఫ్యాన్‌ బాగుచేయడానికని చెప్పాడు. ఫ్యాన్‌ బాగానే ఉందనికదాని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో తాను వచ్చిన విషయం తల్లికి చెప్తుందని భయపడ్డాడు. బాలికను చంపేయాలని నిర్ణయానికొచ్చాడు. అంతే.. ఆ వెంటనే ఓ నల్లని చున్నీని బాలిక మెడకు చుట్టి హత్యచేశాడు. అనుమానం రాకుండా మృతదేహాన్ని ఫ్యాన్‌కు వ్రేలాడదీసి, బయటికి వచ్చి కిటికీలోంచి చేయిపెట్టి లోపల తలుపు లాక్‌ చేసి వెళ్లిపోయాడు. ఆ రోజు కాకినాడ వెళ్లిన తల్లి.. ఇంటికి వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా స్పందన లేదు. కిటికీలో నుంచి చూడగా లోపల బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్టుగా వేలాడుతూ ఉంది. రోదిస్తూ ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి అన్నీ క్షుణ్నంగా పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


హత్య తర్వాత వెంటే ఉండి..

హత్య జరిగిన రోజు రాత్రి శ్రీనివాస్‌ బాలిక పాఠశాలకు వెళ్లి సీసీ ఫుటేజీ సేకరించాడు. దీన్ని ఒక వాట్సాప్‌ గ్రూపులో పెట్టాడు. బాలిక మృతిపై ఒక చానల్‌లో ప్రసారమవుతున్న కథనాన్ని ఖండిస్తూ సోషల్‌ మిడియాలో ఓ పోస్టింగ్‌ కూడా పెట్టాడు. సంఘటన జరిగిన తర్వాత రోజు బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ రంజిత తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతుండగా నిందితుడు శ్రీనివాస్‌ వారి పక్కనే ఉన్నాడు. అయితే, సంఘటన స్థలంలో క్లూస్‌టీం బృందం ఆధారాలు సేకరిస్తుండగా శ్రీనివాస్‌ అతిగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చి అతడి వేలిముద్రలు తీసుకుని పరిశీలించి అతడే హంతకుడని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈనెల 8న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. కాగా, ఈ కేసును ఐదురోజుల్లోనే ఛేదించిన డీఎస్పీ రఘువీర్‌ బృందాన్ని, క్లూస్‌ టీమ్‌ను ఎస్పీ అభినందించారు. బాలికను హత్య చేసిన నిందితుడు శ్రీనివా్‌స తమకు ఆప్తుడిలా నటించి.. ముక్కుపచ్చలారని తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని, అతడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 04:23 AM