Share News

10 వేల ఎకరాల భూ సమీకరణ!

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:11 AM

అమరావతికి దగ్గరగా ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్ల మధ్య ప్రాంతంలో ఉన్న 10 వేల ఎకరాల భూములను యుద్ధప్రాతిపదికన సమీకరించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఎండ్రాయి, కర్లపూడి, తాడికొండ, వైకుంఠపురంలోని భూములను టాప్‌-3 ప్రాధాన్యతా ప్రాజెక్టుల కోసం తీసుకోవాలని యోచిస్తోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు, స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ సిటీకి 2,500 ఎకరాలు, స్పోర్ట్స్‌ సిటీ కోసం 2,500 ఎకరాల చొప్పున తీసుకోవాలన్నది ఆలోచన. అవసరమైన భూములను తీసుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. మిగిలిన భూములను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తర్వాత తీసుకోవాలని చూస్తున్నారు. అయితే భూ సమీకరణ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

10 వేల ఎకరాల భూ సమీకరణ!

- ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్ల మధ్య సీఆర్‌డీఏ ఎంపిక

- ఎయిర్‌ పోర్టుకు 5 వేలు, స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌కు 2,500, స్పోర్ట్స్‌ సిటీకి 2,500 ఎకరాలు

- గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పనులు పూర్తయిన రెండేళ్లకు మరో 34 వేల ఎకరాల సమీకరణ

- మల్టీ కనెక్టివిటీ కోసమే.. ఇన్నర్‌, అవుటర్‌ మధ్య ప్రాంతం గుర్తింపు

- తుళ్లూరు మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం!

- ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు భూములు తీసుకోవాలని నిర్ణయం

అమరావతికి దగ్గరగా ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్ల మధ్య ప్రాంతంలో ఉన్న 10 వేల ఎకరాల భూములను యుద్ధప్రాతిపదికన సమీకరించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఎండ్రాయి, కర్లపూడి, తాడికొండ, వైకుంఠపురంలోని భూములను టాప్‌-3 ప్రాధాన్యతా ప్రాజెక్టుల కోసం తీసుకోవాలని యోచిస్తోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు, స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ సిటీకి 2,500 ఎకరాలు, స్పోర్ట్స్‌ సిటీ కోసం 2,500 ఎకరాల చొప్పున తీసుకోవాలన్నది ఆలోచన. అవసరమైన భూములను తీసుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. మిగిలిన భూములను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తర్వాత తీసుకోవాలని చూస్తున్నారు. అయితే భూ సమీకరణ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

రాజధాని అమరావతిని పరిపాలనా కేంద్రంగానే కాకుండా సమాంతరంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచ బ్యాంక్‌ సూచించిన విధంగా ఆర్థికాభివృద్ధిని తీసుకురావటానికి వీలుగా అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్లతో కలిపి రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదికాకుండా బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థలు కలిపి మొత్తంగా మరో రూ.55 వేల కోట్ల వరకు నిధులు సమీకరించాలని భావిస్తోంది.

విమానాశ్రయంతో సత్వర ఆర్థికాభివృద్ధి!

రాజధాని నగరంలో సత్వర ఆర్థికాభివృద్ధి సాధించే ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమైంది. దీనివల్ల వ్యాపార, వాణిజ్యాభివృద్ధి జరుగుతుంది. మల్టీనేషన్‌ కంపెనీల కార్యాలయాలు, కర్మాగారాలు ఏర్పాటు చేయటానికి దోహదపడుతుంది. ఎగుమతి, దిగుమతులను పెంపొందిస్తుంది. విమానాశ్రయం వల్ల మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అప్‌గ్రేడ్‌ అవుతాయి. రోడ్లు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు వంటివి అభివృద్ధి చెందుతాయి. కార్గో, లాజిస్టిక్‌ హబ్‌గా, పండ్లు, పూలు, ఔషధాల ఎగుమతులకు దోహదపడుతుంది. స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ కూడా వృద్ధి చెందుతుంది. భూములు 300 నుంచి 500 శాతం వరకు పెరుగుతాయన్నది అంచనా. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ సిటీతో అనేక ప్రయోజనాలు

టెక్నాలజీ ఆధారిత పారిశ్రామిక నగరాన్ని స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ సిటీ అంటారు. ఇందులోని పరిశ్రమలు డిజిటల్‌గా ఇంటిగ్రేట్‌ అయి ఉంటాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ద్వారా ఉత్పాదకతను పెంచడం, గ్రీన్‌ ఎనర్జీ అంటే సౌర, పవన శక్తి, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమలు ఉంటాయి. అలాగే, ఇవన్నీ కూడా రోడ్లు, రైల్వేస్టేషన్‌, విమానాశ్రయానికి అనుసంధానం (మల్టీమోడల్‌ కనెక్టివిటీ)గా ఉంటాయి. స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ సిటీ వల్ల భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చు. తద్వారా ఉద్యోగాల సృష్టి ఎక్కువగా జరుగుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం ఇస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు కోసం 2,500 ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది.

స్పోర్ట్స్‌ సిటీ ప్రాజెక్టుతో పర్యాటక రంగ అభివృద్ధి

స్పోర్ట్స్‌ సిటీ ప్రాజెక్టుకు కూడా భూములను సమీకరించాలని నిర్ణయించింది. స్పోర్ట్స్‌ సిటీ వల్ల కూడా అమరావతి సత్వరాభివృద్ధికి దోహదపడుతుంది. స్పోర్ట్స్‌ సిటీ అనేది క్రీడలు, ఫిట్‌నెస్‌, వినోద కేంద్రంగా ఉంటుంది. ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియాలు, ట్రైనింగ్‌ అకాడమీలు, స్పోర్ట్స్‌ మ్యూజియాలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, హోటళ్లు రిటైల్‌ మాల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు, ఆటగాళ్లు, కోచ్‌ల రెసిడెన్షియల్‌ జోన్లు ఉంటాయి. ఈ స్పోర్ట్స్‌ సిటీ వల్ల కూడా పర్యాటక రంగం, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌, స్థానిక వ్యాపారం పెరగటం, ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతుంది.

అవుటర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ల మధ్య ప్రాంతం పరిశీలన

ఈ మూడు ఎకనమిక్‌ బూస్ట్‌ ప్రాజెక్టులకు ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్ల మధ్యన భూములు సమీకరిస్తేనే సార్థకత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మల్టీ మోడల్‌ కనెక్టివిటీ సాధించాలంటే.. ఈ ప్రాంతమే మంచిదని యోచిస్తోంది. అమరావతి నూతన రైల్వే లైను కూడా మంజూరైన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఈ రైల్వేలైన్‌ వెళ్తుంది. దీనికోసం 800 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ భూములను కూడా అమరావతిలో వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, తాడికొండ గ్రామాల్లో సేకరించాల్సి ఉంటుంది. సీఆర్‌డీఏ ద్వారా ఇక్కడి భూములను సమీకరించి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎయిర్‌పోర్టు కోసం భూములు ఎక్కడ తీసుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఎయిర్‌పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఏఏఐ అధికారులతో చర్చించాక కానీ ఓ స్పష్టత రాదు. ఎయిర్‌పోర్టు అవసరాల కోసం తుళ్లూరు మండలంలోని వడ్డమాను, పెద్దపరిమి, హరిశ్చంద్రపురం, తాడికొండ మండలంలోని మోతడక గ్రామాల్లో భూ సమీకరణ ద్వారా భూములను తీసుకోవాలనుకుంటున్నారు.

మరో 30 వేల ఎకరాలపై దృష్టి

అమరావతిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పనులన్నీ పూర్తయ్యాక రాజధాని విస్తరణ ప్రక్రియను ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పనుల్లో ఐకానిక్‌ టవర్లు మినహా మిగిలినవన్నీ రెండేళ్లలో పూర్తవుతాయి. మిగిలిన 30 వేల ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల కోసం, అనేక భాగస్వామ్య సంస్థలకు కేటాయించేందుకు వీలుగా సమీకరించాలన్న ఆలోచన జరుగుతోంది. దేశంలోనే పేరెన్నికగన్న రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ డెవలపింగ్‌ సంస్థలను కూడా ఇప్పటికే ఆహ్వానించారు. ఇలాంటి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల న్నింటికీ అవసరమైన భూములను సమీకరించాలని, నిధులను కూడా సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Apr 16 , 2025 | 01:11 AM