Minister Lokesh: కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:30 AM
రాబోయే నాలుగేళ్లలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా (జీసీసీ) పది లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.
త్వరలోనే టాటా ఇన్నోవేషన్ హబ్: లోకేశ్
మన మిత్ర యాప్ సేవల విస్తృతి పెంచండి
అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశాలు
అమరావతి, జూలై 15 ( ఆంధ్రజ్యోతి ): రాబోయే నాలుగేళ్లలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా (జీసీసీ) పది లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లి నివాసంలో దీనిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్, పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటివరకూ 95 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయని, అవి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరతిగతిన ఈ సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటుచేయడానికి అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రతిష్ఠాత్మక టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూకేటాయింపులు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. బెంగళూరు పర్యటనలో ఏఎన్‌ఎ్‌సఆర్, సత్వ సంస్థలు తమతో జీసీసీ ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయని ఆయన వివరించారు. వాటి ద్వారా 35,000 ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు.రాష్ట్రానికివచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో వర్కింగ్ స్పేస్ సిద్ధం చేయాలని అధికారులను లోకేశ్ అదేశించారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు. విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోక్ (సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్) కేంద్రాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, ఐబీఎంల భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటైందని .. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 400 ఎకరాల్లో నిర్మించదలచిన డ్రోన్ సిటీని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
బుడమేరు వరదల సమయంలో డ్రోన్‌సేవలు ఎంతగానో సహకరించాయని గుర్తు చేశారు. వ్యవసాయం, పోలీసింగ్, వాతావరణం తదితర శాఖల్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహించాలన్నారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని లోకేశ్ చెప్పారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌ద్వారా 535 సేవలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, ఈ సేవలను మరింత విస్తృతం చేయాలని మంత్రి ఆదేశించారు. కుల ధ్రువీకరణతోపాటు విద్యాసంబంధిత అన్ని రకాల సర్టిఫికెట్లను మన మిత్ర ద్వారా అందించాలని సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 45,000 ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ తదితర విమానాశ్రయాల్లో అంతరాయం లేని ఫోన్ కనెక్టివిటీ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నదన్నారు.