Share News

కండరాలు బలంగా ఉండాలంటే

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:13 AM

శరీరం ఆరోగ్యంగా ఉన్నపుడే కండరాలు కూడా పటిష్టంగా ఉంటాయి.

కండరాలు బలంగా ఉండాలంటే

శరీరం ఆరోగ్యంగా ఉన్నపుడే కండరాలు కూడా పటిష్టంగా ఉంటాయి. పాలు, పండ్లు, తాజా కూరగాయలు తరచూ తీసుకుంటూ ఉంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అంది కండరాలు దృఢంగా పెరుగుతాయి. కండరాల ఆరోగ్యాన్ని పెంచే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.

అరటిపండు

దీనిలో అత్యధికంగా పిండిపదార్థాలు, పొటాషియం, గ్లైకోజెన్‌ నిల్వలు ఉంటాయి. ఇవి కండరాల తిమ్మిరిని పోగొడతాయి. వ్యాయామం చేసేముందు తరవాత కూడా అరటి పండు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

జామ

ఈ పండులో ప్రోటీన్లు, పీచుపదార్థం, సి విటమిన్‌ ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక జామపండు తినడం వల్ల కండరాల్లో శక్తి పెరుగుతుంది

మామిడి

మామిడి పండులో పిండిపదార్థాలతోపాటు ఎ, సి, కె విటమిన్లు ఉంటాయి. ఇవి కండరాల బలహీనతను నివారిస్తాయి.

దానిమ్మ

ఈ పండులో యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. దానిమ్మ పండు గింజలను తరచూ తినడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. కండరాల్లో వాపు, నొప్పి రాకుండా ఉంటాయి.


బొప్పాయి

ఈ పండులో పపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది శరీరంలోని ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేసి కండరాల్లో పుళ్లు రాకుండా చేస్తుంది. బొప్పాయిని తరచూ తినడం వల్ల శరీరానికి, కండరాలకు సత్తువ లభిస్తుంది.

పుచ్చకాయ

ఇది శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. దీనిలో ఉండే సిట్రులైన్‌ అనే పదార్థం శరీర కండరాలకు రక్త ప్రసరణను పెంచి అవి బిగుసుకోకుండా చేస్తుంది. తరచూ పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల కండరాల్లో కదలికల సమస్యలు రాకుండా ఉంటాయి.

సీతాఫలం

ఈ పండులో అత్యధికంగా పిండిపదార్థాలు ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం సీతాఫలం తినడం వల్ల శరీరంలో గ్లైకోజెన్‌ నిల్వలు పెరిగి కండరాలు పటిష్టంగా ఉంటాయి.

Updated Date - Nov 25 , 2024 | 04:13 AM