Share News

నవ జీవనానికి నాంది

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:24 AM

నూతన సంవత్సరానికి మొదటి రోజైన ఉగాదికి చాలా విశిష్టత ఉంది. రాబోతున్నది క్రోధి నామ సంవత్సరం. కొత్త సంవత్సరం మొదలైన తరువాత... శ్రీ ఆదిశక్తి ఆగమన సూచికగా తొమ్మిది రోజులు సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ.

నవ జీవనానికి నాంది

నూతన సంవత్సరానికి మొదటి రోజైన ఉగాదికి చాలా విశిష్టత ఉంది. రాబోతున్నది క్రోధి నామ సంవత్సరం. కొత్త సంవత్సరం మొదలైన తరువాత... శ్రీ ఆదిశక్తి ఆగమన సూచికగా తొమ్మిది రోజులు సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. ఇదే రోజున ఆదిశక్తి సృష్టి కార్యాన్ని మొదలుపెట్టింది. శ్రీ గణేశుణ్ణి సృష్టించింది. కాలమానం మొదలయింది ఈ రోజునే. కాబట్టి సంవత్సరాన్ని ఆ దినం నుంచే లెక్కిస్తాం.

విక్రమాదిత్య మహరాజు చైత్రశుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా వేడుక చేసుకొనేవాడనీ, శాలివాహన రాజులు కూడా అదే రోజును సంవత్సరాదిగా లెక్కించడం ఆరంభించారనీ చెబుతారు. బబ్రువాహన అనే శాలివాహన రాజు చేతిలో విక్రమాదిత్యుడు పరాజయం పొందాడు. వారి విజయోత్సవాలను పురస్కరించుకొని... చైత్ర శుద్ధ పాడ్యమి నాడు శాలివాహన శకం మొదలయింది. శాలివాహన శకం, విక్రమ నామ శకం ఆరంభమైన సంవత్సరాలు వేరు కావచ్చు... కానీ అవి ప్రారంభమైన రోజు మాత్రం ఒక్కటే. శాలివాహనులు కూడా అదే రోజున తమ కొత్త సంవత్సరానికి నాంది పలికారు. అంతటి సుదినం కాబట్టి... మన పంచాంగాలను, ముఖ్యంగా పండుగలను దాని ప్రకారం లెక్కిస్తారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలలో చాంద్రమానాన్ని, మరికొన్ని ప్రాంతాల్లో సూర్యమానాన్ని అనుసరిస్తారు. శాలివాహన పంచాంగాన్ని చాంద్రమానం ప్రకారం గుణించారు. చంద్రుడి కళల ఆధారంగా తిథులు ఏర్పడ్డాయి. ఇక శాతవాహన (సత్వాహన) అంటే సప్తవాహికలు (చక్రాలు). మనలోని కుండలినీ శక్తి ప్రయాణించే ఏడు చక్రాలుగా వారు పరిగణించి ఉండవచ్చు.

ఇది రబీ పంటల కోత కాలం. కొత్త పంటల కాలానికి ఆరంభం. ఉదాహరణకు ఉత్తరభారతదేశంలోని మీరట్‌ ప్రాంతంలో... వ్యవసాయానికీ, పంటలకూ దేవీశక్తి అవసరమైనప్పుడు... ఆమెను శాకంబరీదేవిగా సంభావించి.. ఆమె శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. ఆకుకూరలు, కాయగూరలు, పండ్ల సాగులో మనం శాకంబరీ దేవి శక్తిని వినియోగించుకోవాలి. సహజయోగ సాధన ద్వారా వెలువడే చైతన్య తరంగాల శక్తి సహకారంతో... సహజ కృషి పద్ధతుల ద్వారా వ్యవసాయ దిగుబడిని పెంపొందించే ప్రక్రియను శ్రీమాతాజీ నిర్మలాదేవి అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ పండుగను తెలుగువారు, కన్నడిగులు ఉగాదిగాను, మహారాష్ట్రలో గుడిపడ్వాగాను జరుపుకొంటారు. పల్లె సీమల్లో ఉగాదిని ఆనందంగా నిర్వహిస్తారు. వసంతఋతువు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ పండుగకు, ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టే నూతన జీవితానికి నాందిగా ఉగాదిని పరిగణిస్తారు. ఈ పండుగలో అత్యంత పవిత్రమైన సంప్రదాయం గుడి జెండాను తయారు చేయడం. మహారాష్ట్రుల నిర్వహించే గుడిపడ్వాలో ‘గుడి’ అనే పదానికి జెండా, శాలువ అనే అర్థాలు ఉన్నాయి. శాలివాహనులు దేవీ భక్తులు. ఆ రోజులలో వారు దేవికి శాలువను బహుకరించేవారట. మన శరీరం మీద ఆచ్ఛాదనకు, వెచ్చదనానికి, వినయానికి సంకేతం శాలువ. శాలివాహనులకు గుర్తుగా కుంభంపై జెండా ఉండేది. విశిష్టమైన ఆకారంలో ఉండే ఆ కుంభం కుండలినికి సంకేతం, ఆధ్యాత్మికతకు చిహ్నం. ఆనాడే వారు కుండలినీ శక్తిని పూజించేవారు. ఆ ప్రాంతంలో ప్రతి ఇంటివారు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంతో గుడి జెండాను తయారు చేస్తారు. దాన్ని కర్రకు తగిలించి, జెండా పైభాగంలో వెండి లేదా రాగి పాత్రను (కుంభాన్ని) బోర్లిస్తారు. గుడి జెండా చెడుపై విజయాన్ని సూచిస్తుంది. దీన్ని కుటుంబ శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నంగా భావించి, ఇంటి బయట ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల అది దుష్టశక్తులను దూరంగా ఉంచి, ఇంట్లోకి శుభాలను తెస్తుందని నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధకులు మత, ప్రాంత, దేశాలకు అతీతంగా... శాలివాహన పంచాంగం ఆధారంగా... చైత్ర శుద్ధ పాడ్యమి రోజున దేవీ పూజ నిర్వహించి, ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు.

ప్రతి రుచీ ఒక ప్రతీక

na4.jpg

తెలుగు రాష్ట్రాలలో ఉగాది రోజున ముఖ్యమైనది షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ పచ్చడిలో ఒక్కో పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభూతికి ప్రతీక. బెల్లం... తీపి అంటే ఆనందానికి ప్రతీక. ఉప్పు... జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు... అంటే బాధ కలిగించే అనుభవాలను, చింతపండు (పులుపు)... నేర్పుగా వ్యవహరించడాన్ని సూచిస్తాయి. పచ్చి మామిడి ముక్కలు (వగరు)... కొత్త సవాళ్ళకు సంకేతం. కారం... సహనం కోల్పోయేలా చేసే అనుభూతికి చిహ్నం.

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ

సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్‌

వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై , సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ, నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.

ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ‘ధర్మసింధు’ గ్రంథంలో ఉంది:

అబ్దాదౌ నింబకుసుమం... శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌

భక్షితం పూర్వయామేస్యా... తద్వర్షం సౌఖ్యదాయకమ్‌

ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే సంవత్సరం అంతా సౌఖ్యంగా సాగిపోతుందని అర్థం.

Updated Date - Apr 05 , 2024 | 10:24 AM