అది నాకు దక్కిన అదృష్టం
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:16 AM
శాస్త్రీయ నృత్యానికి సామాజిక గాథలను మేళవించి జన రంజకమైన రూపకాలను రూపొందించడంలో నిష్ణాతురాలు ప్రఖ్యాత నాట్యాచారిణి అలేఖ్య పుంజాల. ఆమె ప్రదర్శించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు ‘చాకలి ఐలమ్మ నృత్యరూపకం’ ఎంతోమంది కళాభిమానుల నీరాజనాలు అందుకుంది. ఒకవైపు నృత్య ప్రదర్శనలు, మరోవైపు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు,
శాస్త్రీయ నృత్యానికి సామాజిక గాథలను మేళవించి జన రంజకమైన రూపకాలను రూపొందించడంలో నిష్ణాతురాలు ప్రఖ్యాత నాట్యాచారిణి అలేఖ్య పుంజాల. ఆమె ప్రదర్శించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు ‘చాకలి ఐలమ్మ నృత్యరూపకం’ ఎంతోమంది కళాభిమానుల నీరాజనాలు అందుకుంది. ఒకవైపు నృత్య ప్రదర్శనలు, మరోవైపు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు, ఇంకోవైపు నృత్య శిక్షణతో భిన్న పాత్రలు పోషిస్తున్న అలేఖ్య నృత్య రూపకల్పన అనుభవాలను ‘నవ్య’తో చెబుతున్నారిలా..!
‘‘తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు... ఇది నాకు దక్కిన హోదా లేదా పదవి కాదు, కేవలం బాధ్యత మాత్రమే. ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు పదిమందికి మంచి చేయాలి. మనం చేసే పని మిగతా వారిలా కాకుండా, ఒక కళాకారిణిగా భిన్నంగా నిర్వర్తించాలి. కళలకు, కళాకారులకు చేయూత అందించాలి. తద్వారా నేను స్వీకరించిన ఈ బాధ్యతకు సార్థకత చేకూర్చడమే నా కర్తవ్యం. ఈ మధ్య కాలంలో నాకు వృత్తిరీత్యా అత్యంత సంతృప్తి కలిగించింది ‘చాకలి ఐలమ్మ’ నృత్య రూపకాన్ని రూపొందించడం. ఇప్పటివరకు పురాణ ఇతిహాసాలలోని మండోదరి, దుస్సల, నాయకి, ద్రౌపది, సత్యభామ లాంటి ఎన్నో స్వాభిమానానికి ప్రతీకలైన పాత్రల్లో అభినయించాను. లకుమ, రుద్రమ తదితర చారిత్రక పాత్రలు ఇతివృత్తంగా సాగిన రూపకాలు ప్రదర్శించాను. అలాంటిది వాటన్నింటికన్నా భిన్నంగా మొట్టమొదటిసారిగా సాంఘిక నేపథ్యం కలిగిన ఓ వీరోచిత మహిళ పాత్రను ఎంచుకొన్నాను. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు ‘చాకలి ఐలమ్మ’ గాథ. ఆ ధీర జీవితాన్ని నృత్య రూపకంగా ప్రదర్శించడం నాకు దక్కిన అదృష్టం. రవీంద్రభారతి వేదికగా 45నిమిషాలకుపైగా ప్రదర్శితమైన ఈ రూపకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారితో పాటు ఇతర మంత్రులు కూడా ఆద్యంతం తిలకించడం నాకు గొప్ప విషయం. ‘ఎంతో నిబద్ధత, కృషి ఉంటేకానీ ఇలాంటి ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించడం సాధ్యం కాదు’’ అని ఎంతోమంది ప్రశంసించారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా...
నాకు ఈ నృత్య రూపకం చేయాలన్న ఆలోచన రావడానికి ప్రధాన కారణం తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క గారు. ‘‘తెలంగాణలో భూపోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ గారి జీవితం మీద నృత్యరూపకం చేయచ్చు కదా’’ అని ఒక సందర్భంలో ఆయన నాకు సూచించారు. యాభై ఏళ్ళ నా నృత్య జీవితంలో ఇప్పటి వరకు నేను ఆత్మస్థైర్యం, స్వాభిమానం కలిగిన ఎన్నో మహిళల పాత్రలు పోషించాను. కానీ సాంఘిక పాత్ర ఒక్కటి కూడా చేయలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో ఐలమ్మ ధైర్యసాహసాల గురించి విన్నాను. కనుక ఆ మహనీయురాలి జీవితగాథ మీద ఒక వైబ్రెంట్ ప్రొడక్షన్ చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఐలమ్మ జీవితంమీద అధ్యయనం ప్రారంభించాను. మొదటగా ఆ వీరనారి జీవితంమీద వచ్చిన పుస్తకాలు చదివాను. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై పరిశోధన చేసిన కొంతమంది విద్యార్థులతో సంభాషించాను. ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ గారిని సంప్రదించి, రూపకాన్ని రాసివ్వాల్సిందిగా కోరగానే అందుకు ఆయన అంగీకరించారు. ముఖ్యంగా గ్రాంథిక భాష వాడకుండా, అలా అని మరీ పలుచన కాకుండా సమకాలీన తెలంగాణ భాష, సంస్కృతులను ఎత్తిపట్టేలా రూపకాన్ని ప్రేక్షకులకు అందించాలన్నది నా అభిమతం. అనుకున్నట్టుగానే నా ఆలోచనలకు తగ్గట్టుగా స్ర్కిప్ట్ వచ్చింది. వాస్తవానికి కాస్త భిన్నంగా కథకు మరింత బలాన్ని చేకూర్చడానికి బతుకమ్మ, బోనాలు ఉత్సవాలను జోడించాం. తెలంగాణ పల్లె వాతావరణాన్ని, ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రబిబింబించేలా రూపకాన్ని తీర్చిదిద్దాం.
మరెన్నో ప్రయోగాలు చేయాలనుంది...
నాట్య శాస్త్రంలో లోకధర్మి, నాట్యధర్మి అని ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ రూపకాన్ని లోకధర్మిని అనుసరిస్తూ ప్రదర్శించాను.
మా మామయ్య శివశంకర్ గారి అమ్మ సత్తెమ్మ నోట రజాకార్ల ఆగడాల గురించి గతంలో ఎన్నోసార్లు విన్నాను. పాటల రూపంలో గాథల రూపంలో నిజాం కాలం నాటి పరిస్థితులను ఆమె మాకు చెబుతుండేవారు. సత్తెమ్మ అమ్మమ్మ చనిపోయి చాలాకాలం అవుతున్నా, ఆమె మాటలు, రూపం నా మనోఫలకంమీద అలాగే ఉండిపోయాయి. కనుక ఈ రూపకానికి ఆహార్యం, వస్త్రధారణ ఎలా ఉండాలి అన్నవిషయంపై నాకంటూ ఒక అవగాహన మొదటి నుంచి ఉంది. ఇదివరకటి నా పాత్రలకు భిన్నంగా పాత్రకు తగినట్టుగా నేత చీర కట్టు, బొట్టు, దండ కడియాలు లాంటి వాటితో చాలా సాధారణమైన ఆహార్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ సహజత్వమే నాకు చాలామంచి పేరు తెచ్చింది. దీన్ని ఒక శాస్త్రీయ నృత్యరూపకంగా నేను ఎక్కడా చెప్పలేదు. నా నాట్యానుభవాన్ని జోడించి మొత్తంగా జానపద శైలిలో ప్రదర్శించాను. ఐలమ్మ లాంటి మరెంతో మంది పోరాట యోధురాళ్ల జీవితాలు ఆధారంగా ఇలాంటి ప్రయోగాత్మక నృత్యరూపకాలు మరెన్నో చేయాలి అనుకుంటున్నాను.
తెలంగాణ అస్తిత్వాన్ని మరింత చాటేలా...
జానపద కళలకు ఆలవాలం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ కళాకారుల సంఖ్య తక్కువేమీ లేదు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కళారూపాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరికొన్ని కళారూపాలను నేర్చుకొనే వారు లేక, ప్రదర్శించే వారూ లేక ఒక దయనీయ స్థితి మన కళ్లముందు కనిపిస్తోంది. అలాంటి కళలను గుర్తించి, వాటిని ప్రోత్సహించడమే తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా నా ముందున్న కర్తవ్యం. కనుమరుగవుతున్న కళారూపాలకు ఒక సపోర్టు సిస్టం నెలకొల్పాలి. దాంతో పాటు వాటిని ప్రమోట్ చేయడం కోసం పండుగలు, ప్రత్యేక సందర్భాలలో నిరంతరం ప్రదర్శనలు ఏర్పాటు చేయడం లాంటి వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నది నా ఆలోచన. అరుదైన కళారూపాలు కొత్తతరం నేర్చుకొనేలా శిక్షణా శిబిరాలు నిర్విహించడం, కళాకారులకు ఉపకారవేతనాలు అందించడం లాంటి పనులు కూడా నా దృష్టిలో ఉన్నాయి. తద్వారా మన కళలు, సంస్కృతిని బతికించుకోవడంతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని మరింతగా చాటాలన్నది నా కోరిక. అందుకు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను.
చాకలి ఐలమ్మ నృత్యరూపకాన్ని రూపొందిస్తున్న సమయంలో నాకు ఆ వీరనారి వారసులు పాలకుర్తిలో ఉన్నారన్న విషయం తెలిసింది. ఆ వెంటనే వారిని కార్యక్రమానికి ఆహ్వానించాం. అలా ఐలమ్మ గారి మునిమనుమడి భార్య శ్వేత ఐలమ్మ మా కార్యక్రమానికి రావడం, అదే వేదికపై ఆమెను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా సీఎం ప్రకటించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా కార్యక్రమం ద్వారా ఆ కుటుంబం వెలుగులోకి రావడం, వారికి ప్రభుత్వం నుంచి సముచిత గౌరవం లభించడం నాకూ గర్వకారణమే కదా.! పైగా అదే వేదికపై నేను చదివిన ఆనాటి కోఠి మహిళా కళాశాల, ఈనాటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం... అలా ఆ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయింది. అందులో నేను భాగం కావడం నా అదృష్టం.
కేవీ