Share News

తండ్రికి తగ్గ తనయ

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:45 AM

వారసత్వం అంటే పెద్దల వ్యాపారాన్ని కొనసాగించడం... ఆస్తులను పంచుకోవడం మాత్రమే కాదు... వారు నిర్దేశించిన విలువలు, వ్యక్తిత్వాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకోవడం. ఆ దారిలోనే అడుగులు వేస్తున్నారు...

తండ్రికి తగ్గ తనయ

వారసత్వం అంటే పెద్దల వ్యాపారాన్ని కొనసాగించడం... ఆస్తులను పంచుకోవడం మాత్రమే కాదు... వారు నిర్దేశించిన విలువలు, వ్యక్తిత్వాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకోవడం. ఆ దారిలోనే అడుగులు వేస్తున్నారు రోష్నీ నాడార్‌ మల్హోత్రా. చైర్‌పర్సన్‌గా ‘హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ్‌స’ను విజయపథాన నడిపిస్తున్న ఆమె... తాజాగా ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ హానర్‌’ను అందుకున్నారు. బిజినెస్‌ పరంగానే కాదు... నిరాడంబరమైన జీవన శైలిలోనూ తండ్రిని అనుసరిస్తూ... నేటి తరానికి ప్రేరణగా నిలుస్తున్నారు 43 ఏళ్ల రోష్నీ.

చదువుకొనే రోజుల్లో రోష్నీ నాడార్‌కు తన కుటుంబం ఎంత సంపన్నమైనదో తెలియదు. తండ్రి శివ్‌నాడార్‌ నుంచి ‘హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌’ పగ్గాలు చేపట్టాకనే తమకు ఎంత సంపద ఉందో అర్థమైందని ఓ సందర్భంలో చెప్పారు రోష్నీ. ఢిల్లీలో పెరిగిన ఆమె అక్కడి ‘వసంత్‌ వ్యాలీ స్కూల్‌’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అమెరికాలోని ‘నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ’ నుంచి రేడియో, టీవీ, ఫిలిమ్‌ సబ్జెక్ట్‌లుగా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. నిజానికి అప్పటికి ఆమె మనసు వ్యాపార రంగాన్ని కోరుకోలేదు. మీడియాలో రంగంలోకి వెళదామనుకున్నారు. ‘అందుకు నాన్న ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఆయనే మంచి యూనివర్సిటీ చూసి పెట్టారు. డిగ్రీ తరువాత రెండేళ్లు లండన్‌లోని ఓ చానల్‌లో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా చేశాను.


కొంతకాలం నాకు నచ్చిన రంగంలో ఉన్నాక... ‘కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’లో ఎంబీఏ చదివా. భారత్‌కు తిరిగివచ్చి మా హెచ్‌సీఎల్‌లో సాధారణ ఉద్యోగిగా చేరా’ అంటున్న రోష్నీ... కంపెనీలో వివిధ హోదాల్లో పని చేశారు. అంచలంచెలుగా ఎదిగి 2020లో ‘హెచ్‌సీఎల్‌’ చైర్‌పర్సన్‌గా తండ్రి నుంచి పూర్తి స్థాయి పగ్గాలు అందుకున్నారు. భారత్‌లో లిస్ట్‌ అయిన ఒక ఐటీ కంపెనీకి తొలి మహిళా సారథిగా చరిత్ర సృష్టించారు.

సంచలనాలకు కేరాఫ్‌...

చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టకముందు రోష్నీ... తమ ‘శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌’ ట్రస్టీగా ఉన్నారు. తన ఆధ్వర్యంలో ఫౌండేషన్‌ కింద అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. చెన్నైలోని ‘శ్రీ శివసుబ్రహ్మణ్య నాడార్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌’ వాటిల్లో ఒకటి. ఇది లాభాపేక్ష లేని విద్యా సంస్థ. ఆమె పర్యావరణ ప్రేమికురాలు కూడా. 2018లో ‘ది హ్యాబిటాట్స్‌ ట్రస్ట్‌’ నెలకొల్పారు. వన్యప్రాణులు, వాటి ఆవాసాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు. దీని కోసం వివిధ వన్యప్రాణి సంరక్షణ సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. 2019లో ‘ఫోర్బ్స్‌ ప్రపంచ అత్యంత శక్తిమంతులైన 100 మంది మహిళలు’ జాబితాలో స్థానం సంపాదించారు. 2022లో దేశంలోని అత్యంత సంపన్న మహిళగా నిలిచి మరో ఘనత సాధించారు. ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌ హురున్‌ విడుదల చేసిన జాబితా ప్రకారం... 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి, 84,330 కోట్లకు చేరింది. కంపెనీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె సంచలనాలకు కేంద్ర బిందువు వయ్యారు.


నాన్న బాటలో పయనం...

రోష్నీకి భారతీయ కళలన్నా ఎంతో మక్కువ. చిన్నప్పుడు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 2010లో శిఖర్‌ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

‘ఇద్దరికీ తెలిసిన స్నేహితుల ద్వారా ఢిల్లీలో తొలిసారి శిఖర్‌ను కలిశాను. ఎందుకు చూడగానే తనే నా ఆత్మీయ నేస్తం అనిపించింది. ఏడేళ్లు స్నేహంలో ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం ఆయన మా సంస్థ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు’ అంటూ ఓ సందర్భంలో నాటి రోజులు గుర్తు చేసుకున్నారు రోష్నీ. వీరికి ఇద్దరు పిల్లలు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆమెది. విందులు, వినోదాలకు దూరం. ‘ధనవంతుల ఇంట పుట్టి ఒక సాధారణ అమ్మాయిలా ఎలా ఉంటావు’ అని ఆమెను బంధువులు, స్నేహితులు అడుగుతుంటారు. ‘నాన్న నుంచి నిరాడంబరత నేర్చుకున్నా. అందుకే నగలు, ఖరీదైన వాచీలు, దుస్తులు ధరించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచీ నేను ఇంతే. సాదాసీదాగా ఉంటాను. పరోపకార గుణమే గొప్ప ఆభరణమనేది నా నమ్మకం’... ఇదీ వారికి ఆమె ఇచ్చే సమాధానం. తండ్రి వ్యాపారాన్నే కాదు, ఆయన వ్యక్తిత్వాన్నీ పుణికిపుచ్చుకున్నారు రోష్నీ.


ఎంతో ప్రతిష్టాత్మకం...

ఒక ఇల్లాలిగా, తల్లిగా, ఐటీ కంపెనీ యజమానిగా... భిన్న పాత్రల్లో ఒదిగిపోయిన రోష్నీని ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా ఫ్రాన్స్‌ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ హానర్‌’ను అందుకున్నారు. భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి నుంచి ఈ అవార్డును స్వీకరించారు. వ్యాపార, సామాజిక, పర్యావరణ పరంగా అందించిన సేవలు, ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించేందుకు సాగించిన నిర్విరామ కృషికి గానూ ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు.

‘ఈ పురస్కారం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన రోష్నీ... పేరుకు తగ్గట్టుగానే ఆమె ఎక్కడుంటే అక్కడ వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి.

Updated Date - Jul 10 , 2024 | 12:45 AM