Celeb Talk : సుస్వర నిధి
ABN , Publish Date - Oct 28 , 2024 | 05:45 AM
రాగయుక్తంగా పాడితే... గొంతు మగాడిలా ఉందన్నారు. అందుకు ఆమె చిన్నబుచ్చుకోలేదు. ఆ విమర్శను ఒక ప్రశంసగా తీసుకుని... ఆ గొంతునే తన ప్రత్యేకతగా మలుచుకుంది. ఆపై... ‘ధూమ్ మచాలే’ లాంటి దుమ్ము లేపే బీటైనా... ‘డ్యాన్స్ పే చాన్స్’ అంటూ హుషారెత్తించినా... ‘
సెలబ్ టాక్
రాగయుక్తంగా పాడితే... గొంతు మగాడిలా ఉందన్నారు. అందుకు ఆమె చిన్నబుచ్చుకోలేదు. ఆ విమర్శను ఒక ప్రశంసగా తీసుకుని... ఆ గొంతునే తన ప్రత్యేకతగా మలుచుకుంది. ఆపై... ‘ధూమ్ మచాలే’ లాంటి దుమ్ము లేపే బీటైనా... ‘డ్యాన్స్ పే చాన్స్’ అంటూ హుషారెత్తించినా... ‘షీలా కీ జవానీ’తో ‘ఫిలిమ్‌ఫేర్ అవార్డు’ పట్టినా... ఆమెకే చెల్లింది. గమకాల గమ్మత్తుల ‘నిధి’... ఎంతటి క్లిష్టమైన బాణీ అయినా అలవోకగా ఆలపించగల గాయని... సునిధి చౌహాన్ జర్నీ ఇది.
పాట ఏదైనా సునిధి చౌహాన్ గొంతులో పడితే... సుస్వరాల సంగమంలా వీనుల విందు చేస్తుంది. నాలుగేళ్లకే వేదికలెక్కి తన గాత్రాన్ని వినిపించిన ఆమె... ఆ తరువాత ఎన్నో మరపురాని గీతాలకు గొంతుగా మారింది. ప్రసిద్ధ గాయని, దివంగత లతామంగేష్కర్ మాటల్లో చెప్పాలంటే... ‘సునిధి ఏ పాటనైనా అలవోకగా పాడగలదు. తన గాత్రం, శైలిలో సంగీతాభిమానులను మెప్పించగల హంగులన్నీ ఉన్నాయి. నేటి తర అత్యుత్తమ గాయని సునిధి’. ప్రముఖ సంగీత దర్శకుడు అనూ మాలిక్‌దీ అదే మాట. దాదాపు మూడు దశాబ్దాల ఆమె కెరీర్‌లో జనరంజకమైన మధుర గీతాలు ఎన్నో. ఢిల్లీలో పుట్టి పెరిగిన సునిధి... అసలు పేరు నిధి. అక్కడి ‘గ్రీన్‌వే మోడ్రన్ స్కూల్’లో చదివింది. ఆమె తండ్రి దుష్యంత్ కుమార్ చౌహాన్‌ది ఉత్తరప్రదేశ్. రంగస్థల కళాకారుడు. తల్లి గృహిణి. ఆమె ప్రోద్బలం, ప్రోత్సాహంతోనే సునిధి సంగీత సాధన మొదలుపెట్టింది. నాలుగేళ్ల వయసులో స్థానిక పాటల పోటీల్లో పాల్గొంది.
చదువు ఆపేసి...
తండ్రి స్నేహితుల సలహాతో కాలక్షేపంగా కాకుండా సంగీతానికి ప్రత్యేకంగా సమయం కేటాయించింది సునిధి. ఎంతగా అంటే... దాని కోసం పాఠశాల విద్య పూర్తవగానే చదువుకు స్వస్థి చెప్పింది. ఒక పక్క లైవ్ షోలు చేస్తూనే... మరోవైపు తన గాత్రానికి మెరుగులు అద్దుకుంది. లతామంగేష్కర్‌కు వీరాభిమాని. ఆమె పాటలే సునిధికి ప్రేరణ. ఖాళీ సమయాల్లో ఇంట్లో ప్రముఖ గాయకుల పాటల కేసెట్లు, సీడీలు పెట్టుకొని వినడం, వాటిని సాధన చేయడం ఆమెకు బాల్యంలో అతి పెద్ద వ్యాపకం. అదే ఇప్పుడు ఆమెను విభిన్న గాయనిగా నిలబెట్టింది. ఓ వేదికపై సునిధి పాట విని ముగ్ధురాలైన నటి తబుస్సుమ్... తన షో ‘తబుస్సుమ్ హిట్ పరేడ్’లో అవకాశం కల్పించారు. తనకు మంచి భవిష్యత్తు ఉందని, ముంబయిలో ఉంటే మరిన్ని అవకాశాలు వస్తాయని సునిధి తల్లితండ్రులకు తబుస్సుమ్ సూచించారు. దాంతో ఆమె కుటుంబం ముంబయికి వచ్చి స్థిరపడింది. అప్పుడు సునిధి వయసు పదొకండేళ్లు.
తొలి అవకాశం అలా...
సునిధికి తన షోలో అవకాశం ఇవ్వడంతోనే తబుస్సుమ్ ఆగిపోలేదు. సంగీత దర్శకులు కల్యాణ్‌జీ, ఆనంద్‌జీలకు ఆమెను పరిచయం చేశారు. సునిధి గాత్రానికి ఫిదా అయిన కల్యాణ్‌జీ... ఆమెకు మంచి భవిష్యత్తు ఉందంటూ అభినందించారు. ‘నిధి’ పేరును సునిధిగా మార్చింది ఆయనే. ఆ పేరు తనకు అదృష్టాన్ని తీసుకువచ్చిందని అంటుంది సునిధి. ముంబయి వచ్చిన తొలి రోజుల్లో ఆమె కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎప్పుడైతే కల్యాణ్‌జీ అకాడమీలో సభ్యురాలైందో... అప్పటి నుంచి సునిధి కెరీర్ పుంజుకుంది. కల్యాణ్‌జీ బృందం ‘లిటిల్ వండర్స్’లో ప్రధాన గాయనిగా కొన్నేళ్లపాటు అనేక ప్రదర్శనలు ఇచ్చింది. అయితే తన కూతురు ఎక్కడ స్టేజీ షోలతోనే ఆగిపోతుందోననే ఆందోళన ఆమె తండ్రిని వేధించింది. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే సునిధి దృష్టి పెట్టింది. అదే ఆమెకు కలిసివచ్చింది. 1995 ఫిలిమ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో ‘లిటిల్ వండర్స్’ ట్రూపు తరుఫున గీతాలు ఆలపించింది. అది అక్కడే ఉన్న సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాస్తవకు ఎంతో నచ్చింది. వెంటనే పిలిచి తన చిత్రం ‘శాస్త్రా’లో పాడించారు. పదకొండేళ్ల వయసులో ‘లడకీ దివానీ దేఖో’ అంటూ ఉదిత్ నారాయణ్‌తో కలిసి ఆ చిత్రంలో ఆలపించిన గీతంతో సునిధి పాటల ప్రయాణం ప్రారంభమైంది.
దశ తిరిగింది...
అదే సంవత్సరం డీడీ నేషనల్ చానల్ మొట్టమొదటి సింగింగ్ రియాలిటీ షో ‘మేరీ ఆవాజ్ సునో’ విజేతగా నిలిచి, లతామంగేష్కర్ ట్రోఫీ గెలుచుకుంది సునిధి. దాంతోపాటు తొలి సోలో ఆల్బమ్ ‘అయిరా గెయిరా నాతు కైరా’ విడుదలైంది. అయితే అది చిల్డ్రన్స్ ఆల్బమ్‌గా ప్రాచుర్యం పొందడంతో సునిధి ఆలోచనలో పడింది. తన ప్రతిభకు మెరుగులు అద్దుకోవాలన్న ఉద్దేశంతో గౌతమ్ ముఖర్జీ వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసించింది. రెండేళ్లపాటు బ్యాగ్రౌండ్ వోకలిస్ట్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే గాయకుడు సోనూ నిగమ్... ఆమెను సంగీత దర్శకుడు సందీప్ చౌతాకు పరిచయం చేశాడు. ఆయన అప్పుడు రామ్‌గోపాల్‌వర్మ ‘మస్త్’ చిత్రానికి బాణీలు సమకూర్చే పనిలో ఉన్నారు. రెండు వారాల్లో సునిధితో టైటిల్ ట్రాక్‌తో పాటు ‘రుకి రుకిసీ జిందగీ’, ‘సునా థా’ పాటలు పాడించారు. ‘రుకి రుకిసీ జిందగీ’ పాటకు ఆమెకు ‘ఆర్డీ బర్మన్’ ఫిలిమ్‌ఫేర్ అవార్డు దక్కింది. ఉత్తమ గాయనిగా నామినేట్ అయింది. దాంతో సునిధి దశ తిరిగిపోయింది. ఆ ఏడాది చివరలో ఆనంద్‌మిలింద్ ‘జాన్వర్’, శ్రీవాస్తవ ‘దహేక్’, ‘బడే దిల్‌వాలే’లో అవకాశాలు వచ్చాయి. మరుసటి ఏడాది, అంటే 2000లో అనూమాలిక్ స్వరకల్పనలో విడుదలైన ‘ఫిజా’లో ‘మెహబూబ్ మేరే’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె పాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
వందల గీతాలు...
రెండు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్న సునిధి... ఇప్పటివరకు పధ్నాలుగు వందలకు పైగా సినీ గీతాలు ఆలపించింది. వాటిల్లో పదుల సంఖ్యలో సూపర్‌హిట్ తెలుగు పాటలు కూడా ఉన్నాయి. ఒక్క హిందీలోనే కాకుండా తమిళం, కన్నడ, మళయాళం, అస్సామీ, బెంగాలీ, భోజ్‌పురీ తదితర భాషల్లో తన గాత్ర మాధుర్యంతో అలరించింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్‌చేంజర్’లో ‘జరగండి జరగండి’ పాటతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించింది సునిధి.
సవాళ్లను అధిగమించి...
పాటల ప్రపంచంలో అప్రతిహతంగా సాగిపోతున్న సునిధి... వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. సవాళ్లను అధిగమించింది. కెరీర్ ఆరంభంలో కొందరు మగాడి గొంతులా ఉందని తనను విమర్శించినా దాన్ని ఆమె ఒక అభినందనగా తీసుకుంది. ‘అందుకు నేను బాధపడలేదు. ఈ గొంతు నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావించాను. దానికి తగిన పాటలు ఇచ్చి సంగీత దర్శకులు నన్ను ప్రోత్సహించారు’ అంటూ ఓ సందర్భంలో చెప్పింది ఈ గాయని. అయితే క్లిష్ట సమయంలో తనపై నమ్మకం ఉంచి, తనకు మద్దతుగా నిలిచిన అనూమాలిక్‌ను ఎప్పటికీ మర్చిపోనంటుంది. ‘‘అజ్‌నబీ’ చిత్రం కోసం నాతో ‘మేరీ జిందగీ మే’ పాట పాడించాలని అనూమాలిక్ అనుకున్నారు. అప్పటివరకు ఐటెమ్ సాంగ్స్ పాడిన నాతో రొమాంటిక్ సాంగ్ పాడించడానికి చిత్ర దర్శకులు అబ్బాస్-మస్తాన్ ఒప్పుకోలేదు. కానీ అనూమాలిక్ పట్టు విడవలేదు. ‘సునిధి మాత్రమే ఈ పాటు పాడుతుంది’ అని వారికి తెగేసి చెప్పారు. చివరకు ఆయన మాటే గెలిచింది. ఆ పాట సూపర్‌హిట్ అయింది. వాస్తవానికి ఓ పేరున్న గాయకునితో పాడించాలనుకున్న గీతం అది. ఇక అక్కడి నుంచి నాకు వరుసపెట్టి రొమాంటిక్ సాంగ్స్ కూడా వచ్చాయి’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సునిధి.
పెళ్లి... విడాకులు... పెళ్లి...
పద్ధెనిమిదేళ్లకే బాబీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సునిధి... ఏడాది తరువాత అతడి నుంచి విడిపోయింది. అది తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా అభివర్ణించింది. ‘అయితే ఆ అనుభవం నాలో ఎంతో పరిణతి తీసుకువచ్చింది. అయితే ఇలాంటి విషయాల్లో సమాజం ఎప్పుడూ మహిళలనే తప్పు పడుతుంది. పెళ్లయ్యాక మా ఇద్దరి దారులు వేరని తెలిసింది. ఒకరికి ఒకరం సరిపోమని అర్థమైంది. దాంతో విడిపోవాలనుకున్నాం. అంతకుమించి మా వైవాహిక బంధంలో ఎలాంటి గొడవలు, గందరగోళాలూ లేవు. మేం విడిపోయాక కొందరు నన్ను కించపరిచేలా మాట్లాడారు. కాలం మారుతోంది. కానీ దాంతో పోటీపడలేక ఆగిపోయినవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. వాటికి నేను విలువ ఇవ్వను’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్న సునిధి... 2012లో సంగీత దర్శకుడు హితేష్ సోనిక్‌తో కలిసి ఏడడుగులు వేసింది. వారికి ఒక కుమారుడు.