Share News

Seema Mishra : సాగు బాట... స్ఫూర్తి ప్రదాత

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:22 AM

సరైన ప్రణాళిక అనుసరిస్తే వ్యవసాయాన్ని మించిన గొప్ప ఉపాధి మరొకటి ఉండదంటారు సీమా మిశ్రా. కుటుంబ బాధ్యతల కోసం ఆమె కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేసి పల్లె బాట పట్టారు. ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ విధానంతో తమ పొలంలో లాభాల పంట పండించడంతోపాటు...

Seema Mishra : సాగు బాట... స్ఫూర్తి ప్రదాత

సరైన ప్రణాళిక అనుసరిస్తే వ్యవసాయాన్ని మించిన గొప్ప ఉపాధి మరొకటి ఉండదంటారు సీమా మిశ్రా.

కుటుంబ బాధ్యతల కోసం ఆమె కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేసి పల్లె బాట పట్టారు.

ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ విధానంతో తమ పొలంలో లాభాల పంట పండించడంతోపాటు...

యువతకు, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి, వ్యవసాయంవైపు మళ్ళేలా ప్రోత్సహిస్తున్నారు.

‘‘మాది ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లాలోని రాండియో గ్రామం. తరతరాలుగా వ్యవసాయ కుటుంబం. పెద్దగా చదువుకున్నవారు లేరు. కానీ మా తాతయ్య నా ఆసక్తిని గమనించి... నన్ను బాగా చదివించారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబిఎ చేశాను. టిసిఎస్‌లో మంచి జీతంతో ఉద్యోగం దొరికింది. అన్నీ సజావుగా సాగిపోతున్నాయనుకున్న దశలో... 2015లో తాతయ్య మరణించారు. మా ఇంటి వ్యవహారాలన్నీ తాతయ్యే చూసేవారు. ఆయన లేకపోవడంతో ఆ బాధ్యతలన్నీ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి మా ఊరు వచ్చేశాను. అయితే ఇంట్లోనే కూర్చోవడం, అప్పటివరకూ సంపాదిస్తున్న నేను కుటుంబం మీద ఆధారపడడం ఇబ్బందిగా అనిపించింది. మా ఊళ్ళో వ్యవసాయం తప్ప మరే ఉపాధి మార్గం లేదు. అందుకే మాకున్న పొలంలో సొంతంగా వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో ఈ సంగతి చెబితే... ‘‘మా ఇబ్బందులేవో మేం పడతాం. నువ్వు ఉద్యోగం చేసుకో’’ అన్నారు. అది నాకు ఇష్టం లేదని మా వాళ్ళకు నచ్చజెప్పాను. ఆ తరువాత... మా ప్రాంతంలో సాగు పద్ధతులను నిశితంగా పరిశీలించడం ప్రారంభించాను.

పూర్తి సేంద్రియంగా...

ఎన్నో ఏళ్ళుగా ఒకే పంటను వేయడం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులను అనుసరించకపోవడం లాంటివి దీనికి కారణాలని నాకు అర్థమయింది. పూరీ, భువనేశ్వర్‌ నగరాల్లో వ్యవసాయ నిపుణులతో మాట్లాడిన తరువాత... ‘ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌’ను ప్రయోగాత్మకంగా చేపడితే మంచి ఫలితాలు ఉంటాయనిపించింది. కోళ్ళ పెంపకంలో శిక్షణ తీసుకొని.... రెండువందల కోడి పిల్లలతో పౌలీ్ట్ర ఏర్పాటు చేశాను. ఆ తరువాత పండ్లు, పూలు, కూరగాయల తోటలు వేశాను. అనంతరం కోళ్ళు, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టాను. ఒక చోట నష్టం వచ్చినా... దాన్ని మరో చోట భర్తీ చేసుకోవచ్చేనేది నా ఆలోచన. ఏడాది తరువాత... మంచి లాభాలు వచ్చాయి. దాంతో చేపలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం మొదలుపెట్టాను. అలాగే ఆవులు, గేదెలతో డెయిరీ కూడా ఏర్పాటు చేశాను. వాటి నిర్వహణలో అధునాతనమైన పద్ధతులు అనుసరించాను. డెయిరీలో వ్యర్థాలను పంట పొలాలకు ఎరువుగా వాడుకోవడం లాంటి చర్యలతో ఖర్చు తగ్గింది. ‘నూరు శాతం సేంద్రియం, సున్నా శాతం వ్యర్థాలు’ అనేది లక్ష్యంగా పెట్టుకున్నాను. వీటన్నిటికోసం... కూరగాయల సాగు, హార్టికల్చర్‌, చేపలు, పశువుల పెంపకం, వ్యవసాయ వ్యర్థాలను దాణాగా, సేంద్రియ ఎరువుగా మార్చడం... ఇలా ప్రతిదీ నేర్చుకున్నాను. నన్ను చూసి తోటి రైతులు కూడా ఈ తరహా సాగు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే పొలాల్లో పని చేసేవారు దొరక్క సమస్య ఎదురయింది.


శిక్షణ, సహాయం, మార్కెటింగ్‌...

వ్యవసాయం లాభదాయకం కాదనే ఆలోచనతో... యువత పట్టణాల బాట పడుతున్నారు. అక్కడ కూడా వాళ్ళు అరకొర ఆదాయాలతోనే బతకాల్సి వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో వ్యవసాయ కార్మికులకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. పల్లెల్లో పొలాలు బీడువారి... క్రమంగా నివాస ప్రాంతాలుగా మారిపోతాయి. ఆహార సంక్షోభానికి దారితీస్తున్న కారణాల్లో ఇదొకటని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని... చుట్టుపక్కల గ్రామాల్లోని యువతకు, ఆసక్తి ఉన్న రైతులకు ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌లో శిక్షణనివ్వడం ప్రారంభించాను. దీనికోసం ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలతో ఒక నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేశాను. అర్హులకు సబ్సిడీపై తేనెటీగల పెట్టెలు, ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకలు మంజూరు కావడానికి, వారి ఉత్పత్తుల మార్కెటింగ్‌కూ దోహదం చేస్తున్నాను.

‘బాంబూ బ్రిడ్జ్‌ హెరిటేజ్‌ ఫార్మ్‌’ పేరిట వ్యవసాయ అభ్యాసన కేంద్రాన్ని స్థాపించి... ఇప్పటివరకూ ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించాను. వీటిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులు పాల్గొని... అధునాతన సాగు పద్ధతులను బోధిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటి కెరీర్‌గా మార్చుకోవడంపై సలహాలు ఇస్తారు. ప్రధానంగా మహిళలు, యువత వీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

వినూత్న కార్యక్రమాలు...

ఈ ఏడాది ‘ఎకో-అగ్రి టూరిజం’, ‘పొలం నుంచి పళ్ళెంలోకి’ అనే వినూత్నమైన కార్యక్రమాలను ప్రారంభించాను. ఎవరైనా మా పొలాల్లోకి వచ్చి... వ్యవసాయం గురించి తెలుసుకోవచ్చు. తాజా సేంద్రియ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. దీనికి మంచి స్పందన లభిస్తోంది. వ్యవసాయ శిక్షకురాలుగా, వక్తగా, మహిళా పారిశ్రామిక వేత్తగా... పలు సంస్థలు నన్ను సత్కరించాయి. కార్పొరేట్‌ ఉద్యోగం కన్నా ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది. అయితే... మా ప్రాంతంలోని రైతులు... ప్రధానంగా మహిళలు అధిక ఆదాయం పొందడానికి నా ప్రయత్నాలు తోడ్పడడం, నేనే యాభై మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించడం, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేలా చేయడం... వీటివల్ల కలిగే సంతృప్తికి మరేవీ సాటిరావు.’’

‘బాంబూ బ్రిడ్జ్‌ హెరిటేజ్‌ ఫార్మ్‌’ పేరిట వ్యవసాయ అభ్యాసన కేంద్రాన్ని స్థాపించి... ఇప్పటివరకూ ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించాను. వీటిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులు పాల్గొని... అధునాతన సాగు పద్ధతులను బోధిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటి కెరీర్‌గా మార్చుకోవడంపై సలహాలు ఇస్తారు.

Updated Date - Jun 06 , 2024 | 05:22 AM