Share News

Payal Chauhan Story : పొమ్మన్న నోళ్లే పొగిడాయి..!

ABN , Publish Date - May 29 , 2024 | 05:45 AM

ఊహల్లోని కథలను అద్భుతంగా దృశ్యబద్ధం చేసే సృజనాత్మకత... అన్యాయం అనిపించినదాన్ని కష్టమైనా, నష్టమైనా ఎదిరించే నిర్భయత... అదీ పాయల్‌ చౌహాన్‌. దేశద్రోహిగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు ‘కేన్స్‌’లో పురస్కారం సాధించి

Payal Chauhan Story : పొమ్మన్న నోళ్లే పొగిడాయి..!

ఊహల్లోని కథలను అద్భుతంగా దృశ్యబద్ధం చేసే సృజనాత్మకత... అన్యాయం అనిపించినదాన్ని కష్టమైనా, నష్టమైనా ఎదిరించే నిర్భయత... అదీ పాయల్‌ చౌహాన్‌. దేశద్రోహిగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు ‘కేన్స్‌’లో పురస్కారం సాధించి దేశానికి గర్వకారణమైన ప్రతిభాశాలిగా మన్ననలందుకుంటున్నారు. ఒక వైపు ప్రశంసలు, మరోవైపు వెంటాడుతున్న కేసులు... వైరుధ్యాలతో నిండిన పాయల్‌ కథ ఇది...

కిందటి గురువారం... ఫ్రాన్స్‌లోని కేన్స్‌ నగరం... ‘కేన్స్‌ చలన చిత్రోత్సవం’లో భాగంగా ప్రదర్శించిన ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్ర ప్రదర్శన పూర్తి కాగానే... ప్రేక్షకులందరూ 8 నిమిషాలపాటు కరతాళధ్వనులతో స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత... ఆ ఫెస్టివల్‌కు ప్రధాన పోటీ నిమిత్తం ఎంపికైన భారతీయ చిత్రం అది. రెండు రోజుల అనంతరం... ఉత్సవంలో రెండో అతి పెద్ద అవార్డ్‌ ‘గ్రాండ్‌ ప్రిక్స్‌’ను ఆ సినిమా అందుకుందన్న ప్రకటనతో... ఆ చిత్ర బృందం ఉత్సాహానికి అవధులు లేవు. భారత ప్రధాని మోదీతో సహా ఎందరో ప్రముఖులు వారిపై, ప్రధానంగా దర్శకురాలు పాయల్‌ కపాడియాపై ప్రశంసలు కురిపించారు. ఈ అభినందనలను ఆస్వాదిస్తున్న సమయంలో... వచ్చే నెలలో పుణేలోని సెషన్స్‌ కోర్టు వాయిదాకు తను హాజరు కావడం గురించి పాయల్‌ ఆలోచించే ఉంటారు. ‘పాకిస్తాన్‌కు వెళ్ళిపో’ అంటూ తన దేశభక్తిని శంకిస్తూ సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన వాఖ్యలు బహుశా ఆమె కళ్ళముందు కదుల్తూనే ఉండి ఉంటాయి. సినిమా అంటే పాయల్‌కి అంతులేని వ్యామోహం. దానికి ప్రధాన కారణం ఆమె తల్లి నళినీ మాలిని. నళిని చిత్రకారిణి. దేశంలో తొలితరం వీడియో ఆర్టిస్టుల్లో ఒకరు. ఇంట్లోని వాతావరణం పాయల్‌ అభిరుచులకు దోహదం చేస్తే... ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రుషి వ్యాలీ స్కూల్‌లో చదువు ఆమె సృజనాత్మక వికాసానికి బాటలు పరిచింది. స్కూల్‌లోని ఫిల్మ్‌ క్లబ్‌లో రుత్విక్‌ ఘటక్‌, ఆండ్రీ తార్కోవిస్కీ లాంటి దిగ్గజాల సినిమాలతో పరిచయం ఏర్పడింది. ముంబయిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక... పుణేలోని ‘ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎఫ్‌టిఐఐ)లో... ఫిల్మ్‌ డైరెక్షన్‌ కోర్సులో చేరాలనుకున్నారు. తొలిసారి విఫలమైనా... 2012లో రెండో ప్రయత్నంలో సీటు సంపాదించారు. మరోవైపు అడ్వర్టయిజింగ్‌ రంగంలో, వీడియో ప్రాజెక్టుల్లో పని చేస్తూ, తన ప్రతిభకు పదును పెట్టుకున్నారు. ఆ సమయంలోనే... ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది.

సస్పెండ్‌ చేసి, స్కాలర్‌షిప్‌ ఆపేశారు...

అది 2015 జూన్‌. బిజెపి సభ్యుడు, సినీ, టీవీ నటుడు గజేంద్ర చౌహాన్‌ను ఎఫ్‌టిఐఐ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో... ఆ సంస్థ విద్యార్థులు భగ్గుమన్నారు. అది కేవలం రాజకీయ నియామకమని ఆరోపిస్తూ... నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తరగతులు బహిష్కరించిన వీధుల్లోకి వచ్చారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పెద్దలు ఈ సమస్యపై తమతో చర్చించాలని డిమాండ్‌ చేశారు. కానీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. క్రమంగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ ఆందోళనలకు నాయకత్వం వహించినవారిలో పాయల్‌ ఒకరు. చివరకు... 139 రోజుల తరువాత ఆ ఆందోళన ముగిసింది. విద్యార్థి ఉద్యమాల్లో అతి పెద్దదిగా దీన్ని పరిగణిస్తారు. కాగా, విద్యార్థులు హాస్టళ్ళను ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడంతోపాటు పూర్తికాని విద్యార్థి ప్రాజెక్టుల్ని మూల్యాంకన చేయాలని సంస్థ అప్పటి డైరెక్టర్‌ ప్రశాంత్‌ పత్రబే నిర్ణయించారు. ఆయనను నిర్బంఽధించారంటూ 35 మంది విద్యార్థుల మీద కేసు నమోదయింది. ఛార్జిషీట్‌లో... పాయల్‌ను 25వ నిందితురాలుగా చేర్చారు. ఈ క్రమంలోనే ఆమె సస్పెండయ్యారు. స్కాలర్‌షిప్‌ను ఆపేయడంతో పాటు ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ నుంచి ఆమె పేరును సంస్థ అధికారులు తప్పించారు. అయినా ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. 2015లోనే ఆమె రూపొందించిన ‘ది లాస్ట్‌ మ్యాంగో బిఫోర్‌ మాన్‌సూన్‌’... ‘ఒబెర్హాసెన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’లో ప్రత్యేక జ్యూరీ పురస్కారం సాధించింది. ఆ తరువాన ‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’ లఘు చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దీంతో ఎఫ్‌టిఐఐ దిగి వచ్చింది. కేన్స్‌కు ఆమె హాజరు కావడానికి విమాన ఛార్జీలతో సహా ఖర్చులన్నీ భరించింది. అనంతరం ‘...అండ్‌ వాట్‌ ఈట్‌ ది సమ్మర్‌ సేయింగ్‌’ డాక్యుమెంటరీ... ‘బెర్లిన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’లో గ్లోబల్‌ ప్రీమియర్‌గా ప్రదర్శితంకావడంతో పాటు ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రయోగాత్మక చిత్రం బహుమతిని, ఆమ్‌స్టర్‌డ్యామ్‌ అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫెస్టివల్‌లో ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్నీ సాధించింది. 2021లో ‘ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’ డాక్యుమెంటరీ... ‘కేన్స్‌ చలన చిత్రోత్సవం’లో, ‘26వ బూసాన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’లో ప్రదర్శితమై ప్రశంసలు పొందింది. తాజాగా ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ సినిమా కేన్స్‌లో రెండో అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్‌ ప్రిక్స్‌’ను అందుకుంది. ఒక భారతీయ చిత్రానికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి.

వాళ్ళ జీవితాలే ప్రేరణ...

ఆ సినిమా గురించి పాయల్‌ వివరిస్తూ ‘‘కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబయిలోని ఒక నర్సింగ్‌హోంలో పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి తమ తమ రిలేషన్‌ షిప్స్‌ విషయంలో సమస్యలు ఉంటాయి. ఒకసారి వాళ్ళిద్దరూ రోడ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ఒక అడవికి చేరుకుంటారు. ఆ ప్రయాణం వాళ్ళ జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? అనేదే కథ. ఎఫ్‌టిఐఐలో విద్యార్థినిగా ఉన్నప్పుడే ఈ కథ రాయడం మొదలుపెట్టాను. అప్పట్లో మా నాయనమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండేది. ఆమెకు సాయంగా ఉండే డ్యూటీ సాధారణంగా నాకే పడేది. ఆ ఆసుపత్రి వాతావరణాన్ని దగ్గరగా గమనించాను. నర్సులతో మాట్లాడాను. ఒక కొత్త ఊరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు... ఎదుర్కొనే సమస్యలేమిటో, వారి భావోద్వేగాలు, ఆలోచనలు ఎలా ఉంటాయనేది వారి ద్వారా తెలుసుకున్నాను. వాళ్ళ జీవితాలే నాకు ప్రేరణ. మరికొంత అధ్యయనం చేశాను. ఆ విషయాలన్నిటినీ నాదైన శైలిలో దృశ్యబద్ధం చేశాను. ఈ పురస్కారంతో నా కల నిజయింది’’ అని చెప్పారు. సినిమాలే లక్ష్యమైనప్పుడు... ఎవరి దగ్గరో అసిస్టెంట్‌గా చేరకుండా... ఎఫ్‌టిఐఐలో చేరాలని పాయల్‌ ఎందుకనుకున్నారు? ‘‘దానికి ఒక ఫిలిమ్‌ ఫెస్టివల్‌ స్ఫూర్తి. ‘ఎక్స్‌పెరిమెంట్‌ ఇండియా’ అనే ఆ ఉత్సవం ఇదివరకు ముంబయిలో జరిగేది. ఇప్పుడు బెంగళూరులో నిర్వహిస్తున్నారు. నేను క్రమం తప్పకుండా దానికి హాజరయ్యేదాన్ని అక్కడ ఎఫ్‌టిఐఐ విద్యార్థులు తీసిన చిత్రాలు కూడా ప్రదర్శిస్తారు. వాటిని చూసినప్పుడు... ‘ఇవి మామూలు సినిమాల్లా లేవే? వీళ్ళు ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారు? వీళ్ళకు ఎఫ్‌టిఐఐలో ఎలాంటి శిక్షణ ఇస్తారు?’ అని ఆలోచించేదాన్ని. అందుకే ఆ సంస్థలో చేరాను. సినిమా రూపకల్పనకు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొత్త ప్రయోగాల గురించి నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తడానికి అదే కారణం’’ అంటారామె.


ఇంకా కేసులెందుకూ...

కాగా... ఆమె విజయంపై ఎఫ్‌టిఐఐ స్పందించింది. ‘‘కేన్స్‌లో మా పూర్వ విద్యార్థి చరిత్ర సృష్టించడం ఎఫ్‌టిటిఐకి గర్వించదగిన క్షణం’’ అని అభినందిస్తూ ట్వీట్‌ చేసింది. పాయల్‌ను అడుగగుడునా వేధించి, ఇప్పటికీ ఆమె మీద కేసును నడుపుతున్న ఎఫ్‌టిఐఐ... ఆమె ఘనతను తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోందంటూ సోషల్‌ మీడియా ఆ సంస్థను దుమ్మెత్తిపోస్తోంది. కాగా... ఎఫ్‌టిఐఐలో సుదీర్ఘ ఆందోళనకు కారణమైన గజేంద్ర చౌహాన్‌ ‘‘ఆమెను చూసి మనం అందరం గర్వపడాలి. ఆమెను అభినందించాలనుకుంటున్నాను. అయితే ప్రతిభ వేరు, క్రమశిక్షణారాహిత్యం వేరు. ప్రతిభ ఉండడం మంచిదే, కానీ క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ కేసు పుణే సెషన్స్‌ కోర్టులో కొనసాగుతోంది. పాయల్‌ తన సినిమాల చిత్రీకరణ కోసం లేదా పురస్కారాల స్వీకారం కోసం దేశాన్ని విడిచి వెళ్ళాల్సిన ప్రతిసారీ మేజిస్ట్రేట్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ‘‘దేశానికి ఆమె గర్వకారణం’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రశంసించిన నేపథ్యంలో... ఇప్పటికైనా పాయల్‌ తదితరుల మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆస్కార్‌ పురస్కార విజేత, సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి, కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎందరో ప్రముఖులు, నెటిజన్లు కూడా ఇదే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఈ విషయం మీద ‘నో కామెంట్‌’ అంటున్న పాయల్‌... ‘‘మహిళల గురించి సినిమా తియ్యడం యాదృచ్ఛికం కాదు. నేను చేయాల్సిన పని అదేనని నా నమ్మకం. ఆ చిత్రంలోని ప్రతి పాత్రలోనూ నేనున్నాను. వాటి భావాలన్నీ నాలోంచి వచ్చినవే. ప్రస్తుతం నా తదుపరి చిత్రం ప్రణాళికల్లో ఉన్నాను’’ అని చెబుతున్నారు.

Updated Date - May 29 , 2024 | 05:45 AM