Share News

వందేళ్లలో ఒక్కరే!

ABN , Publish Date - May 02 , 2024 | 05:45 AM

వైస్ ఛాన్సలర్ నియమితులు కావడానికి ముందు నయీమా ఖాతూన్‌... అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. పొలిటికల్‌ సైకాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందిన ఆమె... ఢిల్లీలోని ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌’, ఏఎంయూల్లో పని చేశారు.

వందేళ్లలో ఒక్కరే!

అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)... దేశంలోని అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి.

వందేళ్లు దాటిన ఈ వర్సిటీ చరిత్రలో తొలిసారి ఒక మహిళ వైస్‌చాన్స్‌లర్‌ అయ్యారు.

ఏఎంయూలో విభిన్న హోదాల్లో సేవలందించిన ఆమె...

నేడు అదే విద్యాలయం అత్యున్నత పదవిని అలంకరించారు.

ప్రొఫెసర్‌ నయీమా ఖాతూన్‌ విజయవంతమైన ప్రయాణం ఇది...

వైస్ ఛాన్సలర్ నియమితులు కావడానికి ముందు నయీమా ఖాతూన్‌... అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. పొలిటికల్‌ సైకాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందిన ఆమె... ఢిల్లీలోని ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌’, ఏఎంయూల్లో పని చేశారు. ఏడాదిపాటు రువాండాలోని ‘నేషనల్‌ యూనివర్సిటీ’లో బోధించారు. అమెరికాలోని ‘లూయిస్‌ విల్లే యూనివర్సిటీ’, రొమానియా ‘అల్బా లూలియా’, బ్యాంగ్‌కాక్‌ ‘చులాలాంగ్‌కోర్న్‌ యూనివర్సిటీ’ తదితర విద్యాలయాలను సందర్శించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగించారు. ప్రముఖ జర్నల్స్‌లో ఆమె పరిశోధనా పత్రాలు ఎన్నో ప్రచురితమయ్యాయి. ఒడిశాలో పుట్టి పెరిగిన నయీమా... విద్యార్థి దశ నుంచీ చదువులో ముందుండేవారు. పట్టుదలగా ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. పీహెచ్‌డీ తరువాత ఏఎంయూలోని అదే విభాగం(1988)లో లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. పదేళ్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2014లో మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యే సమయానికి ఆమె సైకాలజీ విభాగానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు వర్సిటీ ‘సెంటర్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కెరీర్‌ ప్లానింగ్‌’కు డైరెక్టర్‌గా సేవలు అందించారు.

ఆచార్యులుగానే కాకుండా రచయితగా, పరిశోధకురాలిగా నయీమా ఖాతూన్‌ సుపరిచితురాలు. ఆమె రచనలు పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆరు పుస్తకాలు రాశారు. క్లినికల్‌, హెల్త్‌, అప్లైడ్‌ సోషల్‌, స్పిరుట్యువల్‌ సైకాలజీల్లో స్పెషలైజేషన్‌ చేశారు. నైమా నిరుపమాన సేవలకు గానూ ‘పాపా మియా పద్మభూషణ్‌ బెస్ట్‌ గర్ల్‌ అవార్డ్‌’ను అందుకున్నారు.


1875లో ‘మహమ్మదన్‌ ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజీ’గా స్థాపితమైన విద్యా సంస్థ... 1920లో ‘అలీఘడ్‌ ముస్లిమ్‌ యూనివర్సిటీ’గా రూపాంతరం చెందింది. 2020 సెప్టెంబర్‌లో ఏఎంయూ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లలో వర్సిటీకి వీసీగా వ్యవహరించిన మహిళ లేరు. ఆ లోటును నయీమా ఖాతూన్‌ భర్తీ చేశారు. 1920లో బేగమ్‌ సుల్తాన్‌ జహాన్‌ ఏఎంయూ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఆమె తరువాత ఏ మహిళా ఆ హోదాను అలంకరించలేదు.

ఇదిలావుంటే... నయీమా ఖాతూన్‌ భర్త ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ గుల్రెజ్‌ మొన్నటివరకు వర్సిటీ తాత్కాలిక వీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గత వీసీ తారిక్‌ మన్సూర్‌ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఆ పోస్టు భర్తీ కోసం రూపొందించిన ఐదుగురి జాబితాలో నయీమా ఖాతూన్‌ కూడా ఉన్నారు. మొత్తం 36 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో వడపోసి ఐదుగురిని ఎంపిక చేసింది వర్సిటీ పాలక మండలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అధికారిక ముద్ర రాగానే కేంద్ర విద్యా శాఖ నయీమా ఖాతూన్‌ను వీసీగా ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమతి కోసం ఈసీకి లేఖ రాసింది. ఇందులో రాజకీయ ప్రయోజనాలు లేవని భావించిన ఈసీ... వర్సిటీ వీసీ నియామకానికి ఆమోద ముద్ర వేసింది. అలా శతాబ్దానికి పైగా చరిత్ర గలిగిన విశ్వవిద్యాలయానికి నయీమా మొట్టమొదటి మహిళా వైస్‌చాన్స్‌లర్‌ అయ్యారు. నవ అధ్యాయానికి నాంది పలికారు.

1875లో ‘మహమ్మదన్‌ ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజీ’గా స్థాపితమైన విద్యా సంస్థ... 1920లో ‘అలీఘడ్‌ ముస్లిమ్‌ యూనివర్సిటీ’గా రూపాంతరం చెందింది. 2020 సెప్టెంబర్‌లో ఏఎంయూ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లలో వర్సిటీకి వీసీగా వ్యవహరించిన మహిళ లేరు. ఆ లోటును నయీమా ఖాతూన్‌ భర్తీ చేశారు.

Updated Date - May 02 , 2024 | 05:45 AM