Navya : కాపాడేది సత్యమే
ABN , Publish Date - Aug 30 , 2024 | 01:48 AM
ఇద్దరు వ్యక్తులు ఒక నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిని ఒడ్డున ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఎలా కాపాడాలో తెలియక ఆందోళన పడుతున్నారు.
సద్బోధ
ఇద్దరు వ్యక్తులు ఒక నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిని ఒడ్డున ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఎలా కాపాడాలో తెలియక ఆందోళన పడుతున్నారు. ఇంతలో... ఆ వ్యక్తుల్లో ఒకరికి పెద్ద దుంగ కనిపించింది. దాన్ని అతను గట్టిగా పట్టుకున్నాడు. రెండో వ్యక్తి చుట్టూ వెతికితే... ఒక తాడు కనిపించింది. అతను దాన్ని అందుకున్నాడు. ఒడ్డు వైపు విసిరాడు.
అక్కడ ఉన్న జనం దాన్ని పట్టుకున్నారు. ఆ తాడు.... దుంగలా దృఢంగా లేదు. చాలా దుర్బలంగా, గట్టిగా లాగితే తెగిపోయేలా ఉంది. కానీ దాన్ని ఒడ్డున ఉన్నవాళ్ళు మెల్లగా లాగారు. తాడు చివర ఉన్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చారు. పెద్ద దుంగ ఉన్న వ్యక్తి దాన్నే అంటిపెట్టుకొని ఉన్నాడు. ఉద్ధృతంగా ఉన్న ప్రవాహం అతన్ని దిగువకు లాక్కొనిపోయింది.
మనకు ప్రాపంచికమైన ఆనందాలు, డబ్బు, పేరు ప్రతిష్టలు, ఆడంబరాలు దుంగలా పెద్దవిగా కనిపిస్తాయి. కానీ అవేవీ మనల్ని రక్షించలేవు. రక్షణ సూత్రం ఎప్పుడూ సన్నటి తాడులాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... మనల్ని కాపాడేది ఏదీ మన కళ్ళకి కనిపించదు. దాన్ని మనం స్పృశించలేం. అనుభూతి చెందలేం. అదే అంతిమమైన సత్యం. అది ఎప్పుడూ అగోచరంగానే ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహించి, దాన్ని నమ్ముకుంటే మనల్ని కాపాడుతుంది.
ప్రాపంచికమైన వాటి మీద ఆధారపడి, అవే నిత్యం అనుకుంటే... నిస్సహాయతలో, దుఃఖంలో మునిగిపోక తప్పుదు. కాబట్టి ఏది సత్యమో, ఏది మనని కాపాడుతుందో తెలుసుకోవాలి. దాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. లౌకికమైన వస్తువులను, సంపదను నమ్ముకున్న వ్యక్తి నాశనమైపోతాడనేది ప్రకృతి సూత్రం. భగవంతుడి మీద విశ్వాసమే మనల్ని సురక్షితంగా ఉంచుతుంది.
- స్వామి రామతీర్థ