Share News

మహా శివతత్త్వమే క్రోధి.. 9న క్రోధి నామ ఉగాది

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:13 AM

కాలచక్ర భ్రమణంలో... చాంద్రమానాన్ని అనుసరించి మరో సంవత్సరం ముగియబోతోంది. రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళించింది. తరువాత శుభకృత్‌, శోభకృత్‌ సంవత్సరాలు కొంత ఉపశమనం కలిగించాయి.

మహా శివతత్త్వమే క్రోధి.. 9న క్రోధి నామ ఉగాది

కాలచక్ర భ్రమణంలో... చాంద్రమానాన్ని అనుసరించి మరో సంవత్సరం ముగియబోతోంది. రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళించింది. తరువాత శుభకృత్‌, శోభకృత్‌ సంవత్సరాలు కొంత ఉపశమనం కలిగించాయి. ఇప్పుడు రాబోయే సంవత్సరం పేరు క్రోధి. గడచిన రెండు సంవత్సరాల పేర్లకు విరుద్ధంగా కనిపించే పేరున్న కొత్త ఏడాది... ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తుందనే భావన సహజమే. కానీ అది వాస్తవం కాదు. క్రోధి శివస్వరూపం. శివుడు శుభుడు, మంగళకరుడు. శివుని విభూది సర్వసంపత్కరం. ధర్మం కోసం, ధర్మబద్ధంగా... లోకకళ్యాణార్థం అధర్మాన్ని నిర్మూలించే ఈశ్వర తత్త్వం క్రోధి. ఈ తత్త్వం భగవంతుడి కారుణ్యానికి మరొక రూపం... కాబట్టి ఇది ఉపశాంతిని కలిగిస్తుంది. అందుకే ప్రత్యేకమైనది. పండుగ చేసుకోవడానికి ఇంతకన్నా కావలసినది ఏముంది? కాలరూపుడైన శివుణ్ణి ఉగాది ఉషోదయ వేళ భక్తి ప్రపత్తులతో స్వాగతిద్దాం.

బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజు ఇదేనని ‘సూర్య సిద్ధాంతం’ అనే జ్యోతిష గ్రంథం తెలుపుతోంది. సృష్టి ప్రభవించిన రోజు ‘ప్రభవ’ అని జ్యోతిష సిద్ధాంత గ్రంథాలు చెబుతున్నాయి. కాలచక్రం అరవై సంవత్సరాలు పరిభ్రమించి... తిరిగి ప్రభవకు చేరుకుంటుంది. ఈ అరవై సంవత్సరాలకు అరవై పేర్లు. ఈ ఏడాది పేరు శివ స్వరూపమైన క్రోధి. సంవత్సర కాలంలో రెండు ఆయనాలు, ఆరు ఋతువులు, పన్నెండు మాసాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, రెండు పక్షాలు... ఇలా సూర్య, చంద్ర గ్రహాల ప్రమాణాలను అనుసరించి ప్రాచీన జ్యోతిష శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని నిర్దేశించారు. చాంద్రమానాన్ని అనుసరించేవారికి ఈ పద్ధతిలో విశిష్టత కనిపిస్తుంది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు... ప్రభవ. ఉత్తరాయణం, ఋతువులలో మొదటిది వసంత ఋతువు, చైత్రమాసం తొలిమాసం, పక్షాలలో మొదటిది శుక్ల పక్షం, పాడ్యమి తొలి తిథి. అంటే ఉగాది నాడు అన్నీ సంవత్సరంలో మొదటివే. ఏ నామ సంవత్సర ఉగాది అయినా ఈ పద్ధతిలో మార్పు ఉండదు. ఇదే విజ్ఞానశాస్త్రపరంగా మన పూర్వ ఋషుల ఔన్నత్యం. ఇప్పుడు రాబోతున్న క్రోధి... ప్రభవ నుంచి క్షయ వరకూ వచ్చే అరవై ఉగాదుల్లో ముప్ఫై ఎనిమిదోది.

ఉగాది రాబోయే సంవత్సరానికి పునాది. ఆ సంవత్సరంలో మన ఆశలు, ఆకాంక్షలు సఫలీకృతం కావడానికి విధివిధానాలను పెద్దలు నిర్దేశించారు. అవి అభ్యంగన స్నానం, ఇష్టదేవతారాధనం, దేవీప్రసాదంగా నింబకుసుమ భక్షణం, దేవాలయాల సందర్శనం, పంచాంగశ్రవణం. ఈ అయిదూ తప్పక ఆచరించాలి.

అభ్యంగనస్నానం: బ్రహ్మీ ముహూర్తాన లేచి, కాలకృత్యాల అనంతరం... శరీరానికి నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేయాలి. తిలకం పెట్టుకొని, నూతన వస్త్రాలను ధరించాలి. సంకల్పం చెప్పుకొని సూర్యారాధన చేయాలి. పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. ఇష్ట దేవతను భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి.

నింబకుసుమ భక్షణం: ఇదే ఉగాది పచ్చడి. షడ్రుచుల కలబోత. దాన్ని ఎలా చేయాలో శాస్త్రాలే వివరించాయి. వేప పూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి ముక్కలు, ఆవునెయ్యి, కారానికి మిరియాల పొడి, ఉప్పు... ఇంకా తేనె, అరటి పండ్ల ముక్కలు కలిపి చేసిన ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి... పరగడుపున ప్రసాదంగా స్వీకరించాలి. అందరికీ పంచాలి. ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఈ ప్రసాదం శరీరాన్ని రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.

పంచాంగశ్రవణం: ఉగాది నాడు ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయంలో దైవాలను దర్శించి, పూజించిన తరువాత... రాబోయే సంవత్సర ఫలాలను వివరించే పంచాంగాన్ని వినాలి. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అనే అయిదు అంగాలు కలిగినది. ఏడాది కాలాన్ని ప్రమాణంగా తీసుకొని... ఆ కాలంలో గ్రహాల సంచారం, వాటివల్ల కలిగే శుభాశుభ పరిణామాలు, వివిధ నక్షత్ర జాతకులు పొందే ఫలితాలను అది సవివరంగా చెబుతుంది. ఉపద్రవాలను, అశుభాలను నివారించుకొనే మార్గాన్ని సూచిస్తుంది.

జూ ఆయపిళ్ళ రాజపాప

Updated Date - Apr 05 , 2024 | 10:13 AM