Share News

పిల్లలూ... మీ కథ మాకు చెప్పండి!

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:38 AM

పిల్లలకు కథలు చెప్పే తీరిక పెద్దలకు కరువైన రోజుల్లో... పిల్లలు చెప్పే కథలు ఎవరు వింటారు? వారు రాసే కథలు ఎవరు ప్రచురిస్తారు? వారిలో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేవారెక్కడున్నారు? తనను వెంటాడిన ఈ ప్రశ్నలకు...

పిల్లలూ...  మీ కథ మాకు చెప్పండి!

పిల్లలకు కథలు చెప్పే తీరిక పెద్దలకు కరువైన రోజుల్లో... పిల్లలు చెప్పే కథలు ఎవరు వింటారు? వారు రాసే కథలు ఎవరు ప్రచురిస్తారు? వారిలో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేవారెక్కడున్నారు? తనను వెంటాడిన ఈ ప్రశ్నలకు... తనే పరిష్కారం కనుగొన్నారు 51 ఏళ్ళ తన్మయి కాలేబర్‌. పిల్లల్లో పఠనాసక్తిని, రచనాశక్తిని పెంపొందించడానికి ఆమె తీసుకున్న చొరవ వందలాది బాల రచయితల ప్రతిభను పాఠకలోకానికి పరిచయం చేస్తోంది.

‘‘అది 2020 లాక్‌డౌన్‌ సమయం. నాకు కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ కాలం గడిపే అవకాశం వచ్చింది. ముఖ్యంగా పిల్లలతో కథలు, కబుర్లు... అప్పుడే మా మేనల్లుడు ఒక నోట్‌బుక్‌లో తను రాసిన కథను నాకు చూపించాడు. వాడు ఆ కథను చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. అది ఎక్కడైనా ప్రచురితమైతే బాగుణ్ణనిపించింది. పత్రికలు మొదలు ఆన్‌లైన్‌ వరకూ ఎన్నో మార్గాల్లో ప్రయత్నించాను. కానీ ఎలాంటి అవకాశం కనిపించలేదు. మా మేనల్లుడిలాంటి ఎందరో బాల రచయితలకు సరైన వేదిక లేకపోవడంతో... వారి సృజన మరుగున పడిపోతోందని అర్థమయింది. ‘ఎక్కడెక్కడో వెతికేకన్నా... అలాంటి వేదికను నేనే ఎందుకు ఏర్పాటు చేయకూడదు?’ అనుకున్నాను. బాల రచయితలకే ప్రత్యేకమైన ‘స్టోరీస్‌ బై చిల్డ్రన్‌’ను 2020 నవంబర్‌లో ప్రారంభించాను.


అదే వ్యాపకమైపోయింది...

నా నేపథ్యం గురించి చెప్పాలంటే... కర్ణాటకలోని బెళగావ్‌ నా స్వస్థలం. అందరు పిల్లల్లాగానే గడిచిన బాల్యం నాది. ఎంబీఏ పూర్తయ్యాక... బెంగళూరులో ఒక ఫైనాన్స్‌ సర్వీసెస్‌ కంపెనీలో రెండేళ్ళపాటు ఉద్యోగం చేశాను. పెళ్ళయిన తరువాత... నేను, నా భర్త రాజీవ్‌ కలిసి ఒక స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీనీ, ఫైనాన్స్‌ స్కూల్‌ను ప్రారంభించాం. కానీ కొన్నేళ్ళకు వాటిని మూసెయ్యాల్సి వచ్చింది. నా భర్త ఫైనాన్స్‌ టీచింగ్‌ వైపు మళ్ళారు. నేను కుటుంబ బాధ్యతలకు పరిమితమైపోయాను. ‘స్టోరీస్‌ బై చిల్డ్రన్‌’ను ప్రారంభించాక అదే నాకు ప్రధానమైన వ్యాపకంగా మారిపోయింది. పిల్లల్లో పుస్తకాలు చదవడం, రచనలు చేయడం పట్ల ఆసక్తిని ప్రోత్సహించడం, ఏడు నుంచి పద్ధెనిమిదేళ్ళ మధ్య వయసు వారి రచనలను ప్రచురించడం... ఇదీ దాన్ని ప్రారంభించడం వెనుక నా ప్రధానమైన ఉద్దేశం. సోషల్‌ మీడియా ద్వారా దీని గురించి ప్రకటించినప్పుడు... అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి నెలలోనే ఎందరో పిల్లలు తమ కథల్ని పంపించారు. కథల పోటీలను, 11-18 మధ్య వయసువారికి వార్షిక నవలల పోటీలను నిర్వహించడానికి ఇది స్ఫూర్తినిచ్చింది. నేను, నా మిత్రులు ఒక బృందంగా ఏర్పడ్డాం. పోటీల్లో నెగ్గిన పుస్తకాల ప్రచురణ మొదలుపెట్టాం. వీటన్నిటికోసం ఒక విధానాన్ని నిర్దేశించుకున్నాం. పిల్లలు తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకున్న తరువాత... వారికి ప్రత్యేకంగా ఒక డ్యాష్‌బోర్డ్‌ కేటాయిస్తాం. వారు అందులో తమ కథలను పోస్ట్‌ చెయ్యడానికి, స్టేటస్‌ చెక్‌ చెయ్యడానికి, పోటీల్లో పాల్గొనడానికి ఆప్షన్స్‌ ఉంటాయి. అప్‌లోడ్‌ చేసిన కథలకు సమీక్ష ఉంటుంది. మాకు సుమారు 15 మంది రివ్యూవర్స్‌తో ఒక బోర్డ్‌ ఉంది. వారిలో ప్రిన్సిపాల్స్‌, టీచర్లు, సాహిత్యాభిమానులు, ఇంగ్లీష్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రతి కథనూ ఒక సమీక్షకుడు పరిశీలిస్తారు. కథావస్తువు, రాసిన విధానం లాంటివి విశ్లేషించడంతో పాటు... ఆ కథ ఆ బాల రచయిత సొంతమేననీ, ఎక్కడినుంచీ ఎలాంటి చౌర్యం చేయలేదనీ వివిధ మాధ్యమాల సాయంతో నిర్ధారించుకుంటారు. ఆ తరువాత... దాన్ని వీలైనన్ని తక్కువ మార్పులతో ప్రచురిస్తాం. ఎందుకంటే పిల్లల ఊహాశక్తిలోని సారాన్ని సజీవంగా ఉంచాలనేది మా కోరిక.


1,800 కథలు, 14 సంకలనాలు

50 కథలతో ప్రారంభమై... 1,800కు పైగా ఆంగ్ల కథల ప్రచురణ వరకూ మా కృషి విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ అయ్యారు. ప్రచురించిన సంకలనాలు పధ్నాలుగు వరకూ ఉన్నాయి. క్రమం తప్పకుండా మా వెబ్‌సైట్‌ సందర్శించేవారు దాదాపు పదివేల మంది ఉన్నారు. ఈ ప్రయత్నానికి నా భర్త రాజీవ్‌ పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రారంభంలో మూడున్నర లక్షల పెట్టుబడి కూడా ఆయనే ఇచ్చారు. 2021లో... ‘బ్రిటానియా మేరీ మైస్టార్టప్‌ కంటె్‌స్ట’లో పోటీ పడాల్సిందిగా ప్రోత్సహించారు. కాస్త తటపటాయించినా... అప్లై చేశాను. యాభై మంది ఫైనలి్‌స్టలలో నిలిచాను. ఆ తరువాత... పోటీలో ‘స్టోరీస్‌ బై చిల్డ్రన్‌’ అయిదో స్థానం... పది లక్షల రూపాయల అవార్డ్‌ లభించాయి. ఇప్పుడు పాఠశాలల్లో స్టోరీ టెల్లింగ్‌ సెషన్స్‌, పోటీలకు స్పాన్సర్‌ షిప్‌లు, పుస్తకాల్లో ప్రకటనలు తదితర మార్గాల్లో మాకు ఆదాయం వస్తోంది. కథలు, కథలు, కవితల ప్రచురణతో పాటు... బాల రచయితల కోసం ఒక క్లబ్‌ నడుపుతున్నాం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల పిల్లలు నెలకు ఒకసారి ఆన్‌లైన్‌లో కలుసుకొని... పుస్తకాలు, సాహిత్యం గురించి చర్చిస్తారు. బాల రచయితల ఉత్సాహాన్ని చూసిన తరువాత... ప్రత్యేకంగా వారికోసమే ఒక లిటరరీ ఫెస్టివల్‌ను త్వరలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో బాల రచయితల కమ్యూనిటీ ఏర్పాటు చేయడం, బాల సాహిత్యంలో వారిని, మా సంస్థను మార్గదర్శకులుగా నిలపడం... ఇవీ మా ఆశయాలు.’’

Updated Date - Jul 10 , 2024 | 12:38 AM