Share News

Sarees : చీరల్లో చిత్రాలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:17 AM

ప్రాచీన భారతీయ జానపద చిత్రలేఖనం, కళాత్మక శైలులు నేటికీ భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రశంసలందుకుంటూ ఉండడానికి కారణం ఆ చిత్రకళలు, మహిళల మనసులను ఆకట్టుకునే చీరలను

Sarees : చీరల్లో చిత్రాలు

ప్రాచీన భారతీయ జానపద చిత్రలేఖనం, కళాత్మక శైలులు నేటికీ భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రశంసలందుకుంటూ ఉండడానికి కారణం ఆ చిత్రకళలు, మహిళల మనసులను ఆకట్టుకునే చీరలను అలంకరించడమే! జానపద చిత్ర శైలులతో మగువల మనసులను గెలుచుకుంటున్న ఆ చీరలు ఇవే!

తంజావూరు

తంజావూరు పెయింటింగ్స్‌ గురించి తెలియని వారుండరు. క్రీ.శ 1600 సంవత్సరంలో ఉద్భవించిన తంజోర్‌ లేదా తంజావూరు చిత్రకళను తంజావూరు నాయకులు ప్రోత్సహించారు. బంగారు రేకులు ఉపయోగించడం మూలంగా తంజావూరు చిత్రలేఖనాలు రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ఇదే రకమైన చిత్రశైలిలో తంజావూరు చీరలు కూడా రూపొందుతున్నాయి. నెమలి పింఛం డిజైన్లను కలిగి ఉండే తంజావూరు చీరలు, ప్రపంచవ్యాప్త మహిళలను కూడా ఆకట్టుకుంటున్నాయి

మధుబని

ఈ చిత్రకళకు మిథిల కళ అనే మరో పేరు కూడా ఉంది. ఒకప్పుడు నేపాల్‌లో ఉన్న జనక సామ్రాజ్యం (రామాయణంలో పేర్కొన్న సీతమ్మ వారి తండ్రి) నేటి బీహార్‌ పరిధిలోకి చేరుకుంది. మధుబని కళకు పుట్టినిల్లైన ఈ ప్రాంతానికి చెందిన మధుబని కళ.... పువ్వులు, లతలు, దేవతామూర్తుల చిత్రాలతో కూడిన వాల్‌ మ్యూరల్స్‌తో ప్రసిద్ధి పొందింది. ఇప్పుడీ చిత్రకళలే చీరలకెక్కి మధుబని చీరలుగా పేరు పొందుతున్నాయి.

కలంకారి

కలంకారి అంటే కలంతో బొమ్మలు గీయడమని అర్థం. ఈ కళ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో ప్రసిద్ధి పొందింది. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, శ్రీకాళహస్తి కలంకారి కళకు పేరు పొందాయి. ఈ చిత్ర శైలిలో రూపొందుతున్న కాటన్‌, పట్టు చీరలు సర్వత్రా మహిళల ఆదరణ పొందుతూనే ఉన్నాయి. పువ్వులు, లతలు, జీవనవిధానాలను ప్రతిబింబించే కలంకారి చిత్రకళ కంటికింపైన రంగులతో అలరిస్తూ ఉండడం విశేషం!

గోండు

మధ్యప్రదేశ్‌లోని గోండి తెగ చిత్రకళకు ప్రకృతే ప్రేరణ. ఆకర్షణీయమైన రంగులతో కూడిన లతలు, పువ్వులు గోండు చిత్రాల్లో కనిపిస్తాయి. ఇదే చిత్రశైలితో రూపొందిన కాటన్‌ చీరలు ప్రత్యేకతను చాటుకుంటూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటూ ఉండడడం విశేషం.

చేర్యాల

తెలంగాణాలోని చేర్యాలలో పుట్టిన ఈ కళ నక్షి కుటుంబాలకే సొంతం. తంజావూరు, మైసూరు పెయింటింగ్‌లకు సమీపంగా ఉండే ఈ చిత్రకళ గ్రామీణ నేపథ్యాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇదే శైలిని అనుసరిస్తూ రూపొందుతున్న చేర్యాల చీరలు కూడా అంతే మనోహరంగా మహిళల మనసులను దోచుకుంటున్నాయి.

Updated Date - Jun 06 , 2024 | 05:17 AM