Share News

ధ్యాన మూలం గురోర్మూర్తిః

ABN , Publish Date - May 02 , 2024 | 11:32 PM

ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితిని చేరడానికి మూడు సోపానాలను పూర్వులు పేర్కొన్నారు. వాటిలో మొదటి మెట్టు ధ్యానం, రెండో మెట్టు ధారణ, మూడో మెట్టు సమాధి (నిర్విచార స్థితి). మీకు సత్యాన్వేషణపై అభిలాష ఉన్నప్పుడు... మీరు ఆరాధించే దైవం మీద మీ చిత్తాన్ని నిలకడగా నిలపడాన్నే ‘ధ్యానం’ అంటారు.

ధ్యాన మూలం గురోర్మూర్తిః

సహజయోగ

ధ్యాత్మికంగా అత్యున్నత స్థితిని చేరడానికి మూడు సోపానాలను పూర్వులు పేర్కొన్నారు. వాటిలో మొదటి మెట్టు ధ్యానం, రెండో మెట్టు ధారణ, మూడో మెట్టు సమాధి (నిర్విచార స్థితి). మీకు సత్యాన్వేషణపై అభిలాష ఉన్నప్పుడు... మీరు ఆరాధించే దైవం మీద మీ చిత్తాన్ని నిలకడగా నిలపడాన్నే ‘ధ్యానం’ అంటారు. ‘ధారణ’ అంటే... ధ్యానం కోసం ఏకాగ్రతతో చేసే సంపూర్ణ ప్రయత్నం.

కాబట్టి మీరు కొలిచే దైవాన్ని ఏకాగ్రతతో స్మరించుకోండి. మీ చిత్తాన్ని ఆ దైవం మీద లగ్నం చేయండి. మొదట్లో చిత్తం చంచలంగా ఉంటుంది. క్షణక్షణం దారి తప్పుతూ ఉంటుంది. అప్పుడు మీరు ధ్యానంలో ఉంటారు కాని... ధారణ ఉండదు. ధారణ అనే స్థితి చాలా ముఖ్యమైనది.

ఈ స్థితిలో మీ చిత్తం భగవంతునితో అనుసంధానం అవుతుంది. ఎప్పుడైతే ధ్యాన, ధారణ స్థితులు మీలో సంపూర్ణ వికాసం పొందుతాయో... అప్పుడు మీరు సమాధి స్థితిని చేరుకుంటారు. కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది, సహజయోగ సాధన చేస్తున్నవారికి ఈ స్థితిని చేరుకోవడం చాలా సులభం.

ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం

మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః అన్నారు పూర్వులు. మీరు మీ గురువుదగ్గర, మీరు ఆరాధించే దైవం దగ్గర మోకరిల్లి, మీరు ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని, పరిస్థితులను, మానసిక స్థితిని ప్రసాదించాలని వేడుకోవాలి.

అహంకారానికి అతీతంగా... భగవంతుడితో మమేకమై, మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే ధ్యానంలో ప్రవేశిస్తారు. ధ్యానం ఉదయం, సాయంత్రం... రెండు పూటలా చేయడం మంచిది. ఉదయం చేసే ధ్యానంలో... మనల్ని మనం అంతర్ముఖంగా పరిశీలించుకోవాలి.

‘నేను ఆధ్యాత్మికంగా ఎంత లోతుకు వెళ్ళగలిగాను? నా ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తున్నవేమిటి?’ అని ప్రశ్నించుకోవాలి. సాయంత్రం ధ్యానంలో... ‘నేను ఇతరులకు ఎంతమేరకు సహాయపడగలిగాను? భగవత్కార్యాల్లో ఎంతమేరకు పాలుపంచుకోగలిగాను?’ అని మదింపు చేసుకోవాలి. ధ్యానంలో... ఎలాంటి ఆలోచనలూ లేని నిర్విచార స్థితికి చేరుకొనే మార్గంలో... ఆ ఆత్మపరిశీలన అవసరం.


ధ్యానంలో మనం చేరుకొనే ఆ ఆలోచనారహిత స్థితి... కొద్ది సేపే అయినా... భగవంతుడితో మనల్ని అనుసంధానిస్తుంది. తద్వారా మన ప్రార్థనలు భగవంతుణ్ణి చేరుతాయి. ప్రార్థనలో మనలో కదిలే ప్రశ్నలకు, సందేహాలకు భగవంతుడు ఇచ్చే సమాధానం, పరిష్కారం ధ్యానం ద్వారానే మనకు చేరుతాయి. అది మనసుకు ఆహ్లాదాన్ని, ఓర్పును ఇస్తుంది. మన సమస్యలను తీరుస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు అతీతంగా మారుతాం. మనల్ని మనం అదుపు చేసుకోగలుగుతాం.

ధ్యానం వల్ల కుడి, ఎడమ పార్శ్వాల్లోని సమస్యలను వదిలేసి... మధ్యస్థంగా ఉంటారు. అంటే, గతానికి, భవిష్యత్తుకు సంబంధించిన అనవసరమైన ఆలోచనలను వదిలేస్తారు. వర్తమానంలో ఉంటారు. మీ వివేకాన్ని, ఆనందాన్ని అనుభూతి చెందుతారు. అదే విలంబ స్థితి.


పూర్వకాలంలో మునులు, ఋషులు ఐహిక బంధాలను వదులుకొని, అడవులకో, హిమాలయాలకో వెళ్ళి తపస్సు చేసుకొనేవారు. సంసారాలను వదలనక్కరలేకుండా, ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా... ఎప్పుడైనా, ఎక్కడైనా చేసుకోగలిగే ప్రక్రియను శ్రీమాతాజీ నిర్మలాదేవి సహజయోగ స్థాపన ద్వారా మానవాళికి అందించారు. కుండలినీ జాగృతిద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది, తమ దైనందిన జీవితంలో చేసుకొనే ధ్యానంతో... నిర్విచార స్థితిని, ఆ తరువాత నిర్వికల్ప స్థితిని... అంటే భగవంతుడిపట్ల ఎలాంటి సందేహాలూ లేని స్థితిని పొందగలరని నిరూపించారు.

సహజయోగ సాధనలో ధ్యానం... మన దైనందిన జీవితంతో సమ్మిళితమై ఉంటుంది. ఈ ధ్యానంలో మనల్ని, మన ఆరోగ్యాన్నీ సమతుల్యం చేసుకోవడం, మెరుగుపరుచుకోవడం ఒక సాధారణ విషయం. అంతేతప్ప సహజయోగ ధ్యానం ఆరోగ్యం కోసమో, రోగనివారణ కోసమో మాత్రమే కాదు. అందుకు అతీతమైనది.

డాక్టర్ పి. రాకేష్ 8988982200

పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి , సహజయోగా ట్రస్ట్ , తెలంగాణ .

Updated Date - May 03 , 2024 | 06:15 AM