Share News

పనీర్‌తో పసందుగా

ABN , Publish Date - Apr 27 , 2024 | 02:19 AM

వెజ్‌లో పనీర్‌కు ఉండే గిరాకీనే వేరు. మెత్తని పనీర్‌ ముక్కలతో చేసిన డిష్‌లను తినటానికి నాన్‌వెజ్‌ ప్రియులూ ఇష్టపడతారు. పనీర్‌ కట్‌లెట్‌, పనీర్‌ మెజిస్టిక్‌, పనీర్‌ టిక్కా లాంటి వంటలను సులువుగా చేసుకోండిలా...

పనీర్‌తో పసందుగా

వెజ్‌లో పనీర్‌కు ఉండే గిరాకీనే వేరు. మెత్తని పనీర్‌

ముక్కలతో చేసిన డిష్‌లను తినటానికి నాన్‌వెజ్‌ ప్రియులూ

ఇష్టపడతారు. పనీర్‌ కట్‌లెట్‌, పనీర్‌ మెజిస్టిక్‌, పనీర్‌ టిక్కా లాంటి వంటలను సులువుగా చేసుకోండిలా...

పనీర్‌ టిక్కా

కావాల్సిన పదార్థాలు

పనీర్‌ క్యూబ్స్‌- 6, పెరుగు- అరకప్పు, పసుపు- అరటీస్పూన్‌, కారం పొడి- 1 టీస్పూన్‌, ధనియాల పొడి- అర టీస్పూన్‌, జీలకర్ర పొడి- పావు టీస్పూన్‌, గరం మసాలా- అర టీస్పూన్‌, కసూరీ మేతీ- అర టీస్పూన్‌, చాట్‌ మసాలా- అర టీస్పూన్‌, జింజర్‌, గార్లిక్‌ పేస్ట్‌- టీస్పూన్‌, శనగపిండి- 2 టీస్పూన్లు, నిమ్మకాయ రసం- టేబుల్‌ స్పూన్‌, చతురస్రాకార ఆనియన్‌ పెటల్స్‌- 8, రెడ్‌ క్యాప్సికమ్‌ క్యూబ్స్‌- 8, గ్రీన్‌ క్యాప్సికమ్‌ క్యూబ్స్‌- 8, నూనె- టీస్పూన్‌

తయారీ విధానం

బౌల్‌లో పెరుగుతో పాటు పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరీ మేతీ, చాట్‌ మసాలా, జింజర్‌-గార్లిక్‌ పేస్ట్‌, శనగపిండి వేశాక నిమ్మకాయ రసం కలపాలి. చివరలో తగినంత ఉప్పువేసి స్పూన్‌తో మిశ్రమాన్నంతా బాగా కలపాలి. ఎర్రటి పేస్ట్‌లా వస్తుంది. ఇందులోకి పనీర్‌, ఆనియన్‌ పెటల్స్‌, క్యాప్సికమ్‌ క్యూబ్స్‌ వేశాక నూనె కలపాలి.

స్పూన్‌తో మిశ్రమాన్ని కలపాలి. దీని వల్ల పనీర్‌ ముక్కలకు బాగా పడుతుంది. దీన్ని ముప్పావు గంట మారినేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత టిక్కా స్టిక్స్‌ తీసుకుని ఆనియన్‌, రెడ్‌ క్యాప్సికమ్‌, గ్రీన్‌ క్యాప్సికమ్‌ క్యూబ్స్‌ తర్వాత పనీర్‌ క్యూబ్‌ గుచ్చాలి. ఆ తర్వాత మళ్లీ అదే వరుసలో స్టిక్‌కు గుచ్చాలి.

టిక్కా ప్యాన్‌మీద బ్రష్‌తో నూనె పూసి ఈ స్టిక్స్‌ను ఉంచి గ్రిల్‌ చేసుకోవాలి. అన్నివైపులా కాల్చుకోవాలి. పనీర్‌ టిక్కా రెడీ. పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.


పనీర్‌

మెజిస్టిక్‌

కావాల్సిన పదార్థాలు : పొడవుగా కట్‌ చేసిన పనీర్‌ ముక్కలు- పావు కేజీ, కార్న్‌ఫ్లోర్‌- రెండున్నర టేబుల్‌ స్పూన్లు, మైదా- రెండున్నర టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత, అల్లం, వెల్లుల్లిపేస్ట్‌- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, పసుపు- తగినంత, నూనె- మూడున్నర టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- ముప్పావు టీస్పూన్‌, సన్నగా తరిగిన వెల్లుల్లి మిశ్రమం- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు- 15, ఎండు మిరపకాయలు- 2, తరిగిన ఉల్లిపాయ ముక్కలు- రెండున్నర టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి- 3 (సన్నగా తరగాలి), క్యాప్సికమ్‌- 1 (సన్నగా పొడవుగా కట్‌ చేసుకోవాలి), కారం పొడి- తగినంత, గరం మసాలా- ముప్పావు టీస్పూన్‌, ధనియాల పొడి- ముప్పావు టీస్పూన్‌, జీలకర్ర పొడి- ముప్పావు టీస్పూన్‌, కరివేపాకులు- 10, పెరుగు- ముప్పావు కప్పు, పుదీనా- టేబుల్‌ స్పూన్‌

తయారీ విధానం : బౌల్‌లో కార్న్‌ఫ్లోర్‌, మైదా, ఉప్పు, అల్లం- వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ జావగా కాకుండా మిర్చిబజ్జీలకోసం శనగపిండి కలిపినట్లు కలపాలి. ఈ కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమంలో పనీర్‌ ముక్కలను ముంచి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

మరో ప్యాన్‌లో మూడు స్పూన్ల నూనె వేసి అందులో జీలకర్ర, జీడిపప్పు, ఎండిన మిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి ఉల్లిపాయల రంగు మారేంత వరకూ గరిటెతో కదుపుతూ వేయించాలి. ఆ తర్వాత కారంపొడి, గరం మసాలా, తగినంత ఉప్పుతో పాటు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కరివేపాకు, పెరుగు వేసి మూడు నిముషాల పాటు కలపాలి. పుదీనా వేసి రెండు నిముషాలు కలిపిన తర్వాత వేయించి పక్కనబెట్టుకున్న పనీర్‌ ముక్కలు వేసి.. వీటికి మిశ్రమం పట్టేట్లు బాగా కలపాలి. పనీర్‌ మెజిస్టిక్‌ రెడీ.

పనీర్‌

కట్‌లెట్‌

కావాల్సిన పదార్థాలు : తురిమిన పనీర్‌ మిశ్రమం- 2 కప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు- 2, ఉల్లిపాయ ముక్కలు- 2 టేబుల్‌ స్పూన్లు, తురిమిన క్యారెట్‌- అర కప్పు, కొత్తిమీర- 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి-1 (సన్నగా తరగాలి), అల్లం పేస్ట్‌- అర టీస్పూన్‌, కారం పొడి- అర టీస్పూన్‌, ఆమ్‌చూర్‌- అర టీస్పూన్‌, గరం మసాలా- అరటీస్పూన్‌, ఉప్పు- తగినంత, కార్న్‌ఫ్లోర్‌- ముప్పావు కప్పు, మైదా- 2 టేబుల్‌ స్పూన్లు, పెప్పర్‌- పావు టీస్పూన్‌, ఎండిన బ్రెడ్‌ ముక్కలు- 2, నూనె- ఫ్రైకి తగినంత

తయారీ విధానం : బౌల్‌లో పనీర్‌తో పాటు తొక్కతీసి పెట్టుకున్న బంగాళ దుంపలను మెత్తగా పిసికి వేయాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌, కొత్తమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌, కారం పొడి, ఆమ్‌చూర్‌, గరం మసాలా, రెండు టేబుల్‌ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌తో పాటు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చపాతీ ముద్దలా మెత్తగా చేసుకోవాలి.

మరొక బౌల్‌లో మిగిలిన కార్న్‌ఫ్లోర్‌, మైదా వేశాక పెప్పర్‌ను నలగ్గొట్టి వేసి కొద్దిగా ఉప్పువేసి అరకప్పు నీళ్లు వేసి స్పూన్‌తో బాగా మిక్స్‌ చేయాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మరో బౌల్‌లో బ్రెడ్‌ ముక్కలను చేత్తో పిసికి పొడిలా చేసుకోవాలి.

ఆ తర్వాత పనీర్‌ ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని పెద్ద బిస్కెట్‌ అంత సైజులో గుండ్రంగా చేసుకోవాలి. దీన్ని మైదా పిండిలో బాగా ముంచి బ్రెడ్‌ ముక్కల్లో వేయాలి. బ్రెడ్‌ ముక్కలు దీనికి అంటుకుంటాయి. ఈ పనీర్‌ కట్‌లెట్స్‌ను రెండు వైపులా రంగు మారేంత వరకూ కాల్చుకోవాలి. ఈ పనీర్‌ కట్‌లెట్స్‌ను వేడివేడిగా పుదీనా చట్నీతో లేదా టమోటా కెచ్‌పతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - Apr 27 , 2024 | 05:40 AM